Telugu Global
Sports

కరీబియన్ టీ-20లో భారత్ బోణీ.. తొలిపోరులో మెరిసిన రోహిత్, కార్తీక్

భారత్ కు లోయర్ ఆర్డర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ తన మెరుపు బ్యాటింగ్ తో అద్దిరిపోయే ముగింపు నిచ్చాడు. ఆఖరి 3 ఓవర్లలో 45 పరుగులు దండుకోవ‌డం ద్వారా 20 ఓవర్లలో భారత్ స్కోరును 190కి చేర్చగలిగాడు.

కరీబియన్ టీ-20లో భారత్ బోణీ.. తొలిపోరులో మెరిసిన రోహిత్, కార్తీక్
X

టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా వెస్టిండీస్ తో ప్రారంభమైన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ట్రినిడాడ్ లోని బ్రియన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిపోరులో ఆతిథ్య వెస్టిండీస్ ను భారత్ 68 పరుగులతో చిత్తు చేయడం ద్వారా 1-0 ఆధిక్యం సంపాదించింది.

రోహిత్ జోరు.. దినేశ్ హోరు..

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలోకి దిగిన భారతజట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. గతానికి భిన్నంగా కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టులో పలుమార్పులు చేశారు. మిడిలార్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్ గా రోహిత్ కు జోడీగా నిలిపారు. రోహిత్- సూర్యకుమార్ జోడీ మొదటి వికెట్ కు మొదటి 4.4 ఓవర్లలోనే 44 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సూర్యకుమార్ 16 బాల్స్ లో 24 పరుగుల స్కోరుకు అవుట్ కాగా..కెప్టెన్ రోహిత్ శర్మ..కేవలం 35 బాల్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ 24 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన రోహిత్ కు ఇదే తొలి అర్ధశతకం కావడం విశేషం. రోహిత్ మొత్తం 44 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో తన 31వ హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాదు..కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరుతో ఉన్న అత్యధిక (3 వేల 399 )పరుగుల రికార్డును సైతం అధిగమించగలిగాడు. రోహిత్ 3వేల 443 పరుగులతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగాడు.

కార్తీక్ ఫినిషింగ్ టచ్..

మిడిలార్డర్ వైఫల్యంతో ఒకదశలో 6 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేసిన భారత్ కు లోయర్ ఆర్డర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ తన మెరుపు బ్యాటింగ్ తో అద్దిరిపోయే ముగింపు నిచ్చాడు. ఆఖరి 3 ఓవర్లలో 45 పరుగులు దండుకోవ‌డం ద్వారా 20 ఓవర్లలో భారత్ స్కోరును 190కి చేర్చగలిగాడు. అశ్విన్ తో కలసి 7వ వికెట్ కు 52 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. దినేశ్ కార్తీక్ కేవలం 19 బాల్స్ లోనే 4 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 41 పరుగులు, అశ్విన్ 13 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు. కరీబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.



భారత బౌలర్ల షో..

191 పరుగుల భారీ లక్ష్యం చేజింగ్ కు దిగిన కరీబియన్ జట్టు 8 వికెట్లకు 122 పరుగుల స్కోరుకు కుప్పకూలిపోయింది. పేస్ జోడీ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ కు స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, రవి బిష్ణోయ్ అండగా నిలిచారు. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ బ్రూక్స్ 20 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువగా.. భారత బౌలర్లలో అశ్విన్, అర్షదీప్, రవి తలో రెండు వికెట్లు, భువీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన దినేశ్ కార్తీక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో టీ-20 సెయింట్ కిట్స్ వేదికగా ఆగస్టు 2న జరుగనుంది.

First Published:  30 July 2022 2:57 AM GMT
Next Story