Telugu Global
Sports

కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగు వెలుగులు!

వివిధ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లతో కూడిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు అథ్లెట్లు చోటు సంపాదించడమే కాదు..బంగారు పతకాలతో దేశానికి, తెలుగు రాష్ట్రాల‌కే గర్వకారణంగా నిలిచారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగు వెలుగులు!
X

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ నాలుగో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. భారత్ పతకాల పట్టిక నాలుగో స్థానంలో నిలవడంలో 215 మంది సభ్యుల బృందంలోని తెలుగు రాష్ట్రాల‌ అథ్లెట్లు సైతం ప్రధానపాత్ర వహించారు. కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మొత్తం 19 క్రీడాంశాలు నిర్వహిస్తే... భారత్ మాత్రం 16 క్రీడాంశాలకు మాత్రమే పరిమితమైంది. పురుషుల విభాగంలో 108 మంది, మహిళల విభాగంలో 107 మంది అథ్లెట్లతో భారత్ పోటీలో నిలిచింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లతో కూడిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు అథ్లెట్లు చోటు సంపాదించడమే కాదు..బంగారు పతకాలతో దేశానికి, తెలుగు రాష్ట్రాల‌కే గర్వకారణంగా నిలిచారు.

బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో పీవీ సింధు, గాయత్రీ గోపీచంద్, కిడాంబీ శ్రీకాంత్, రంకిరెడ్డి సాయి రుత్విక్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, హుసాముద్దీన్, టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, ఆకుల శ్రీజ, మహిళా క్రికెట్‌లో మేఘనరెడ్డి, మహిళల హాకీలో ఎతిమరపు రజనీ ప్రాతినిథ్యం వహించారు. వీరిలో.. హుసాముద్దీన్ మినహా మిగిలిన క్రీడాకారులంతా ఏదో ఒక పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చారు.

సింధు, శరత్ రికార్డు...

బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ విభాగంలో రజత, మహిళల సింగిల్స్ లో స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. గత మూడు కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ లో కాంస్య, రజత, స్వర్ణ పతకాలు సాధించిన సింధు..మిక్సిడ్ టీమ్ విభాగంలో ఒక్కో స్వర్ణ, రజత పతకాలు చొప్పున సొంతం చేసుకుంది. అత్యధికంగా ఐదు పతకాలు సాధించిన ఏకైక తెలుగు మహిళా అథ్లెట్ గా నిలిచింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్ కాంస్య, పురుషుల డబుల్స్ లో సాయి సాత్విక్ బంగారు పతకాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్ కాంస్య పతకం సాధించింది.

టీటీలో శరత్ విశ్వరూపం..

కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ లో గత 20 సంవత్సరాలుగా పాల్గొంటూ వస్తున్న ఆచంట శరత్ కమల్ మొత్తం 13 పతకాలతో చరిత్ర సృష్టించాడు. గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటూ వస్తున్న శరత్ కమల్ 24 ఏళ్ల వయసులో పురుషుల సింగిల్స్ తొలి బంగారు పతకం సాధించడమే కాదు...40 ఏళ్ల‌ వయసులో రెండు స్వర్ణ పతకం నెగ్గడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు. బర్మింగ్ హామ్ గేమ్స్ మిక్సిడ్ డబుల్స్ లో బంగారు, టీమ్ విభాగంలో స్వర్ణ, పురుషుల డబుల్స్ లో రజత, సింగిల్స్ లో స్వర్ణ పతకాలతో తనకు తానే సాటిగా నిలిచాడు. 2006, 2010, 2014, 2018 , 2022 కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనడంతో పాటు ఏకంగా 13 పతకాలు సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు. నాలుగు పదుల వయసులో కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం సాధించిన భారత తొలి టీటీ ప్లేయర్ గా, అత్యధిక పతకాలు సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా శరత్ కమల్రి రికార్డుల్లో చేరాడు.

బంగారు బాక్సర్ నిఖత్ జరీన్...

మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం ద్వారా.. కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో పతకం సాధించిన తెలుగు రాష్ట్రాల‌ తొలి మహిళా బాక్సర్ గా నిలిచింది. టేబుల్ టెన్నిస్ మహిళ మిక్సిడ్ డబుల్స్ లో శరత్ తో జంటగా...హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజ బంగారు పతకం అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా టీ-20 క్రికెట్లో హైదరాబాద్ కు చెందిన మేఘనరెడ్డి సైతం భారత జట్టులో సభ్యురాలిగా రజత పతకం అందుకుంది. మహిళల హాకీలో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ఎతిమరుపు రజనీ గోల్ కీపర్‌గా వ్య‌వ‌హరించింది. మొత్తం ఐదు రకాల క్రీడాంశాలలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల‌ క్రీడాకారులు బంగారు పతకాలతో భార‌త‌దేశానికే గర్వకారణంగా నిలిచారు. పోటీల ప్రారంభ వేడుకల్లో భారత జట్టుకు పీవీ సింధు పతాకధారిగా వ్యవహరిస్తే.. ముగింపు వేడుకల్లో నిఖత్ జరీన్, శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించడం అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

First Published:  9 Aug 2022 4:06 AM GMT
Next Story