Telugu Global
Sports

టీమ్ ఇండియా వరుస విజయాలు.. విచారణకు డిమాండ్ చేసిన మాజీ క్రికెటర్

భారత జట్టు వరుసగా విజయాలు సాధించడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.

టీమ్ ఇండియా వరుస విజయాలు.. విచారణకు డిమాండ్ చేసిన మాజీ క్రికెటర్
X

స్వదేశీ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకొని పోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఏడు మ్యాచ్‌లు ఆడి అన్నింటా గెలిచి సెమీస్‌కు చేరుకున్నది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న భారత జట్టు.. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు, ఆసియా కప్ కూడా గెల్చుకున్నది. ఇప్పుడు అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఒక ఊపు ఊపుతోంది.

కాగా, భారత జట్టు వరుసగా విజయాలు సాధించడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ.. ప్రత్యర్థి జట్టు లైనప్‌ను పడగొట్టడం వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అని మాజీ క్రికెటర్ హసన్ రజా వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు గమనిస్తే.. ఇతర దేశాల బౌలర్ల కంటే భారత జట్టు బౌలర్లకు వికెట్‌పై స్వింగ్ ఎక్కువగా లభిస్తోంది. బీసీసీఐ, ఐసీసీ కలిసి ఏమైనా కుట్ర చేసి ఉండొచ్చు. భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నట్లే అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశాడు.

భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ అందించడం వల్లే వాళ్లు ఎలాంటి వికెట్‌పైనా అయినా వికెట్లు తీస్తున్నారు. ఫ్లాట్ వికెట్ మీద కూడా అద్భుతమైన స్వింగ్ రాబడుతున్నారని అన్నారు. పైగా డీఆర్ఎస్ కూడా టీమ్ ఇండియాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని హసన్ రజా డిమాండ్ చేశాడు. కాగా, హసన్ రజా వ్యాఖ్యలపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాంటి ప్రత్యేక బంతులు ఎక్కడైనా ఉంటాయా? అంపైర్లకు ఆ మాత్రం అవగాహన ఉండదా అని ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్‌లో ఇలాంటివి జరుగుతాయేమో కానీ.. ఇండియాలో కాదని కౌంటర్ ఇస్తున్నారు.

భారత జట్టు గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 303 పరుగులతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నది. భారత జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పటిష్టమైన సౌతాఫ్రికాతో పాటు.. సంచలన విజయాలు సాధిస్తున్న నెదర్లాండ్స్‌లో లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు నామమాత్రమే అయినా.. టేబుల్ టాపర్‌గా నిలవాలంటే తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.

First Published:  3 Nov 2023 5:27 AM GMT
Next Story