Telugu Global
Sports

ప్రపంచ టెన్నిస్ లో జోకోవిచ్ సరికొత్త చరిత్ర!

ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని జంట రికార్డులు నెలకొల్పాడు. 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన మొనగాడిగా చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ టెన్నిస్ లో జోకోవిచ్ సరికొత్త చరిత్ర!
X

ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని జంట రికార్డులు నెలకొల్పాడు. 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన మొనగాడిగా చరిత్ర సృష్టించాడు....

37 ఏళ్ల లేటు వయసులో...

ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల సింగిల్స్ లో జోకోవిచ్ 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..37 సంవత్సరాల వయసులో నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగిన మొనగాడిగా మరో రికార్డు సైతం సాధించాడు.

ప్రపంచ పురుషుల టెన్నిస్ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన నొవాక్ జోకోవిచ్ 36 సంవత్సరాల 321 రోజుల వయసులోనే పురుషుల సింగిల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ద్వారా రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న రికార్డును గతంలోనే అధిగమించాడు. 37 సంవత్సరాల వయసులో సైతం టాప్ ర్యాంక్ లో కొనసాగడం ద్వారా తనపేరుతో ఉన్న రికార్డును తానే తిరగరాసుకోగలిగాడు.

ఇప్పటి వరకూ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అత్యంత పెద్దవయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఆటగాడి రికార్డును జోకోవిచ్ అధిగమించాడు.

423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన తొలి, ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

2017 మే 22న 30 సంవత్సరాల వయసులో పడిన జోకోవిచ్ 31 టూర్ టైటిల్స్ గెలుచుకొన్నాడు. తాను సాధించిన 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ లో 12 టైటిల్స్ మూడు పదుల వయసులో సాధించినవే కావడం విశేషం. మొత్తం 40 ఏటీపీ మాస్టర్స్ విజయాలలో 10 టైటిల్స్ సైతం మూడు పదుల వయసులో సాధించినవే కావడం విశేషం.

2011 నుంచి 2024 వరకూ....

జోకోవిచ్ 24 సంవత్సరాల వయసులో ( 2011 జులై 4న ) తొలిసారిగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ 22 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకొంటే...యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ 19 సంవత్సరాల వయసులోనే నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం విశేషం.

2011 నుంచి 2024 మధ్యకాలంలో 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన ఏకైక ఆటగాడు జోకోవిచ్ మాత్రమే. రోజర్ ఫెదరర్ 310 వారాలపాటు నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం ద్వారా జోకోవిచ్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

గత కొద్దిరోజులుగా టాప్ ర్యాంకర్ గా ఉన్న యానిక్ సిన్నర్ మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ నుంచి ఉపసంహరించుకోడంతో...రెండోర్యాంక్ లో కొనసాగుతున్న సెర్బియన్ వండర్ జోకోవిచ్ తిరిగి నంబర్ వన్ ర్యాంక్ లో నిలువగలిగాడు.

2024 ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే జోకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్ సాధించడం ద్వారా..టాప్ సీడ్ గా టైటిల్ వేటకు దిగనున్నాడు. ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ కంటే జోకోవిచ్ 2500 పాయింట్లతో ముందున్నాడు.

ఫెదరర్, సెరెనాలను మించిన జోకో...

ప్రపంచ టెన్నిస్ పురుషుల, మహిళల విభాగాలలో ఫెదరర్ 36 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిస్తే..సెరెనా విలియమ్స్ 35 ఏళ్ల వయసులో టాప్ ర్యాంక్ సాధించింది. ఈ ఇద్దరూ లేటు వయసులో సాధించిన రికార్డులను జోకోవిచ్ తన 37వ పుట్టినరోజుకు ముందే తెరమరుగు చేయగలిగాడు.

2018లో ఫెదరర్ 36, 2017లో సెరెనా 35 సంవత్సరాల వయసులో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లుగా నిలిచారు.

జోకోవిచ్ కు 450 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచే సత్తా ఉందంటూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనటానికి జోకోవిచ్ ను మించిన నిదర్శనం మరొకటి లేదు.

First Published:  4 May 2024 9:30 AM GMT
Next Story