Telugu Global
Sports

ప్రపంచకప్ క్రికెట్ తో బీజెపీ రాజకీయం!

ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం రాజ్యమేలుతున్న మనదేశంలో రాజకీయాలకు కాదేదీ అనర్హమన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను సైతం అధికారపార్టీ తన రాజకీయప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటోంది.

ప్రపంచకప్ క్రికెట్ తో బీజెపీ రాజకీయం!
X

ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం రాజ్యమేలుతున్న మనదేశంలో రాజకీయాలకు కాదేదీ అనర్హమన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను సైతం అధికారపార్టీ తన రాజకీయప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటోంది.

క్రీడలు వేరు..రాజకీయాలు వేరు...అయితే, క్రీడల్ని రాజకీయాలతో కలగాపులగం చేసి లబ్దిపొందే నేర్పు మనదేశంలోని రాజకీయనాయకులకు మాత్రమే ఉంది.

భారత్ వేదికగా నేటినుంచి వచ్చే 48రోజులపాటు జరుగనున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలను సైతం తమ ప్రచారం కోసం వాడుకొంటూ..రాజకీయ ప్రచారానికి, ప్రయోజనాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా పరిస్థితిని మార్చి వేశారు.

మోడీ స్టేడియం చుట్టూ భారత క్రికెట్...

మోడీ ప్రధానిగా రాకముందు వరకూ భారత క్రికెట్ కోల్ కతా లేదా ముంబై నగరాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉండేది. సర్దార్ పటేల్ స్టేడియం ను కూల్చి..నరేంద్ర మోడీ స్టేడియం పేరుతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అందుబాటులోకి రావడం, కేంద్ర హోంమంత్రి పుత్రరత్నం జే షా భారత క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఏవైనా సరే..అహ్మదాబాద్ వేదికగా జరిగి తీరాల్సిందేనన్నట్లుగా ప్రస్తుత బీసీసీఐ కార్యకలాపాలు నడచిపోతున్నాయి. దానికి...ఐపీఎల్ లేదా ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు ఏమాత్రం మినహాయింపు కాదు.

మోడీ స్టేడియం టు మోడీ స్టేడియం..

భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమై..నవంబర్ 19న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే ముగియనుంది.

గత మూడేళ్ల కాలంగా భారత క్రికెట్ బీసీసీఐ కార్యదర్శి జే షా పుణ్యమా అంటూ నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి సాంప్రదాయ క్రికెట్ వేదికలు మాత్రమే కాదు..ముంబై, కోల్ కతా లాంటి మెగా వేదికలు సైతం అహ్మదాబాద్ ముందు దిగదుడుపుగా మారిపోయాయి.


బీజెపీ నాయకుల హంగామా.....

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రారంభమ్యాచ్ టికెట్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా బీజెపీ స్థానిక నాయకులు మహిళలకు ఎరవేస్తున్నారు.

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ కు చెందిన 30 నుంచి 40 వేల టికెట్ల వరకూ మహిళలకు పంచుతూ స్థానిక బీజెపీ నాయకుడు లలిత్ వాద్వాన్ హడావిడి చేస్తున్నారు.

పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళల రిజర్వేషన్ బిల్లు గురించి తగిన అవగాహన కల్పించడానికి, భారీసంఖ్యలో మహిళా క్రికెట్ అభిమానులు స్టేడియానికి తరలి రావటానికి వీలుగా తాము ఉచితంగా టికెట్లు పంచుతున్నట్లు అహ్మదాబాద్ లోని బోడక్ దేవ్ ప్రాంత బీజెపీ ఉపాధ్యక్షుడు చెబుతున్నారు. మహిళలకు ఉచిత టికెట్లు ఇవ్వడంతో పాటు స్టాండ్స్ లో ఉచిత టీ, భోజనసదుపాయం సైతం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇదంతా చూస్తుంటే..ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను సైతం తమ పార్టీ ప్రచారం కోసం ఎలా వాడుకోవాలో బీజెపీ నాయకులను చూసి నేర్చుకోవాల్సిందే మరి.

First Published:  5 Oct 2023 6:57 AM GMT
Next Story