Telugu Global
Sports

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా విక్టరీ

309 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన విండీస్ జట్టు చివరి వరకు పోరాడి 305 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది.

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా విక్టరీ
X

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు బోణీ చేసింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీని అందుకున్నది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. 309 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన విండీస్ జట్టు చివరి వరకు పోరాడి 305 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు కెప్టెన్ శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ఇటీవల ఫామ్ కోల్పోయిన ఇద్దరు బ్యాటర్లు కూడా విండీస్ బౌలర్లపై విరుచుకపడ్డారు. ధావన్ కంటే గిల్ మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతులకే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ధావన్ అతడికి సపోర్ట్‌గా నిలిచాడు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి శుభ్‌మన్ గిల్ (64) రనౌట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 119 పరుగులు బాదారు.

ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధావన్ అదే జోరును కొనసాగించాడు. వీరిద్దరూ కలసి మొదట్లో కాస్త ఆచుతూచి ఆడటంతో మొదట్లో రన్‌రేట్ తగ్గింది. అయితే గాయం తర్వాత ఫామ్ కోల్పోయిన శ్రేయస్.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ధావన్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో ధావన్, శ్రేయస్ వికెట్లు పారేసుకున్నారు. ధావన్ (97) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక అర్ధ సెంచరీ చేసి దూకుడుగా ఉన్న శ్రేయస్ కూడా పెవీలియన్ చేరాడు.

ఆ తర్వాత భారత బ్యాటర్ల జోరుకు అడ్డుకట్ట పడింది. సూర్యకుమార్ (13), సంజూ శాంసన్ (12) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరారు. ఆఖర్లో దీపక్ హుడా (27), అక్షర్ పటేల్ (21) కాస్త దూకుడుగా ఆడటంతో భారత జట్టు 300 స్కోర్ దాటింది. మొత్తానికి భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

భయపెట్టిన విండీస్..

309 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన విండీస్ జట్టు మొదట్లోనే ఓపెనర్ షై హోప్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి హోప్ (7) పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కైల్ మేయర్స్, బ్రూక్స్ కలిసి విండీస్‌ను ఆదుకున్నారు. టీమ్ ఇండియా బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్లారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. శార్దుల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవీలియన్ చేర్చాడు. కైల్ మేయర్స్ (75) శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటవ్వగా, బ్రూక్స్ (46) సంజూ శాంసన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్రాండన్ కింగ్ (54), కెప్టెన్ నికొలస్ పూరన్ (25) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే వీరిద్దరూ అవుటయ్యాక విండీస్ జట్టును ఆదుకునే వారే లేకపోయారు. ఆఖర్లో కింగ్, హోసిన్ కలిసి దూకుడుగా ఆడుతూ విండీస్‌ను లక్ష్యానికి సమీపంలోకి తీసుకొని వచ్చారు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో 3 పరుగుల దూరంలోనే విండీస్ ఆగిపోయింది. భారత జట్టుకు విజయం లభించింది. శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇండియా 308/7 (ధావన్ 97, గిల్ 64, అయ్యర్ 54)

విండీస్ 305/6 (మేయర్స్ 75, కింగ్ 54)

First Published:  23 July 2022 1:36 AM GMT
Next Story