Telugu Global
Sports

జైపూర్ జవానీ...యశస్వీ జైశ్వాల్ కహానీ!

ముంబై ఫుట్ పాత్ పైన తలదాచుకొని..పానీపూరీలతో కడుపు నింపుకొన్న యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ ..ఐపీఎల్ -16వ సీజన్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు.

జైపూర్ జవానీ...యశస్వీ జైశ్వాల్ కహానీ!
X

ముంబై ఫుట్ పాత్ పైన తలదాచుకొని..పానీపూరీలతో కడుపు నింపుకొన్న యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ ..ఐపీఎల్ -16వ సీజన్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు.

పవర్ హిట్టింగ్ తో ప్రత్యర్థిజట్ల బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు....

భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా..అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ఐపీఎల్ ప్రతిభావంతులైన ఎందరో యువక్రికెటర్లకు వేదికగా..వెలుగులోకి తీసుకు వచ్చింది. అలాంటి వారిలో ముంబై కమ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అందరికంటే ముందుంటాడు.

ముంబై ఫుట్ పాత్ ల నుంచి....

ఉత్తరప్రదేశ్ లోని బదోహీలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుగురు సంతానంలో ఒకడైన యశస్వి జైశ్వాల్ కు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఎంతో మక్కువ. గొప్పఆటగాడు కావాలని కలలు కంటూ ముంబైకి తరలి వచ్చాడు.

ముంబై మహానగరంలో కూడుగూడు కోసం అల్లాడిన, నానాపాట్లు పడిన యశస్వి ఫుట్ పాత్ పై వేసుకొన్న టెంట్ లో ఉంటూ..ఓపానీపూరీ దుకాణంలో పని చేస్తూ క్రికెట్ సాధన మొదలు పెట్టాడు.

తలదాచుకోడానికి తగిన చోటులేని యశస్విలోని ప్రతిభను క్రికెట్ శిక్షకుడు జ్వాలాసింగ్ గుర్తించి శాంతాక్రజ్ లోని తన క్రికెట్ అకాడమీలో ఆశ్రయం కల్పించారు. దిక్కూమొక్కూలేని యశస్వికి తానే పెద్దదిక్కుగా మారి చక్కటి క్రికెటర్ గా తీర్చి దిద్దారు.

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ -19 ప్రపంచకప్ లో పాల్గొని అత్యుత్తమంగా రాణించడంతో యశస్వి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు జ్వాలాసింగ్ చట్టపరంగా యశస్వి గార్డియన్ గా బాధ్యతలు తీసుకొని మరింతగా తీర్చిదిద్దారు.

ముంబై రంజీజట్టుతో పాటు భారత-ఏ జట్టులోనూ చోటు సంపాదించిన యశస్వి నిలకడగా రాణిస్తూ..జైపూర్ ఫ్రాంచైజీ సభ్యుడిగా ఐపీఎల్ లో అడుగుపెట్టాడు.

జోస్ బట్లర్ జోడీగా....

ప్రపంచ మేటి ఓపెనర్ జోస్ బట్లర్ సహ ఆటగాడిగా ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఆడటం యశస్వికి ఎంతో మేలు చేసింది. పైగా మాస్టర్ సచిన్, బట్లర్ నాణ్యమైన బ్యాట్లను యశస్వికి బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు.

భారత-ఏ జట్టులో సభ్యుడిగా అత్యంత పిన్నవయసులో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2022 సీజన్లో యశస్వి తన సత్తా చాటుకోడం ద్వారా స్టార్ బ్యాటర్ గా అవతరించాడు.

ప్రస్తుత 2023 సీజన్లో ఇప్పటి వరకూ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన 12 మ్యాచ్ ల్లో యశస్వి ఓ సెంచరీతో సహా 575 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేస్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఒక్క ఇన్నింగ్స్ తో ఐదురికార్డులు...

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో యశస్వి విశ్వరూపమే ప్రదర్శించాడు. పవర్ హిట్టింగ్ తో వీరవిహారమే చేశాడు. కేవలం 13 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ..లక్నో కెప్టెన్ రాహుల్, కోల్ కతా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ల పేరుతో సంయుక్తంగా ఉన్న 14 బంతుల హాఫ్ సెంచరీ రికార్డును యశస్వి తెరమరుగు చేశాడు.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన మిరాజ్ అహ్ సాన్ (లగ్జెంబర్గ్ ), మార్కుస్ ట్రెస్కోథిక్ ( సోమర్ సెట్ ), కోమిల్లా, సునీల్ నరైన్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, హజ్రతుల్లా జజాయ్ ల సరసన యశస్వి చోటు సంపాదించాడు.

మొత్తం 57 బంతులు ఎదుర్కొని 98 పరుగులతో అజేయంగా, మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. 5 సిక్సర్లు, 13 బౌండ్రీలతో వీరబాదుడు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 2.5 ఓవర్లలోనే ఈ ఘనత సాధించిన తొలి ఐపీఎల్ బ్యాటర్ గా నిలిచాడు.

మ్యాచ్ లో తమ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కోల్ కతా కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ లో 26 పరుగులు బాది మరో రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు.

2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ ఆరు బంతుల్లో సాధించిన 24 పరుగుల రికార్డును యశస్వి అధిగమించాడు.

2020 సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన అన్ క్యాప్ డే ప్లేయర్ గా ఇషాన్ కిషన్ పేరుతో ఉన్న 516 పరుగుల రికార్డును సైతం యశస్వి తెరమరుగు చేశాడు.

ప్రస్తుత సీజన్ లీగ్ లో ఇప్పటికే ఆడిన 12 మ్యాచ్ ల్లోనే 575 పరుగులు సాధించిన యశస్వి..మిగిలిన రెండురౌండ్లలోనూ ఇదేజోరుతో ఆరెంజ్ క్యాప్ అందుకొన్నా ఆశ్చర్యం లేదు.

12 రౌండ్లలో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు...

ప్రస్తుత 16వ సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 12 రౌండ్లలో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్న ఏకైక ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మాత్రమే. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో యశస్వి ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ముంబై మహానగరంలో ఒకప్పుడు నిలువనీడ లేక, ఖాళీ కడుపుతో గడిపిన యశస్వీ ప్రస్తుతం జైపూర్ ఫ్రాంచైజీ నుంచి సీజన్ కు 4 కోట్ల రూపాయలు వేతనంగా అందుకొంటున్నాడు.

నవతరం క్రికెటర్లకు యశస్వి జైశ్వాల్ పోరాటం, జీవితం స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది.

First Published:  12 May 2023 2:29 PM GMT
Next Story