Telugu Global
Sports

సర్ జడేజా మాయ.. రెండో టెస్టులో భారత్ ఘన విజయం

115 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-0 ఆధిక్యతను సాధించింది.

సర్ జడేజా మాయ.. రెండో టెస్టులో భారత్ ఘన విజయం
X

భారత జట్టు వరుసగా నాలుగో టెస్టు మ్యాచ్ గెలిచింది. బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన విజయ పరంపర ఇవ్వాళ ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వరకు కొనసాగింది. 1993 నుంచి ఢిల్లీలో జరిగిన ఏ టెస్టును కూడా భారత జట్టు ఓడిపోలేదు. అదే రికార్డును కొనసాగిస్తూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులో కీలకంగా మారిన రవీంద్ర జడేజానే రెండో టెస్టు విజయంలో అదే పాత్ర పోషించాడు. ఒకే సెషన్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి.. భారత జట్టు చేయాల్సిన పరుగులను తగ్గించడంలో భాగస్వామ్యం అయ్యాడు. రెండో టెస్టు మూడో రోజు ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు కాపాడితే.. 115 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-0 ఆధిక్యతను సాధించింది.

ఆస్ట్రేలియా జట్టు 61/1 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించింది. రెండో రోజు చివరి సెషన్‌లో ఆసీస్ బ్యాటర్లు కొనసాగించిన ఆధిపత్యం మూడో రోజు కూడా ఉంటుందని అభిమానులు భయపడ్డారు. కానీ స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్‌లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. దూకుడుగా ఉన్న ట్రావిస్ హెడ్(42)ను అశ్విన్ ఔట్ చేసి ఆదివారం బోణీ కొట్టగా.. ఆ తర్వాత జడేజా తన స్పిన్ మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. మార్నస్ లబుషేన్ (35) తప్ప రెండో రోజు ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేక పోయారు. స్టీవ్ స్మిత్ (9), రెన్‌షా (2), హ్యాండ్స్‌కాంబ్ (0), అలెక్స్ కేరీ (7), కమ్మిన్స్ (0), లయన్ (8), మర్ఫీ (3 నాటౌట్), కుహ్నెమన్ (0)లు విఫలం కావడంతో ఆసీస్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యి.. ఇండియా ముందు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

మరోసారి కేఎల్ రాహుల్ విఫలం..

115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింి. కేఎలట్ రాహుల్ (1) మరోసారి అత్యల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. రోహిత్ దూకుడు చూస్తే కాసేపట్లోనే మ్యాచ్ ముగించేలా కనపడ్డాడు. కానీ అనవసర పరుగుకు ప్రయత్నించి రోహిత్ (31) రనౌట అయ్యాడు. ఆ తర్వాత పుజార, విరాట్ కోహ్లీ కలిసి కాసేపు క్రీజులో కుదురుకున్నారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అయితే ముర్ఫీ బౌలింగ్‌లో కోహ్లీ (20) స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (12) దూకుడుగా కనిపించినా లయన్ బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు.

శ్రీకర్ చక్కని ఇన్నింగ్స్..

తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ కంట్రోల్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏ మాత్రం తడబాటుకు గురి కాకుండా మంచి కవర్ డ్రైవ్‌లు ఆడుతూ స్కోర్ బోర్డు వేగం పెంచాడు. భరత్ 22 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా.. ఆఖర్లో బౌండరీ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌తో భారత జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ విజయంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో దాదాపు ఇండియా, ఆస్ట్రేలియా బెర్తులు కన్ఫార్మ్ చేసుకున్నాయి.

స్కోర్ బోర్డు :

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 263 ఆలౌట్

ఇండియా తొలి ఇన్నింగ్స్ : 262 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 113 ఆలౌట్

ఇండియా రెండో ఇన్నింగ్స్ : 118/4


First Published:  19 Feb 2023 9:11 AM GMT
Next Story