Telugu Global
Sports

ఆరు బంతుల్లో 6 సిక్సర్లు..నేపాలీ క్రికెటర్ ప్రపంచ రికార్డు!

నేపాల్ వీరబాదుడు బ్యాటర్ దీపేంద్ర సింగ్ అయిరీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరో ఇద్దరు క్రికెట్ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

ఆరు బంతుల్లో 6 సిక్సర్లు..నేపాలీ క్రికెటర్ ప్రపంచ రికార్డు!
X

నేపాల్ వీరబాదుడు బ్యాటర్ దీపేంద్ర సింగ్ అయిరీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరో ఇద్దరు క్రికెట్ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ చిచ్చర పిడుగు నేపాల్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే అతితక్కువ బంతుల్లో టీ-20 హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపాలీ సూపర్ హిట్టర్ దీపేందర్ సింగ్ అయిరీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు.

ఆఖరి ఓవర్లో బాదుడే బాదుడు...

టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా అల్ అమీరట్ వేదికగా జరుగుతున్న ఏసీసీ ప్రీమియర్ కప్ టోర్నీలో ఖతర్ తో జరిగిన మ్యాచ్ లో నేపాలీ హిట్టర్ అయిరీ చెలరేగిపోయాడు. ఆఖరి ఓవర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది మరో ఇద్దరి పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేయగలిగాడు.

అంతర్జాతీయ టీ-20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ , భారత సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్, కరీబియన్ సూపర్ ఆల్ రౌండర్ కిరాన్ పోలార్డ్ లకు మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు ఉంది. ఆ ఘనతను ప్రస్తుత 2024 సీజన్లో నేపాలీ బ్యాటర్ అయిరీ సొంతం చేసుకోగలిగాడు.

21 బంతుల్లో 64 పరుగులు...

ఖతర్ తో జరిగిన పోటీలో నేపాల్ 174 పరుగులకు 7 వికెట్లు నష్టపోయిన తరుణంలో..మిడిలార్డర్ బ్యాటర్ అయిరీ ఆఖరి ఆరుబంతుల్లో 36 పరుగులు రాబట్టి తనజట్టు స్కోరును 210 పరుగులకు పెంచగలిగాడు.

ఖతర్ మీడియం పేసర్ కమ్రన్ ఖాన్ బౌలింగ్ లో అయిరీ వీరవిహారమే చేశాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా సిక్సర్లకు బాదడం ద్వారా వీరవిహారమే చేశాడు. చివరకు21 బంతుల్లో 64 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షన్ గిబ్స్, అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రాలు వన్డే మ్యాచ్ ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే.. టీ-20 ఫార్మాట్లో మాత్రం 2007 ప్రపంచకప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్, 2021లో కూలిడ్జి వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో కిరానా పోలార్డ్..అకిల ధనంజయ బౌలింగ్ లోనూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన బ్యాటర్లుగా నిలిచారు.

యువరాజ్ ను మించిన అయిరీ...

అయిరీకి..టీ-20ఫార్మాట్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పడం ఇదే మొదటిసారి కాదు. మంగోలియాతో జరిగిన ఆసియాక్రీడల క్రికెట్ గ్రూపు మ్యాచ్ లో మంగోలియాపై అయిరీ కేవలం 9 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న 12 బంతుల్లో టీ-20 హాఫ్ సెంచరీ ప్రపంచ రికార్డును తెరమరుగు చేశాడు.

16 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్ నెలకొల్పిన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ ప్రపంచ రికార్డును అయిరీ అధిగమించాడు. అయిరీ మొత్తం 8 సిక్సర్ల షాట్లతో హాఫ్ సెంచరీ సాధించాడు.

యువరాజ్ మెరుపు హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించిన అయిరీ..ఆరు బంతుల్లో 6 సిక్సర్ల ప్రపంచ రికార్డును సమం చేయటం విశేషం.

అంతేకాదు..టీ-20 ఫార్మాట్లో 300కు పైగా స్కోరు సాధించిన తొలిజట్టుగా నేపాల్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగోలియాపై 20 ఓవర్లలో 4 వికెట్లకు 314పరుగులు నమోదు చేసింది.

2019లో ఐర్లాండ్ ప్రత్యర్థిగా అప్ఘనిస్థాన్ సాధించిన 3 వికెట్లకు 278 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరును నేపాల్ తెరమరుగు చేయగలిగింది. టీ-20 ఫార్మాట్లో 300కు పైగా పరుగుల తేడాతో నెగ్గిన తొలిజట్టుగానూ నేపాల్ మరో ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

First Published:  14 April 2024 10:30 AM GMT
Next Story