Telugu Global
Sports

భారత టెస్ట్ జట్టుకు యువరక్తం..భరత్ కు జురెల్ ఎసరు?

భారత్ - ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు రెండుజట్ల సత్తాకు పరీక్షగా మారింది.సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారాయి.

భారత టెస్ట్ జట్టుకు యువరక్తం..భరత్ కు జురెల్ ఎసరు?
X

భారత్ - ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు రెండుజట్ల సత్తాకు పరీక్షగా మారింది.సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారాయి.

ఐసీసీ టెస్టు లీగ్ పరంపరలో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో గెలుపుతో సమఉజ్జీలుగా నిలవడంతో..రాజ్ కోట వేదికగా ఈనెల 15న ప్రారంభం కానున్న మూడోటెస్టు రెండుజట్లకూ డూ ఆర్ డై గా మారింది.

రెండుజట్లకు చెందిన పలువురు సీనియర్ ప్లేయర్లు ఫిట్ నెస్ సమస్యలతో పాటు వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోడంతో యువక్రికెటర్ల టెస్టు కల నెరవేరే అవకాశం వచ్చింది.

భారత యువఆటగాళ్లకు టెస్ట్ క్యాప్ లు....

దేశవాళీ క్రికెట్లో గత కొద్ది సంవత్సరాలుగా నిలకడగా రాణించడంతో పాటు టెస్టుజట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్, వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ లకు టెస్టు క్యాప్ లు ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

సీనియర్ బ్యాటర్లు కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్ నెస్ సమస్యలతోనూ, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వ్యక్తిగత కారణాలతోనూ జట్టుకు దూరం కావడంతో ప్రతిభావంతులైన పలువురు యువక్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పిస్తూ సిరీ్స్ నెగ్గాలని ఆతిథ్య భారత్ భావిస్తోంది.

ప్రస్తుత సిరీస్ లోని రెండో ( విశాఖ ) టెస్టు ద్వారా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అరంగేట్రం చేస్తే..ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభమయ్యే మూడోటెస్టు ద్వారా ముంబై బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్, రాజస్థాన్ కు చెందిన ధృవ్ జురెల్ టెస్టు క్యాపులు అందుకొనే అవకాశం కనిపిస్తోంది.

భరత్ తో విసిగిపోయిన టీమ్ మేనేజ్ మెంట్...

భారత ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరం కావడంతో..భారత టెస్టు వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఆంధ్రప్రదేశ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు దక్కింది. ప్రస్తుత సిరీస్ లోని విశాఖ టెస్టు వరకూ భరత్ 7 టెస్టులు ఆడినా కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేకపోడంతో టీమ్ మేనేజ్ మెంట్ తీవ్రఅసంతృప్తితో ఉంది.

భరత్ స్థానంలో యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కు తుదిజట్టులో చోటు కల్పించాలని నిర్ణయించింది. భారత్ తరపున అండర్ -19 ప్రపంచకప్ లో పాల్గొనడంతో పాటు..ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇంపాక్ట్ బ్యాటర్ గా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న ధృవ్ జురెల్ కు టెస్ట్ క్యాప్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ధృవ్ జురెల్ టెస్టు అరంగేట్రం చేస్తే ఆంధ్ర వికెట్ కీపర్ భరత్ కథ ముగిసినట్లే అవుతుంది.

సరఫ్రాజ్ ఖాన్ ను ఊరిస్తున్న టెస్టు క్యాప్...

దేశవాళీ క్రికెట్లో గత రెండేళ్లుగా అత్యంత నిలకడగా రాణించడంతో పాటు సెంచరీల జోరు, పరుగుల హోరుతో చెలరేగిన ముంబై బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు.

అతికష్టం మీద భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొన్న సరఫ్రాజ్ ఖాన్ విశాఖ వేదికగా ముగిసిన రెండోటెస్టులో మాత్రం బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే రాజ్ కోట టెస్టులో మాత్రం రెండోడౌన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని భర్తీ చేయడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

22 ఏళ్ల వయసు నుంచే దేశవాళీ రంజీక్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ గా సరఫ్రాజ్ గుర్తింపు సంపాదించాడు. 2019, 2020, 2021, 2022 సీజన్లలో సగటున 900 పరుగులు చొ్ప్పున సాధిస్తూ వచ్చాడు. అంతేకాదు...2023 సీజన్లో మూడుశతకాలు బాదాడు.

26 సంవత్సరాల సర్పరాజ్ ఖాన్ కు దేశవాళీ మ్యాచ్ లతో సహా ఇప్పటి వరకూ ఆడిన 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 3వేల 912 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

14 సెంచరీలు, 70.48 స్ట్ర్రయిక్ రేటుతో పాటు 69.85 సగటు సాధించిన ఘనత సైతం ఉంది.

2020 రంజీ సీజన్లో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఉత్తరప్రదేశ్ తో జరిగిన పోరులో ముంబై తరపున సాధించిన 301 పరుగుల నాటౌట్ స్కోరే సర్పరాజ్ ఖాన్ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.

రాజ్ కోట టెస్టు ద్వారా అరంగేట్రం చేసే అవకాశం దక్కితే మాత్రం పూర్తిస్థాయిలో చెలరేగిపోవాలని సరఫ్రాజ్ భావిస్తున్నాడు.

ముకేశ్ స్థానంలో మహ్మద్ సిరాజ్...

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు మూడోటెస్టు బరిలో ఎక్కువమంది యువఆటగాళ్లతో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైశ్వాల్ ఓపెనర్ గా, వన్ డౌన్ లో శుభ్ మన్ గిల్, రెండో డౌన్ లో సరఫ్రాజ్ ఖాన్, మూడో డౌన్లో రజత్ పాటిదార్, నాలుగో డౌన్లో రవీంద్ర జడేజా, 5వ డౌన్ లో ధృవ్ జురెల్, 6వ డౌన్లో అక్షర్ పటేల్, 7వ డౌన్ లో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కు దిగనున్నారు.

విశాఖ టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టిన సీమర్ ముకేశ్ కుమార్ స్థానంలో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తుదిజట్టులో తిరిగి చేరనున్నాడు.

కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సెమీ సీనియర్లూ ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరం కావడంతో రోహిత్ సేన పూర్తిగా యువఆటగాళ్లపైనే ఆధారపడి తన అదృష్టం పరీక్షించుకోనుంది.

First Published:  13 Feb 2024 11:55 AM GMT
Next Story