Telugu Global
Sports

టీమ్ ఇండియా అద్భుతమైన ఛేజ్.. విండీస్‌పై సిరీస్ కైవసం

10 ఓవర్లలో 100 పరుగులు కొట్టాల్సిన సమయంలో దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లు దూకుడు ప్రదర్శించారు. హుడా నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

టీమ్ ఇండియా అద్భుతమైన ఛేజ్.. విండీస్‌పై సిరీస్ కైవసం
X

మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ గెలిచిన భారత్

అక్షర్ పటేల్ సంచలన ఇన్నింగ్స్

షై హోప్ సెంచరీ వృథా


టీమ్ ఇండియా విదేశీ గడ్డపై మరో వన్డే సిరీస్ గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే విండీస్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకున్నది. ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించింది. మ్యాచ్ గెలుస్తామని ఆశలు వదిలేసుకున్న సమయంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత జట్టు 2 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకొని అద్భుతంగా ఆడింది. ఓపెనర్ షై హోప్, కైల్ మేయర్స్ కలిసి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న కైల్ మేయర్స్ (39) దీపక్ హుడా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్రూక్స్ నిలకడగా ఆడుతూ హోప్‌కు అండగా నిలిచాడు. ఇద్దరూ విండీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే బ్రూక్స్ (35) 127 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బ్రాండన్ కింగ్ డకౌట్ అవడంతో భారత శిబిరంలో ఉత్సాహం పెరిగింది.

ఆ తర్వాత షై హోప్, కెప్టెన్ నికొలస్ పూరన్ కలిసి భారత బౌలర్లను దంచి కొట్టారు. పూరన్ సిక్సులతో చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న పూరన్ (74) శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న షై హోప్ తన దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హోప్ 135 బంతుల్లో 115 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత షెపర్డ్ (15), హొసేన్ (6) ఇన్నింగ్స్ ముగించారు. దీంతో విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ధావన్, గిల్ తమ సహజ శైలికి భిన్నంగా.. దూకుడును వదిలి వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. వీరిద్దరూ కలసి 10 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేశారు. భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతుండటం విండీస్ బౌలర్లకు కలసి వచ్చింది. 11వ ఓవర్‌లో శిఖర్ ధావన్ (13)ను షెపర్డ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్ గిల్ (43) పెవీలియన్ చేరాడు. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (9) మేయర్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ కలసి టీమ్ ఇండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 99 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు.

శ్రేయస్ అయ్యర్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు. ఈ క్రమంలో అర్ధ‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అయ్యర్ (63) అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. దీటుగా ఆడుతున్న సంజూ శాంసన్ (54) కూడా అవుటవడంతో భారత జట్టు 205 పరుగులకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయింది. దీంతో అభిమానులు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు.

10 ఓవర్లలో 100 పరుగులు కొట్టాల్సిన సమయంలో దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లు దూకుడు ప్రదర్శించారు. హుడా నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీపక్ హుడా (33) అవుటైనా.. అక్షర్ పటేల్ తన దూకుడు మాత్రం ఆపలేదు. ఏకంగా 5 సిక్సులు, 3 ఫోర్లలతో కేవలం 35 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆవేశ్ ఖాన్ (10), మహ్మద్ సిరాజ్ (1) అండతో అక్షర్ పటేల్ భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత వశమైంది. అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

వెస్టిండీస్ 311/6

ఇండియా 312/8 (49.4 ఓవర్లు)

రికార్డు:

- భారత జట్టు ఈ సిరీస్ గెలవడంతో ఒకే టీమ్ పై వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. వెస్టిండీస్‌పై ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం. అంతకు ముందు పాకిస్తాన్ జింబాబ్వేపై 11 సిరీస్‌లు వరుసగా గెలిచిన రికార్డును టీమ్ఇండియా బద్దలు కొట్టింది.

First Published:  25 July 2022 4:16 AM GMT
Next Story