Telugu Global
Sports

మూడో టీ-20లో `సూర్య`ప్రతాపం!.. 7 వికెట్లతో భారత్ విజయం

మూడో టీ-20లో `సూర్య`ప్రతాపం!.. 7 వికెట్లతో భారత్ విజయం
X

వెస్టిండీస్ తో కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 సిరీస్ మూడో మ్యాచ్ లో భారత్ అలవోక విజయం సాధించింది. సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లు ముగిసే సమయానికి 2-1తో పైచేయి సాధించింది. సెయింట్ కిట్స్ ద్వీపంలోని వార్నర్ పార్క్ వేదికగా ముగిసిన ఈ కీలక సమరంలో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..ప్రత్యర్థి విండీస్ జట్టును 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగింది. కరీబియన్ ఓపెనర్లు బ్రెండన్ కింగ్ ( 20 ), కీల్ మేయర్స్ ( 73 ) చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా.. భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌల్ చేసి కట్టడి చేయగలిగారు. కెప్టెన్ పూరన్ 22. రోవ్ మన్ పావెల్ 23, హేట్ మేయర్ 20 పరుగుల స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, పాండ్యా, హర్షదీప్ చెరో వికెట్ పడగొట్టారు.


సూర్య వీరవిహారం..

20 ఓవర్లలో 165 పరుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్..రిటైర్డ్ హర్ట్ తో ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ 5 బాల్స్ లో ఓ బౌండ్రీ, ఓ సిక్సర్ తో 11 పరుగులు సాధించడం ద్వారా దూకుడుమీదున్న తరుణంలో వెన్నెముక నొప్పితో ఆట నుంచి ఉపసంహరించుకొన్నాడు. దీంతో మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ తో వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ వచ్చి జత కలిశాడు. ఈ ఇద్దరూ కేవలం 11.3 ఓవర్లలోనే స్కోరును 105 పరుగులకు చేర్చ‌డం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశారు. అయ్యర్ 27 బాల్స్ లో 2 బౌండ్రీలతో 24 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్‌ పంత్ తో కలసి సూర్యకుమార్ చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలలకూ తనకే సాధ్యమైన చిత్రవిచిత్రమైన షాట్లతో కరీబియన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బాల్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 44 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హార్థిక్ పాండ్యా 4 పరుగులకే అవుట్ కాగా..రిషభ్ పంత్ 33, దీపక్ హుడా 10 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ లక్ష్యం చేరి 7 వికెట్ల విజయంతో సిరీస్ లో 2-1 తో పైచేయి సాధించింది. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన మెరుపు ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఛేజింగ్ లో 19వ విజయం..

ఈ విజయం ద్వారా భారత్ మరో రికార్డు నమోదు చేసింది. 2019 నుంచి ప్రస్తుత ఈ మ్యాచ్ వరకూ ఆడిన 21 టీ-20 మ్యాచ్ ల్లో భారత్ ఛేజింగ్ లో రెండంటే రెండుమాత్రమే పరాజయాలు చవిచూసి.. 19 విజయాలు నమోదు చేసింది. అంతేకాదు.. ఫాస్ట్ బౌలర్ల స్వర్గం సెయింట్ కిట్స్ వార్నర్ పార్క్ వేదికగా అత్యధిక (165) ఛేజింగ్ స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2017 సిరీస్ లో ఆఫ్ఘనిస్థాన్ పై విండీస్ సాధించిన 147 పరుగులే ఇప్పటి వరకూ అత్యధిక ఛేజింగ్ స్కోరుగా ఉంది. ఈ పాంచ్ పటాకా సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ లను అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా..ఆగస్టు 6, 7 తేదీలలో నిర్వహించనున్నారు.

First Published:  3 Aug 2022 2:58 AM GMT
Next Story