Telugu Global
Sports

ఫలించిన పోరాటం..ఇరాన్ మహిళలకు సాకర్ స్టేడియాలలో ప్రవేశం!

ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలను కరుణించింది. స్టేడియాలకు వచ్చి ఫుట్ బాల్ మ్యాచ్ లను చూసే అవకాశం కల్పించింది.

ఫలించిన పోరాటం..ఇరాన్ మహిళలకు సాకర్ స్టేడియాలలో ప్రవేశం!
X

ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలను కరుణించింది. స్టేడియాలకు వచ్చి ఫుట్ బాల్ మ్యాచ్ లను చూసే అవకాశం కల్పించింది...

ఇరాన్ మహిళల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. షరియత్ చట్టాలను కర్కశంగా అమలు చేసే ఇరాన్ మతపెద్దల ప్రభుత్వం ఓ మెట్టు దిగివచ్చింది. స్టేడియాలకు వచ్చి తమకు ఇష్టమైన ఫుట్ బాల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది.

16 జట్ల సాకర్ లీగ్ కు అనుమతి...

ఇరాన్ లో ఫుట్ బాల్ క్రీడకు ఉన్న క్రేజు అంతాఇంతా కాదు. ఆసియాలోని అత్యుత్తమ సాకర్ జట్లలో ఒకటిగా ఇరాన్ కు సైతం పేరుంది. ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న అతికొద్ది ఆసియాజట్లలో ఇరాన్ ఒకటి. కుస్తీ తరువాత అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడ ఫుట్ బాల్ మాత్రమే. అయితే..ఇప్పటి వరకూ ఇరాన్ మహిళలు స్టేడియాలకు వచ్చి ఫుట్ బాల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడటం నిషేధం. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత నుంచి మహిళలపై నిషేధం అమలులో ఉంది. నిక్కర్లు ధరించి పురుషుల ఆడే ఫుట్ బాల్ మ్యాచ్ లను మహిళలు చూడటాన్ని ఇరాన్ మతగురువులు ఇంతకాలం తీవ్రంగా పరిగణిస్తూ వచ్చారు.

తమ కుటుంబసభ్యులతో కలసి స్టేడియాలకు వచ్చి ఫుట్ బాల్ మ్యాచ్ లను వీక్షించే అవకాశం ఇరానీ మహిళలకు లేదు. తమను ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడటానికి స్టేడియాలలోకి అనుమతించాలంటూ ఇరాన్ మహిళలు గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ పెద్దలను వేడుకొంటూ వస్తున్నారు.

తగిన సదుపాయాలు లేకనే అనుమతి నిరాకరణ...

ఇరాన్ ఫుట్ బాల్ స్టేడియాలకు మహిళలు భారీసంఖ్యలో వచ్చి మ్యాచ్ లు చూడటానికి తగిన సౌకర్యాలు లేకపోడం కారణంగానే ఇంతకాలం అనుమతించలేదని జాతీయ ఫుట్ బాల్ సంఘం ప్రతినిధి మెహ్దీ తాజ్ తెలిపారు.

అయితే..16 జట్లు తలపడే జాతీయ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ లకు మహిళలను అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇష్ఫహాన్, కెర్మాన్, అహ్వాజ్ నగరాలతో పాటు రాజధాని టెహ్రాన్ లోని ప్రధాన సాకర్ స్టేడియాలలో సౌకర్యాలు మెరుగు పరచినట్లు ప్రకటించారు. మహిళలు సైతం వచ్చి మ్యాచ్ లు చూసే అవకాశం ఉందని, కొన్ని ప్రధానమ్యాచ్ లకు మాత్రమే మహిళలను..ప్రధానంగా యువతులను అనుమతిస్తామని వివరించారు.

టెహ్రాన్ ఫుట్ బాల్ క్లబ్ తో మెస్ కెర్మాన్ క్లబ్ జట్టు తలపడే మ్యాచ్ కు మహిళలను అనుమతించనున్నట్లు తెలిపారు.

2019లో తొలిసారిగా అనుమతి...

2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత పోటీలలో భాగంగా టెహ్రాన్ అజాదీ స్టేడియం వేదికగా ఇరాన్ - కాంబోడియా జట్ల నడుమ జరిగిన మ్యాచ్ కు 2019లో 4వేల మంది మహిళలను తొలిసారిగా అనుమతించారు.

2019లోనే పురుషుల వేషంలో ఫుట్ బాల్ స్టేడియంలోకి ప్రవేశించిన సహార్ కొడియారీ అనే మహిళను ఇరాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకొని జైలు శిక్ష విధించింది. ఆ తరువాత మరణ శిక్ష అమలు చేసింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా తీవ్రనిరసన వ్యక్తం కావడంతో ఇరాన్ ప్రభుత్వం, మతగురువులు పునరాలోచనలో పడ్డారు.

దాని ఫలితమే..మహిళలను ఫుట్ బాల్ స్టేడియాలలోకి అనుమతిస్తూ నిర్ణయం ప్రకటించారు.

First Published:  2 March 2024 3:30 AM GMT
Next Story