Telugu Global
Sports

ఒక్కడి కోసం ముగ్గురు..భారతజట్టుకు ట్రిపుల్ -S పవర్!

యార్కర్లకింగ్ బుమ్రా గాయంతో నీరసపడిన భారత్ కు ట్రిపుల్- ఎస్ రక్తాన్ని ఎక్కించాలని బీసీసీఐ ఎంపిక సంఘం నిర్ణయించింది. ఒక్కడి కోసం మెరికల్లాంటి ముగ్గురు బౌలర్లను సిద్ధం చేసింది.

ఒక్కడి కోసం ముగ్గురు..భారతజట్టుకు ట్రిపుల్ -S పవర్!
X

యార్కర్లకింగ్ బుమ్రా గాయంతో నీరసపడిన భారత్ కు ట్రిపుల్- ఎస్ రక్తాన్ని ఎక్కించాలని బీసీసీఐ ఎంపిక సంఘం నిర్ణయించింది. ఒక్కడి కోసం మెరికల్లాంటి ముగ్గురు బౌలర్లను సిద్ధం చేసింది. ఆస్ట్ర్రేలియాకు బయలుదేరి వెళ్ళాలని ఆదేశించింది....

ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న2022 టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే మాజీ చాంపియన్ , ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ తన బౌలింగ్ బలహీనతను సరిదిద్దుకోడానికి కీలక చర్యలు తీసుకొంది.

బ్యాటింగ్ జోరు...బౌలింగ్ బేజారు...

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారత్ గతంలో ఎన్నడూలేనంతగా ఓ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. బ్యాటింగ్ లో అత్యంత పటిష్టంగాను, బౌలింగ్ లో అత్యంత బలహీనంగాను తయారయ్యింది.

దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ ఆడుతూ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఆసీస్ తో సన్నాహక సిరీస్ ఆడుతూ యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ ఆడుతూ స్వింగ్ కింగ్ దీపక్ చహార్ గాయాలపాలై జట్టుకు దూరం కావడంతో...పదునైన బౌలింగ్ కాస్త పూర్తిగా బలహీనపడిపోయింది.

రాహుల్, రోహిత్, సూర్య, విరాట్ కొహ్లీ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ లాంటి మేటి బ్యాటర్లతో కూడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలో 200కు పైగా భారీస్కోర్లు సాధించినా...విజయానికి గ్యారెంటీ లేకుండాపోయింది. ప్రధానంగా డెత్ ( ఆఖరి 5 ) ఓవర్ల బౌలింగ్ గాల్లో దీపంలా మారిపోయింది.

ఆ ముగ్గురి వైపు భారత్ చూపు...

ప్రపంచకప్ కు వేదికగా ఉన్న ఆస్ట్ర్రేలియాలోని ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై ప్రపంచకప్ నెగ్గుకురావాలంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగం సైతం అత్యంత పటిష్టంగా, సమతూకంతో ఉండితీరాలి.

బ్యాటింగ్ లో అత్యంత భీకరంగా ఉన్న భారత్ తన బౌలింగ్ ను సైతం మెరుగుపరచుకోడానికి...స్టాండ్ బై గా ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీతో పాటు...పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లను ఆస్ట్ర్రేలియా బయలుదేరి వెళ్లాలని ఆదేశించింది.

కంగారూ ల్యాండ్ పిచ్ పైన రాణించే సత్తా సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీతో పాటు...సిరాజ్, శార్దూల్ లకు పుష్కలంగా ఉంది. అక్కడి వాతావరణం, వికెట్ల నుంచి లభించే బౌన్స్ కు తగ్గట్టుగా బౌల్ చేసే దమ్మున్న ట్రిపుల్ -ఎస్ ( షమీ, సిరాజ్, శార్దూల్ ) శక్తిని బౌలింగ్ ఎటాక్ కు జోడించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

షమీ అనుభవం, సిరాజ్ దూకుడు...

మెల్బోర్న్ , పెర్త్, సిడ్నీ, బ్రిస్బేన్ లాంటి ఫాస్ట్ ,బౌన్సీ పిచ్ లపై ఏ విధంగా బౌల్ చేయాలో, డెత్ ఓవర్లలో ఎలాంటి అస్త్ర్రశస్త్రాలు ప్రయోగించాలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీకి పూర్తి అవగాహన, అనుభవం ఉన్నాయి.

మరోవైపు...పేస్, బౌన్సీపిచ్ లపై ప్రమాదకరమైన బౌలర్ గా గుర్తింపు ఉన్న యువఫాస్ట్ బౌలర్ సిరాజ్...ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలవడం ద్వారా దూకుడుమీద కనిపిస్తున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా పేరున్న శార్దూల్ కు పేస్ అంతగా లేకున్నా..కీలక సమయాలలో వికెట్లు పడగొట్టే నేర్పు పుష్కలంగా ఉంది.

ఈ ముగ్గురి చేరికతో...భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యాలతో కూడిన భారత పేస్ ఎటాక్ మరింత పటిష్టంకానుంది.

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భాగంగా ఈనెల 23న భారత్ తన తొలిమ్యాచ్ ను ఆడటానికి ముందు...బ్రిస్బేన్ వేదికగా 17, 19 తేదీలలో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగే సన్నాహకమ్యాచ్ ల్లో పాల్గోనుంది. ఈ సన్నాహకమ్యాచ్ లకు అందుబాటులో ఉండటానికి వీలుగా షమీ, సిరాజ్, శార్దూల్ ...కంగారూల్యాండ్ కు బయలుదేరనున్నారు.

షమీ, సిరాజ్, శార్దూల్ లను ప్రపంచకప్ కు పంపాలని ఎంపిక సంఘం నిర్ణయించడం తగిన సమయంలో తీసుకొన్న కీలక నిర్ణయమని, బౌలింగ్ బలహీనతతో నీరసపడిన భారత్ కు బలమైన టానిక్ లా పనిచేస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

బుమ్రా లేని లోటు పూడ్చటానికి...ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు హుటాహుటిన బ్రిస్బేన్ బయలుదేరి వెళ్లటం ఆశ్చర్యమే మరి.

First Published:  13 Oct 2022 9:16 AM GMT
Next Story