Telugu Global
Sports

తెలుగుతేజం..మన మరో ఖేల్ రత్నం!

జాతీయ అత్యున్నత క్రీడాపురస్కారం ఖేల్ రత్నాల జాబితాలో తెలుగుతేజం, భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ వచ్చి చేరాడు. ఈ రోజు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అందుకోనున్నాడు.

తెలుగుతేజం..మన మరో ఖేల్ రత్నం!
X

తెలుగుతేజం..మన మరో ఖేల్ రత్నం!

భారత టేబుల్ టెన్నిస్ ఖ్యాతిని ఎవరెస్టు ఎత్తుకు చేర్చిన తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ నాలుగు పదుల వయసులో జాతీయ అత్యున్నత క్రీడాపురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా నిలిచాడు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే జాతీయ క్రీడాపురస్కారాల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా స్వీకరించనున్నాడు.

గతంలో ఇదే పురస్కారం అందుకొన్న తెలుగు క్రీడాదిగ్గజాలు కరణం మల్లీశ్వరి ( 1994- 95), పుల్లెల గోపీచంద్ (2000-2001 ), సైనా నెహ్వాల్ ( 2010 ) సానియా మీర్జా (2015 )పీవీ సింధు ( 2016 ), మిథాలీరాజ్ ( 2021 )ల సరసన చోటు సంపాదించాడు.


టేబుల్ టెన్నిస్ కు మరోపేరు..

1982 ఆసియాక్రీడలకు భారత్ ఆతిథ్యమిస్తున్న సమయంలో జన్మించిన శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ గేమ్ ను తన జీవితంగా మార్చుకొని, ఆ క్రీడకే అంకితమయ్యాడు. చైనా, జపాన్, హాంకాంగ్, కొరియా, ఫ్రాన్స్, నైజీరియా, ఇంగ్లండ్ లాంటి దేశాల ఆధిపత్యం ఉన్న ప్రపంచ టీటీలో శరత్ కమల్ కేవలం తన ఆటతీరుతోనే భారత్ కు సైతం ఓ గుర్తింపు తెచ్చిన మొనగాడు.

జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో సంవత్సరాల తరబడి నిలకడగా రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. భారత టీటీకే చిరునామాగా నిలిచాడు. తెలుగురాష్ట్రాలలో టీటీకి అంతంత మాత్రమే ఆదరణ, ప్రోత్సాహం ఉండడంతో..పొరుగురాష్ట్రం తమిళనాడుకు వలసవెళ్లాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అధికారిగా పనిచేస్తూనే భారతజట్టులో సభ్యుడిగా అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ పతకాల పంట పండిస్తూ వస్తున్నాడు.

ఆంధప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆచంట శరత్ కమల్ 38 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో పోటీకి దిగడం ద్వారా భారత టీటీకి గుర్తింపు తెచ్చాడు.

కమలేశ్ మెహ్తాను మించిన శరత్...

భారత టీటీ చరిత్రలో అత్యధికంగా ఎనిమిదిసార్లు జాతీయ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన కమలేశ్ మెహ్తా రికార్డును తొమ్మిదిసార్లు నెగ్గడం ద్వారా శరత్ అధిగమించాడు. ఆసియా క్రీడలు,కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టిన రికార్డు శరత్ కు ఉంది. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ వరకూ వివిధ విభాగాలలో నాలుగు బంగారు, ఓ రజత, మూడు కాంస్య పతకాలు సాధించిన రికార్డు శరత్ కు మాత్రమే సొంతం. అంతేకాదు.. 2018 జకార్తా ఆసియాక్రీడల పురుషుల టీమ్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య విజేతగా నిలిచాడు.

5 కామన్వెల్త్ గమ్స్ లో 13 పతకాలు

వరుసగా గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటూ వచ్చిన శరత్ కమల్ 2006 గేమ్స్ పురుషుల సింగిల్స్ లో తొలిసారిగా బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత నుంచి డబుల్స్, మిక్సిడ్ డబుల్స్, టీమ్ విభాగాలలో పతకాలు సాధిస్తూ వచ్చిన శరత్ ప్రస్తుత 2022 గేమ్స్ లో తిరిగి పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు. 24 సంవత్సరాల వయసులో సింగిల్స్ తొలి స్వర్ణ పతకం సాధించిన శరత్ మరో బంగారు పతకం కోసం 16 సంవత్సరాలపాటు ఓపికగా వేచి చూడాల్సి వచ్చింది. 2022 బర్మింగ్ హామ్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో రజత, టీమ్ విభాగంలో స్వర్ణ, మిక్సిడ్ డబుల్స్ లో ఆకుల శ్రీజతో కలసి బంగారు పతకాలు సాధించాడు.

కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా నిలిచాడు. గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటూ వచ్చిన 40 ఏళ్ళ శరత్ కమల్ 13 పతకాలతో అత్యధిక పతకాలు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

నాలుగు ఒలింపిక్స్ లో పోటీ...

జాతీయ టేబుల్ టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా తొమ్మిదిసార్లు జాతీయ టైటిల్ నెగ్గిన అసాధారణ రికార్డు శరత్ కమల్ కు మాత్రమే సొంతం. తన కెరియర్ లో అత్యుత్తమంగా ప్రపంచస్థాయిలో 36వ ర్యాంకు సాధించడంతో పాటు గత రెండుదశాబ్దాల కాలంలో నాలుగోసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు.

2004 నుంచి 2022 వరకూ జరిగిన ఒలింపిక్స్ లో (2004 ఏథెన్స్ , 2008 బీజింగ్, 2016 రియో ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్ లో ) భారత్ కు నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పగలిగాడు.

తన జీవితాన్ని టేబుల్ టెన్నిస్ క్రీడకే అంకితం చేసి..దేశానికి 13 కామన్వెల్త్ గేమ్స్ పతకాలు, ఆసియాక్రీడలు, ఇతర ప్రపంచ స్థాయి పోటీలలో భారత్ కు డజన్ల కొద్దీ పతకాలు అందించిన శరత్ కమల్ కష్టానికి, అంకితభావానికి 40 ఏళ్ల వయసులో గుర్తింపు లభించింది.

2022 సంవత్సరానికి జాతీయ అత్యుత్తమ క్రీడాపురస్కారం కింద మేజర్ ధ్యాన్ చంద్ పతకంతో పాటు 25 లక్షల రూపాయల నగదు పురస్కారం.. రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం ఓ గొప్ప ఘనతగా మిగిలిపోతుంది.

First Published:  30 Nov 2022 3:12 AM GMT
Next Story