Telugu Global
Sports

మ‌న దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్స్‌.. ఒక్క ఓవ‌రైనా బౌలింగ్ చేయ‌లేరా..?

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌, డారెల్ మిచెల్ మూడో వికెట్‌కు 150 ప‌రుగుల‌కు పైగా భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. కుల్‌దీప్ యాద‌వ్‌ను సిక్స్‌ల‌తో స‌న్మానించేశారు.

మ‌న దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్స్‌.. ఒక్క ఓవ‌రైనా బౌలింగ్ చేయ‌లేరా..?
X

రోహిత్‌శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్య‌కుమార్ యాద‌వ్.. అంద‌రూ ఆరివీర భ‌యంకర బ్యాట్స్‌మ‌న్లే. కానీ, ఒక్క‌ ఓవ‌ర్ కూడా బౌలింగ్ చేయ‌లేరు. టీమ్‌లో ఉన్న ఒక్క‌గానొక్క ఆల్‌రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా గాయంతో మ‌రో రెండు మ్యాచ్‌లు దూరం కానున్నాడు. మ‌న బౌల‌ర్లు కాస్త బ్యాట్ ఊప‌గ‌ల‌రేమో గానీ ఒక్క బ్యాట్స్‌మ‌న్ కూడా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఒక్క ఓవ‌ర్ కూడా బౌలింగ్ చేయ‌గ‌ల‌ర‌న్న ధైర్యం ఇవ్వ‌లేక‌పోవడం ఆలోచించాల్సిన విష‌యం.

స‌చిన్‌, సౌర‌వ్‌, సెహ్వాగ్‌లు చేయ‌లేదా?

గ‌త 20, 25 ఏళ్లుగా చూస్తే మ‌న ద‌గ్గ‌ర ఆల్‌రౌండ‌ర్లు చాలా మందే వ‌చ్చారు. స‌చిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌, యువ‌రాజ్‌, రైనా వీళ్లంద‌రి ప్ర‌ధాన బ‌లం బ్యాటింగే అయినా అవ‌స‌ర‌మైన‌ప్పుడు బౌలింగ్‌తో కూడా జ‌ట్టును ఆదుకున్నారు. క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఘ‌న‌త సాధించిన మ‌న స‌చిన్ వ‌న్డేల్లో 1342 ఓవ‌ర్లు వేసి 154 వికెట్లు తీశాడు. గంగూలీ 760 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 100 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ 732 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 96 వికెట్లు నేల‌కూల్చాడు. యువ‌రాజ్‌, రైనా, రాబిన్‌సింగ్, అజ‌య్ జ‌డేజా లాంటి ఆట‌గాళ్లు బేసిక్‌గా బ్యాట్స్‌మ‌న్‌లే అయినా రెగ్యుల‌ర్ బౌల‌ర్ల మాదిరిగా ప‌ది ఓవ‌ర్ల కోటా పూర్తి చేసేవారు. కానీ, ఈరోజు టీమ్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మ‌న్ చేతికీ ధైర్యంగా బాల్ ఇచ్చి ఒక్క ఓవ‌ర్ వేయ‌మ‌ని చెప్పే ప‌రిస్థితి లేదు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ష‌మీ లేక‌పోతే ఏమ‌య్యేది?

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌, డారెల్ మిచెల్ మూడో వికెట్‌కు 150 ప‌రుగుల‌కు పైగా భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. కుల్‌దీప్ యాద‌వ్‌ను సిక్స్‌ల‌తో స‌న్మానించేశారు. ఏ రెగ్యుల‌ర్ బౌల‌ర్ వాళ్ల‌ను దాదాపు 25 ఓవ‌ర్ల పాటు కంగారుపెట్ట‌లేక‌పోయాడు. ఇలాంటి స‌మ‌యంలో చేంజ్ బౌల‌ర్‌గా బౌలింగ్ చేయ‌డానికైనా ఒక్క బ్యాట్స్‌మ‌న్ కూడా సాహ‌సించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం ఆలోచించాల్సిన విష‌యం. ఆ మ్యాచ్‌లో మ‌ళ్లీ బాల్ అందుకున్న ష‌మీ చెల‌రేగ‌క‌పోతే ప‌రిస్థితి వేరేగా ఉండేది. గ్రేటెస్ట్ బ్యాట్స్‌మ‌న్లు అయిన స‌చిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌లు టీమ్ అవ‌స‌రాల కోసం నెట్స్‌లో బౌలింగ్ కూడా సాధ‌న చేసేవారు. కానీ నేటి టీమ్‌లో ఆ ల‌క్ష‌ణం మ‌చ్చుకైనా లేదు.

అంతా బాగుంది కాబ‌ట్టి ఓకే..

ఈ వ‌రల్డ్‌క‌ప్‌లో మ‌న బౌలింగ్ సూప‌ర్‌. బ్యాటింగ్ అదుర్స్‌. కానీ టోర్నీ ముందుకెళ్లే కొద్దీ పెద్ద జ‌ట్ల‌తో మ్యాచ్‌లు. నాకౌట్ పోటీల్లో రెగ్యుల‌ర్ బౌల‌ర్లు పొర‌పాటున తేలిపోతే ప్ర‌త్య‌ర్థికి కాస్త క‌ళ్లెం వేయ‌డానికి చేంజ్ బౌల‌ర్‌గా అయినా మ‌నం మ‌న బ్యాట్స్‌మ‌న్ల‌ను త‌యారు చేయ‌క‌పోవ‌డం స‌రైందేనా అని క్రీడా విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. కెరీర్ చివ‌ర్లో ఉన్న రోహిత్‌, కోహ్లీ ఇప్పుడు బౌలింగ్ నేర్చుకుంటార‌నే ఆశ‌లేం లేవు. కానీ రేప‌టి భ‌విష్య‌త్తుగా క‌నిపిస్తున్నశ్రేయ‌స్‌, శుభ్‌మ‌న్ వంటి ఆట‌గాళ్లయినా దీనిపై దృష్టిపెడితే మేలంటున్నారు విశ్లేష‌కులు.

First Published:  25 Oct 2023 10:07 AM GMT
Next Story