Telugu Global
Sports

ఆ శతకం ఓ కలలా అనిపిస్తోంది- పూజారా

బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో తాను సాధించిన మెరుపుశతకం తనకు ఇప్పటికీ ఓ కలలా అనిపిస్తోందని భారత వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారా అంటున్నాడు.

ఆ శతకం ఓ కలలా అనిపిస్తోంది- పూజారా
X

ఆ శతకం ఓ కలలా అనిపిస్తోంది- పూజారా

బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో తాను సాధించిన మెరుపుశతకం తనకు ఇప్పటికీ ఓ కలలా అనిపిస్తోందని భారత వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారా అంటున్నాడు....

చతేశ్వర్ పూజారా...ఈ పేరు వినగానే జిడ్డాటకు మరో పేరైనా భారత క్రికెట్ నయావాల్ మాత్రమే గుర్తుకు వస్తాడు. ఐదురోజుల టెస్టు క్రికెట్లో ఓపెనర్లలో ఒకరు అవుటైన వెంటనే క్రీజులోకి అడుగుపెట్టే చతేశ్వర్ పూజారా కు...జట్టు అవసరాలకు అనుగుణంగా క్రీజునే అంటిపెట్టుకొని, ఆచితూచి ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడంలో తనకుతాను మాత్రమే సాటి.

చక్కటి టెక్నిక్, ఎనలేని ఓర్పు, నేర్పు..ఎనలేని ఏకాగ్రతతో గంటల తరబడి బ్యాటింగ్ చేయటంలో పూజారా తర్వాతే ఎవరైనా. కనీసం ఓ సెంచరీ చేయాలంటే 250 నుంచి 350 బంతుల వరకూ ఎదుర్కొనడం ఈ నయావాల్ కు సాధారణ విషయమే.

130 బంతుల్లోనే అజేయ శతకం...

టెస్టు క్రికెట్లో 2019కు ముందే 18 శతకాలు బాదిన పూజారా..తన 19వ సెంచరీ కోసం 2022 డిసెంబర్ వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది. గత మూడేళ్లుగా సెంచరీల లేమితో సతమతమవుతూ వస్తున్న పూజారా..చోటాగ్రామ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగుల స్కోరుకే అవుటై శతకాన్ని చేజార్చుకొన్నాడు. అయితే ..రెండో ఇన్నింగ్స్ లో మాత్రం..

మూడోరోజు ఆట టీ విరామం వరకూ 50 పరుగుల స్కోరుతోనే ఉన్నాడు. డిక్లరేషన్ సమీపిస్తున్న తరుణంలో పూజారా ఒక్కసారిగా గేర్ మార్చాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. టీ-20 తరహాలో తన బ్యాట్ కు పని చెప్పి..78.46 స్ట్రయిక్ రేట్ తో...కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

పూజారా పట్టుదలతో ఆడి తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించిన కారణంగానే భారతజట్టు 188 పరుగుల భారీవిజయం సాధించగలిగింది.

అవునా!..నిజమేనా?...

రెండో ఇన్నింగ్స్ టీ విరామానికి 50 పరుగుల స్కోరుతో ఉన్న తాను ఆ తర్వాతి 52 పరుగులను మెరుపు వేగంతో సాధించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని, తనకు ఓ కలలా అనిపిస్తోందని వివరించాడు. రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదిన దానికంటే...తొలిఇన్నింగ్స్ లో సాధించిన 90 పరుగుల స్కోరే తనకు ఎనలేని సంతృప్తిని కలిగించిందని, పైగా భారత్ భారీ తొలిఇన్నింగ్స్ సాధించడానికి ఉపయోగపడిందని సంతృప్తి వ్యక్తం చేశాడు.

మూడేళ్ల విరామం తర్వాత సాధించిన పూజారా శతకంలో 13 బౌండ్రీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.

8వేల పరుగుల రికార్డుకు చేరువగా....

బంగ్లాదేశ్ తో మీర్పూర్ వేదికగా జరిగే రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో పూజారా మరో 11 పరుగులు సాధించగలిగితే 8వేల పరుగుల మైలురాయిని చేరిన భారత 8వ బ్యాటర్ గా

రికార్డుల్లో చోటు సంపాదించగలుగుతాడు. పూజారాకు ముందే టెస్టు క్రికెట్లో 8వేల పరుగులు సాధించిన దిగ్గజ బ్యాటర్లలో సునీల్ గవాస్కర్, మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కొహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు.

రెండోటెస్టులో సైతం పూజారా నిలకడగా రాణించడం పైనే భారత జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

First Published:  22 Dec 2022 5:26 AM GMT
Next Story