Telugu Global
Sports

రో`హిట్`.. ఒక్క మ్యాచ్‌.. రెండు ప్ర‌పంచ రికార్డులు

విండీస్ పై మెరుపు హాఫ్ సెంచరీతో రోహిత్.. అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగాడు.

రో`హిట్`.. ఒక్క మ్యాచ్‌.. రెండు ప్ర‌పంచ రికార్డులు
X

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరీబియన్ టూర్ తన ప్రారంభ టీ-20లోనే అదరగొట్టాడు. వైట్ బాల్ క్రికెట్లో డాషింగ్ ఓపెనర్ గా జంట ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో లోని బ్రియన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీతో తనజట్టును ముందుండి నడిపించడమే కాదు.. భారీవిజయం సైతం అందించాడు. ఈ క్రమంలో కేవలం ఒక్క ఇన్నింగ్స్ తో రెండు సరికొత్త రికార్డులు నమోదు చేయగలిగాడు.

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు!

వెస్టిండీస్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న రోహిత్.. టీ-20 సిరీస్ ద్వారా తిరిగి జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా..వెస్టిండీస్ తో ప్రారంభమైన ఈ సిరీస్ తొలిమ్యాచ్ లోనే సూర్యకుమార్ యాదవ్ తో కలసి భారత ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.కేవలం 4.4 ఓవర్లలోనే మొదటి వికెట్ కు సూర్యకుమార్ తో కలసి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రోహిత్ తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించి..కరీబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బాల్స్ లోనే అర్థశతకం పూర్తి చేశాడు. రోహిత్ మొత్తం 44 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 64 పరుగుల స్కోరుతో తనజట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిఇచ్చాడు.

31 హాఫ్ సెంచరీలతో టాప్!

విండీస్ పై మెరుపు హాఫ్ సెంచరీతో రోహిత్.. అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న 30 హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించాడు. టీ-20 ఫార్మాట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మొదటి ఐదుగురు బ్యాటర్లలో రోహిత్ ( 31 ) తర్వాతి స్థానాలలో విరాట్ కొహ్లీ ( 30 ), పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ( 27 ), డేవిడ్ వార్నర్ ( 23 ), మార్టిన్ గప్టిల్ ( 22 ) నిలిచారు. టీ-20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడి రికార్డు ఇంతకు ముందు వరకూ విరాట్ కొహ్లీ పేరుతోనే ఉంది. 2022 సీజన్లో ఇప్పటి వరకూ 24 టీ-20 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ కు ఇదే తొలి అర్ధ‌శతకం కావడం విశేషం.

గప్టిల్ ను మించిన రోహిత్..

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు కోసం కివీ మెరుపు ఓపెనర్ మార్టిన్ గప్టిల్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ పేరుతో ఉన్న రికార్డును గప్టిల్ అధిగమించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే..ఆ రికార్డు మాత్రం కొద్దిరోజుల ముచ్చటగానే మిగిలింది. విండీస్ తో తొలి టీ-20 మ్యాచ్ ద్వారా రోహిత్ తిరిగి అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును కైవసం చేసుకోగలిగాడు. మొత్తం 64 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రోహిత్ మరోసారి గప్టిల్ ను అధిగమించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. 3వేల 400 పరుగులతో గప్టిల్ రెండు, 3వేల 308 పరుగులతో విరాట్ కొహ్లీ మూడు, ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 2వేల 894 పరుగులతో నాలుగు, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2 వేల 855 పరుగులతో ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు.

First Published:  30 July 2022 2:27 AM GMT
Next Story