Telugu Global
Sports

టెస్టు లీగ్ టాపర్ గా మళ్లీ భారత్!

ఐసీసీ టెస్టు లీగ్ టేబుల్ టాపర్ పోరు మూడుస్తంభాలాటలా సాగుతోంది. రెండుసార్లు రన్నరప్ భారత్ మరోసారి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.

టెస్టు లీగ్ టాపర్ గా మళ్లీ భారత్!
X

ఐసీసీ టెస్టు లీగ్ టేబుల్ టాపర్ పోరు మూడుస్తంభాలాటలా సాగుతోంది. రెండుసార్లు రన్నరప్ భారత్ మరోసారి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.

2023-25 ఐసీసీ టెస్టు లీగ్ పోరు హోరాహోరీగా సాగుతోంది. మొత్తం 10 జట్ల ఈ లీగ్ కేవలం మూడుజట్ల ఆధిపత్యపోరులానే జరుగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ, సిరీస్ సిరీస్ కు ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది.

హ్యాట్రిక్ విజయాలతో భారత్ జోరు....

ఇంగ్లండ్ తో జరుగుతున్న ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిమ్యాచ్ ఓటమితో లీగ్ టేబుల్ 5వ స్థానానికి పడిపోయిన భారత్..ఆ తరువాత జరిగిన మూడుకు మూడుటెస్టులు నెగ్గడం ద్వారా తిరిగి పాయింట్ల పట్టిక అగ్రభాగాన నిలువ గలిగింది.

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిన భారత్..ఆ తరువాత విశాఖపట్నం, రాజకోట, రాంచీ వేదికలుగా జరిగిన రెండు, మూడు, నాలుగు టెస్టుల్లో తిరుగులేని విజయాలతో పుంజుకొంది.

ఐదుగురు సీనియర్ స్టార్లు లేకున్నా..రోహిత్ శర్మ నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో బరిలో నిలిచిన భారత్ అబ్బుర పరచే విజయాలు నమోదు చేసింది.

బజ్ బాల్ బ్రాండ్ టీమ్ ఇంగ్లండ్ ను భారత్ దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ లు ముగిసే సమయానికే 3-1తో సిరీస్ ఖాయం చేసుకోగలిగింది.

కివీస్ కు కంగారు దెబ్బతో భారత్ టాప్!

టెస్టులీగ్ లో భాగంగా ఓ వైపు ఇంగ్లండ్ తో భారత్ తలపడుతుంటే..మరోవైపు న్యూజిలాండ్ తో ఆస్ట్ర్రేలియా అమీతుమీ తేల్చుకొంటోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో తిరుగులేని విజేతగా నిలవడం ద్వారా న్యూజిలాండ్ లీగ్ టేబుల్ టాపర్ గా అవతరించింది. అయితే..అది కొద్దిరోజుల ముచ్చటగా మాత్రమే మిగిలింది.

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ లోని తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల పరాజయం పొందడంతో భారత్, కంగారూ జట్లు చెరో 117 పాయింట్లు చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే..భారత్ మెరుగైన సగటుతో తిరిగి టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగింది.

భారత్ 64.58 విజయశాతంతో మరోసారి అగ్రస్థానం చేరుకోగలిగింది. ధర్మశాల వేదికగా ఈనెల 7నుంచి ఇంగ్లండ్ తో జరిగే ఆఖరి టెస్టులో సైతం భారత్ విజేతగా నిలువగలిగితే ఆధిక్యాన్ని మరింత పెంచుకోడం ద్వారా అగ్రస్థానాన్ని పదిలపరచుకోగలుగుతుంది.

టెస్టు లీగ్ రెండోస్థానంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, మూడోస్థానంలో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ జట్లు నిలిచాయి.

2019లో ప్రారంభమైన ఐసీసీ టెస్టు లీగ్ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ రెండుసార్లు ఫైనల్స్ చేరినా..రెండుకు రెండుసార్లు రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో విరాట్ కొహ్లీ నాయకత్వంలో ఓటమి పొందిన భారత్..రెండో ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలో ఆస్ట్ర్రేలియా చేతిలో పరాజయం పాలయ్యింది.

First Published:  4 March 2024 10:32 AM GMT
Next Story