Telugu Global
Sports

చేజింగ్ లో మొనగాడు విరాట్ కొహ్లీ!

భారత క్రికెట్ చరిత్రలో మాస్టర్ సచిన్ తరువాత అంతే ప్రతిభకలిగిన, అత్యంతప్రభావశీలుడైన ఆటగాడు ఎవరంటే..విరాట్ కొహ్లీ అనిమాత్రమే చెప్పాలి.

Telugu Cricket News: Virat Kohli leads the chase!
X

విరాట్ కొహ్లీ

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అసాధారణ ఆటగాడు విరాట్ కొహ్లీ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను అలరించడం మొదలు పెట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన ప్రపంచకప్ పోరులో 82 పరుగుల నాటౌట్ స్కోరుతో మరోసారి చేజింగ్ కింగ్ ను తానేనని చాటి చెప్పాడు...

భారత క్రికెట్ చరిత్రలో మాస్టర్ సచిన్ తరువాత అంతే ప్రతిభకలిగిన, అత్యంతప్రభావశీలుడైన ఆటగాడు ఎవరంటే..విరాట్ కొహ్లీ అనిమాత్రమే చెప్పాలి. సచిన్ రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ కు మూలవిరాట్టుగా నిలిచిన కొహ్లీకి క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ గొప్పగా రాణించిన ఘనత, టన్నులకొద్దీ పరుగులు సాధించిన రికార్డులు ఉన్నాయి.

528 మ్యాచ్ లు...24వేల పరుగులు...

2008 నుంచి గత 14 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందిస్తున్న 33 సంవత్సరాల విరాట్ కు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆరో బ్యాటర్‌గా రికార్డు ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో పాకిస్థాన్ తో జరిగిన పోరులో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా విరాట్ కొహ్లీ దిగ్గజ క్రికెటర్ల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 53.80 సగటుతో 24 వేల212 పరుగులు సాధించాడు. 71 సెంచరీలు, 126 హాఫ్‌ సెంచరీలతో ఈ ఘనతను సొంతం చేసుకోగలిగాడు. 254 నాటౌట్‌ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా ఉంది.

102 టెస్టుల్లో 27 శతకాలు, 28 అర్థశతకాలతో 8వేల 74 పరుగులు, 262 వన్డేలలో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 12వేల 344 పరుగులు, 110 టీ-20 అంతర్జాతీయమ్యాచ్ ల్లో ఓ సెంచరీ, 34 హాఫ్ సెంచరీలతో 3వేల 794 పరుగులు, ఐపీఎల్ గత 15 సీజన్లలో 223 మ్యాచ్ ల్లో 5 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలతో సహా

6వేల 624 పరుగులు సాధించిన ఘనత విరాట్ కు మాత్రమే సొంతం.

చేజింగ్ లోనే అత్యధిక పరుగులు..

వైట్ బాల్ (వన్డేలు, టీ-20 ) క్రికెట్లో చేజింగ్ మొనగాడిగా విరాట్ కొహ్లీకి పేరుంది. ప్రధానంగా ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో లక్ష్యచేధన అంటే ఓ సవాలు మాత్రమే కాదు..బ్యాటర్ల ఆత్మవిశ్వాసం, సత్తాకు అసలు సిసలు పరీక్ష. అయితే..తీవ్రఒత్తిడి నడుమ సాగే చేజింగ్ లో అత్యంత విజయవంతమైన ఆటగాడుగా విరాట్ రికార్డుల్లో చేరాడు.

2022 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో పాక్ ప్రత్యర్థిగా సాధించిన 82 పరుగుల నాటౌట్ స్కోరు వరకూ విరాట్ కొహ్లీకి చేజింగ్ లో టాప్ ర్యాంక్ బ్యాటర్ గా పేరుంది.

2012 సీజన్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా శ్రీలంక వేదికగా జరిగిన పోరులో 61 బాల్స్ లో 71 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచిన విరాట్ ..ఆ తర్వాత ఆడిన ఇన్నింగ్స్ తొమ్మిది చేజింగ్ ల్లో ఎనిమిదిసార్లు నాటౌట్ గా ఉండడం ఓ ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది.

చేజింగ్ కు దిగిన సమయంలో విరాట్ ఆడిన గత 10 ఇన్నింగ్స్ లో 398 బాల్స్ ఎదుర్కొని 541 పరుగులతో 270.50 సగటు, 135.92 స్ట్రయిక్ రేట్ నమోదు చేశాడు.

2016లో మొహాలీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన పోరులో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన విరాట్ ..ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో ముగిసిన పోరులో సైతం 82 పరుగుల నాటౌట్ స్కోరే సాధించడం విశేషం. అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో 122 పరుగుల నాటౌట్ అత్యుత్తమ స్కోరు కాగా...చేజింగ్ లో 82 పరుగుల నాటౌట్ స్కోరు అత్యుత్తమంగా ఉంది.

చేజింగ్ కు దిగిన సమయంలో 10 ఇన్నింగ్స్ లో ఎనిమిదిసార్లు నాటౌట్ గా నిలిచిన ఏకైక బ్యాటర్ విరాట్ కొహ్లీ మాత్రమే.

First Published:  26 Oct 2022 7:01 AM GMT
Next Story