Telugu Global
Sports

ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం!

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ రెండోసెమీఫైనల్లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ఇంగ్లండ్ పై 6 పరుగుల సంచలన విజయంతో దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది....

ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం!
X

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ రెండోసెమీఫైనల్లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ఇంగ్లండ్ పై 6 పరుగుల సంచలన విజయంతో దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది....

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలిసారిగా చేరుకొంది. కేప్ టౌన్ న్యూల్యాండ్స్ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లండ్ పైన సంచలన విజయం సాధించింది. సూపర్ సండే టైటిల్ సమరంలో ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

పడుతూలేస్తూ ఫైనల్ కు....

ప్రపంచకప్ ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికాజట్టు ..గ్రూప్ -1 లీగ్ నుంచి పడుతూలేస్తూ ఫైనల్స్ కు చేరుకోడం 2023 ఐసీసీ ప్రపంచకప్ కే హైలైట్ గా మిగిలిపోతుంది.

ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకజట్లతో కూడిన గ్రూపులో రెండు పరాజయాలు, రెండు విజయాలతో దక్షిణాఫ్రికా అనూహ్యంగా సెమీస్ కు అర్హత సంపాదించింది.

సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఆఖరి గ్రూపులీగ్ పోరులో బంగ్లాదేశ్ ను 3 పరుగుల తేడాతో అధిగమించడం ద్వారా దక్షిణాఫ్రికా గ్రూపు రన్నరప్ గా నిలిచింది.

గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో పవర్ ఫుల్ ఇంగ్లండ్ ను దక్షిణాఫ్రికా కంగు తినిపించింది.

ఈ నాకౌట్ పోరులో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనింగ్ జోడీ వాల్‌వర్ట్‌ (53), బ్రిట్స్‌ (68) హాఫ్‌సెంచరీలతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

అనంతరం 165 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాస్ట్ బౌలర్లు అయబొంగా 4, షబ్నమ్‌ 3 వికెట్లు పడగొట్టడం ద్వారా తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

ఆట 18వ ఓవర్లలో మీడియం పేసర్ అయిబోంగా ఖాకా మూడు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్ కు పగ్గాలు వేసింది. ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ సైతం 2 వికెట్లతో తనవంతు పాత్ర నిర్వర్తించింది.

ఆదివారం జరిగే టైటిల్ సమరంలో వరుసగా ఏడోసారి ఫైనల్ చేరిన ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాతో దక్షిణాఫ్రికా తాడోపేడో తేల్చుకోనుంది.

తొలిసెమీఫైనల్లో 173 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 5 పరుగుల తేడాతో ఓడితే..రెండోసెమీఫైనల్లో 165 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ 6 పరుగు తేడాతో పరాజయాలు చవిచూడటం విశేషం.

First Published:  25 Feb 2023 6:45 AM GMT
Next Story