Telugu Global
Sports

కంగారూ దెబ్బతో భారత టాప్ ర్యాంక్ గోవింద!

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ ఓటమితో వన్డేలలో భారత నంబర్ వన్ ర్యాంక్ గల్లంతయ్యింది

కంగారూ దెబ్బతో భారత టాప్ ర్యాంక్ గోవింద!
X

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ ఓటమితో వన్డేలలో భారత నంబర్ వన్ ర్యాంక్ గల్లంతయ్యింది. కంగారూజట్టు స్వల్పఆధిక్యంతో భారత్ ను అధిగమించడం ద్వారా సరికొత్త ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది...

అనుకొన్నంతా జరిగింది. వన్డే క్రికెట్లో భారత ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ చేజారింది. ఆస్ట్ర్రేలియాతో జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-2తో ఓటమి పొందటంతో..2019 తర్వాత సొంతగడ్డపై తొలి సిరీస్ ఓటమితో పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం చేజార్చుకోవాల్సి వచ్చింది.

నింగినుంచి నేలమీదకు....

2019 సెప్టెంబర్ నుంచి 2023 మార్చి 22 వరకూ..క్రికెట్ మూడు ఫార్మాట్లలోను కలిపి సొంతగడ్డపై వివిధజట్లతో 27 సిరీస్ లు ఆడిన భారత్ 26-1 తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత నుంచి గాల్లో తేలిపోతూ వచ్చిన రోహిత్ సేన..ప్రస్తుత సిరీస్ ను ఆస్ట్ర్రేలియా గెలుచుకోడంతో నేలమీదకు దిగి వచ్చినట్లయ్యింది.

2019లో సొంతగడ్డపై ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 2-3తో చివరిసారిగా ఓటమి చవిచూసిన భారత్..ఆ తర్వాత నుంచి గత 27 సిరీస్ ల్లో తిరిగి ప్రస్తుత 2023 వన్డే సిరీస్ లోనే పరాజయం చవిచూడటం విశేషం.

టీ-20 సిరీస్ ల్లో భారత్ టాప్...

స్వదేశంలో జరిగిన టీ-20 సిరీస్ ల్లో భారత్ అత్యధిక విజయాలతో తిరుగులేని జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్ తో ముగిసిన 2023 టీ-20 సిరీస్ లో అతిపెద్ద విజయంతో 2-1తో సిరీస్ నెగ్గిన భారత్..సొంతగడ్డపై 50వ టీ-20 విజయం నమోదు చేసింది.

తమతమ దేశాలలో అత్యధిక టీ-20 మ్యాచ్ లు నెగ్గినజట్లలో న్యూజిలాండ్ ( 42), దక్షిణాఫ్రికా ( 37), ఆస్ట్ర్రేలియా ( 36 ), వెస్టిండీస్ ( 36) టాప్ ర్యాంకర్ భారత్ తర్వాతి స్థానాలలో నిలిచాయి.

టెస్టుసిరీస్ ల్లో 16 విజయాలు...

గత దశాబ్దకాలంలో సొంతగడ్డపై ఆడిన టెస్టు సిరీస్ ల్లో భారత్ కు 88 శాతం విజయాలున్నాయి. మొత్తం ఆడిన 18 సిరీస్ ల్లో 16 విజయాలు, ఓ సిరీస్ ఓటమి, ఓ సిరీస్ డ్రా రికార్డు భారత్ కు ఉంది. 88 శాతం విజయాలు, 94 శాతం డ్రా ఫలితాలు సాధించడం విశేషం.

50 ఓవర్లలో వన్డే క్రికెట్లో సొంతగడ్డపై భారత్ గత దశాబ్దకాలంలో ఆడిన 18 సిరీస్ ల్లో 15 విజయాలు, 3 పరాజయాలతో 85 శాతం విజయాలు నమోదు చేసింది.

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ రికార్డుస్థాయిలో స్వదేశీ సిరీస్ విజయాలు సాధించడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. ధోనీ తర్వాత సొంతగడ్డపై అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ నిలిచాడు.

టెస్ట్ హోదా పొందిన మొత్తం తొమ్మిది దేశాలజట్లు తమతమ దేశాలలో ఆడిన సిరీస్ లు, సాధించిన విజయాల గణాంకాలు చూస్తే భారత్ తిరుగులేని జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి అగ్రశ్రేణిజట్లపై భారత్ మెరుగైన ఫలితాలు సాధించగలిగింది.

2023లో ఏడుకు ఆరు విజయాలు..

2023 క్రికెట్ సీజన్ ను భారతజట్టు అత్యంత విజయవంతంగా, అజేయంగా ప్రారంభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంకతో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించిన భారత్..వన్డే, టీ-20 ఫార్మాట్లలో న్యూజిలాండ్ ను చిత్తు చేయడం ద్వారా సిరీస్ విజయాల హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ఆ తర్వాత ..టెస్ట్ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను 2-1తో గెలుచుకోడం ద్వారా ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. కంగారూజట్టుపై వరుసగా నాలుగోసారి సిరీస్ విజయంతో ఆధిపత్యం చాటుకొంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో మాత్రం భారత్ కు అనుకోని ఓటమి ఎదురయ్యింది.

ముంబైలో ముగిసిన లోస్కోరింగ్ తొలివన్డేలో 5 వికెట్లతో నెగ్గిన భారత్...విశాఖ వేదికగా జరిగిన రెండోవన్డేలో 10 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది...చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో రోహిత్ సేన 21 పరుగుల ఓటమితో సిరీస్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.

భారత్ 54- ఆస్ట్ర్రేలియా 82

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ తో కలుపుకొని.. భారత్, ఆస్ట్ర్రేలియాజట్లు 146 వన్డేలలో తలపడితే..కంగారూజట్టు 82 విజయాలతోనూ , భారత్ 54 విజయాలతోనూ నిలిచాయి.భారతగడ్డపై ఈ రెండుజట్ల నడుమ జరిగిన 66 వన్డేలలో కంగారూజట్టు 32, భారత్ 30 విజయాలతో నిలిచాయి.

2019లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-3తో ఓటమి పొందిన భారత్ ఆ తర్వాత నుంచి సొంతగడ్డపై అజేయంగా నిలుస్తూ వచ్చింది. వరుస సిరీస్ విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే..భారత్ ను భారత గడ్డపై ఓడించి సిరీస్ గెలుచుకొనే సత్తా కేవలం తనకు మాత్రమే ఉందని ఆస్ట్ర్రేలియా ప్రస్తుత సిరీస్ విజయంతో చాటి చెప్పింది.

2019 సిరీస్ విజయం తరువాత భారత్ పై ఆస్ట్ర్రేలియా ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.

భారత్ ను అధిగమించిన ఆస్ట్ర్రేలియా

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో భారత్ పై 21 పరుగుల విజయం సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా..వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా అవతరించింది.

ఇప్పటి వరకూ టాప్ ర్యాంకర్ గా ఉన్న భారత్ ను 113.86 రేటింగ్ పాయింట్లతో అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు 112.638 పాయింట్లతో రెండోర్యాంక్ కు పడిపోయింది.

First Published:  24 March 2023 6:33 AM GMT
Next Story