Telugu Global
Sports

రాఫెల్ నడాల్ లేని 2023 ఫ్రెంచ్ ఓపెన్!

ఫ్రెంచ్ ఓపెన్ గత 16 సంవత్సరాల చరిత్రలో నడాల్ లేకుండా 2023 టోర్నీకి మరి కొద్దిరోజుల్లో తెరలేవనుంది.

French Open 2023: రాఫెల్ నడాల్ లేని 2023 ఫ్రెంచ్ ఓపెన్!
X

French Open 2023: రాఫెల్ నడాల్ లేని 2023 ఫ్రెంచ్ ఓపెన్!

ఫ్రెంచ్ ఓపెన్ గత 16 సంవత్సరాల చరిత్రలో నడాల్ లేకుండా 2023 టోర్నీకి మరి కొద్దిరోజుల్లో తెరలేవనుంది.

ఎర్రమట్టి కోర్టుల్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ అనగానే స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. నడాల్ లేని ఫ్రెంచ్ ఓపెన్ ను ఊహించడం అసాధ్యం.

అలాంటిది..క్లేకోర్టు దిగ్గజం నడాల్ లేకుండానే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీమరికొద్దిరోజుల్లోనే పారిస్ లోని రోలాండ్ గారోస్ లో ప్రారంభంకానుంది.

23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు జోకో గురి...

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ మొనగాడు రాఫెల్ నడాల్ ఫిట్ నెస్ సమస్యలతో గత 16 సంవత్సరాలలో తొలిసారిగా టోర్నీకి దూరమయ్యాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ సమరం మరికొద్దిరోజుల్లోనే ప్రారంభంకానుంది. 2004 తర్వాత నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ కు దూరం కావటం ఇదే మొదటిసారి.

14 టైటిల్స్ విజేత నడాల్ లేకపోడంతో యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్, దిగ్గజ ఆటగాడు నొవాక్ జోకోవిచ్, డేనిల్ మెద్వదేవ్ టైటిల్ కు గురి పెట్టారు. తన కెరియర్ లో ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ రికార్డుస్థాయిలో 23వ టైటిల్ కు గురిపెట్టాడు.

నిర్వాహక సంఘం ప్రకటించిన సీడింగ్స్ పురుషుల విభాగంలో అల్ కరాజ్, మహిళల సింగిల్స్ లో ఇగా స్వయిటెక్ టాప్ సీడ్ స్టార్లుగా టైటిల్ వేటకు దిగుతున్నారు.

రష్యా ఆటగాడు డానిల్ మెద్వదేవ్ కు రెండో సీడింగ్ దక్కింది. 3వ సీడ్ గా జోకోవిచ్ మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నాడు. గతంలో ప్రస్తుత సీజన్లో మూడు క్లేకోర్టు టోర్నీలలో మోచేతి గాయంతో అంతంత మాత్రంగా రాణించిన జోకోవిచ్ ..ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు.

యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ మాత్రం బార్సిలోనా, మాడ్రిడ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గడం ద్వారా హాట్ ఫేవరెట్ గా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటకు దిగనున్నాడు.

ఒకే పార్శ్వంలో జోకో, అల్ కరాజ్...

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ డ్రా..ఒకే హాఫ్ లో కార్లోస్ అల్ కరాజ్, నొవాక్ జోకోవిచ్ పోటీపడబోతున్నారు. ఈ ఇద్దరు మొనగాళ్లు సెమీఫైనల్ దశలో ఒకరితో ఒకరు తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ సాధించిన మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో జోకోవచ్ కు రెండుమాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలు ఉన్నాయి. అయితే..ఇటాలియన్ ఓపెన్లో తాను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా..ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా ఆడగలనని జోకోవిచ్ ధీమాగా చెప్పాడు.

కఠోరసాధనతో ఫ్రెంచ్ ఓపెన్ కు వచ్చానని, తన శరీరం సైతం సహకరించగలదని భావస్తున్నట్లు తెలిపాడు. 36 ఏళ్ల్ల జోకోవిచ్ కు క్వార్టర్ ఫైనల్లోనే మాంటేకార్లో మాస్టర్స్ విన్నర్ యాండ్రీ రుబ్లేవ్ తారసపడనున్నాడు.

నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్, స్టెఫానోస్ సిటిస్ పాస్ సైతం ఫ్రెంచ్ ఓపెన్ రేస్ లో నిలిచారు. రూడ్ కు 4వ సీడింగ్ దక్కింది.

టాప్ సీడ్ స్టార్ అల్ కరాజ్ కు క్వార్టర్ ఫైనల్లో సిటిస్ పాస్ తో తలపడే అవకాశం ఉంది.

టాప్ సీడ్ గా ఇగా స్వయిటెక్..

మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ చాంపియన్, పోలిష్ స్టార్ ఇగా స్వయిటెక్ టాప్ సీడ్ గా టైటిల్ నిలుపుకోడానికి సిద్ధమయ్యింది. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విజేత అర్యానా సబలెంకా, ఎలెనా రిబకినాల నుంచి స్వయిటెక్ కు గట్టిపోటీ ఎదురుకానుంది. 22 ఏళ్ల స్వయిటెక్ క్వార్టర్ ఫైనల్లో రిబకినాతో తలపడాల్సి ఉంది.

వింబుల్డన్ చాంపియన్ రిబకినా 4వ సీడ్ గా బరిలో నిలిచింది.

గత టోర్నీ రన్నరప్ కోకో గాఫ్, ట్యునీసియా ప్లేయర్ ఓన్స్ జబేర్, ప్రపంచ మూడో ర్యాంకర్ జెస్సికా పెగ్యులా మహిళల సింగిల్స్ రేస్ లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

టాప్ సీడ్ స్వయిటెక్ కు తొలిరౌండ్లో స్పెయిన్ ప్లేయర్ క్రిస్టినా బుక్సా ప్రత్యర్థిగా నిలువనుంది.

భారీగా పెరిగిన ప్రైజ్ మనీ..

ఫ్రెంచ్ ఓపెన్ విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని నిర్వాహక సంఘం భారీగా పెంచింది. గతేడాది కంటే ఈ ఏడాది విజేతలు 10.9 శాతం అదనంగా ప్రైజ్ మనీ అందుకోనున్నారు.

2023 ఫ్రెంచ్ ఓపెన్లో మొత్తం 38 లక్షల యూరోలను ప్రైజ్ మనీగా నిర్ణయించారు. మొత్తం 4 కోట్ల 47 లక్షల 11 వేల 560 డాలర్లలో..పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 9 లక్షల 40వేల డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ అందచేస్తారు.

డబుల్స్ విజేతలకు లక్షా 88వేల 55 డాలర్లు నజరానాగా చెల్లిస్తారు. పురుషులతో సమానంగా మహిళా విజేతలకు ప్రైజ్ మనీ చెల్లించడమే తమ లక్ష్యమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహక సంఘం చెబుతోంది.

First Published:  26 May 2023 5:30 AM GMT
Next Story