Telugu Global
Sports

టార్గెట్ ఫైనల్స్...ఇంగ్లండ్ తో నేడే భారత్ ఢీ!

టీ-20 ప్రపంచకప్ ఫైనల్ బెర్త్ కోసం ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ తహతహలాడుతోంది. అడిలైడ్ ఓవల్ వేదికగా ఈరోజు జరిగే రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో తలపడనుంది.

india vs england
X

india vs england

టీ-20 ప్రపంచకప్ ఫైనల్ బెర్త్ కోసం ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ తహతహలాడుతోంది. అడిలైడ్ ఓవల్ వేదికగా ఈరోజు జరిగే రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో తలపడనుంది.

ప్రపంచకప్ రెండో సెమీఫైనల్స్ కు అడిలైడ్ ఓవల్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. భారత కాలమానప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమయ్యే నాటౌట్ సమరంలో ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్, రెండోర్యాంకర్ ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఏకపక్షంగా ముగిసిన తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా మాజీ చాంపియన్ పాకిస్థాన్ అలవోకగా ఫైనల్స్ చేరిన కొద్ది గంటల వ్యవధిలోనే రెండోసెమీస్ ప్రారంభంకానుంది.

Advertisement

హాట్ ఫేవరెట్ భారత్...

టీ-20 ఫార్మాట్లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత్ కు మెరుగైన రికార్డే ఉంది. ఇంగ్లండ్ తో ఆడిన గత ఐదు మ్యాచ్ ల్లో 4 విజయాలతో పైచేయి సాధించిన భారత్ కు...ప్రపంచకప్ లో సైతం గతంలో తలపడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలతో ఆధిక్యం సంపాదించింది.

అంతేకాదు...ఇంగ్లండ్ తో ముగిసిన ద్వైపాక్షిక సిరీస్ లో సైతం భారత్ 2-1తో విజేత నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈరోజు జరిగే సెమీఫైనల్లో తలపడబోతోంది. ఓవరాల్ గా ఇంగ్లండ్, భారత్ 22సార్లు ముఖాముఖీ తలపడితే భారత్ 12-10 రికార్డుతో ఉంది.

Advertisement

తుదిజట్టులో రిషభ్ పంత్..

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత తుదిజట్టులో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కు బదులుగా యువఆటగాడు రిషభ్ పంత్ కు చోటు కల్పించనున్నారు.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా గతంలో పరుగుల మోత మోగించిన రిషభ్ పంత్ కు లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా సైతం ఉండటం కలిసొచ్చింది.

ఓపెనింగ్ జోడీ రాహుల్- రోహిత్ ఇచ్చే ఆరంభం పైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండోడౌన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే ఫామ్ లో ఉండడంతో భారత బ్యాటింగ్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది.

బౌలింగ్ లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్ కు ఉండడంతో పవర్ ప్లే ఓవర్లు మరోసారి కీలకం కానున్నాయి.

ఇంగ్లండ్ కు గాయాల బెడద...

టాపార్డర్లో కీలక బ్యాటర్ డేవిడ్ మలన్, మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయాలు ఇంగ్లండ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కెప్టెన్ కమ్ ఓపెనర్ జోస్ బట్లర్, మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ సైతం ఫామ్ లోకి రావడంతో ఇంగ్లండ్ భారత బౌలింగ్ ఎటాక్ కు గట్టి సవాలు విసిరే అవకాశం లేకపోలేదు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం భారత బౌలర్లకు సమస్యలు సృష్టించే అవకాశం లేకపోలేదు.

అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రస్తుత ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడిన అనుభవం భారత్ కు ఉంది. అయితే...ఇంగ్లండ్ మాత్రం అడిలైడ్ లో తొలిసారిగా బరిలోకి దిగుతోంది.

సూర్యకోసం ప్రత్యేక వ్యూహం...

భారత సునామీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై ఓ కన్నేసి ఉంచామని, సూర్యాను కట్టడి చేయటానికి తమకు ప్రత్యేక వ్యూహం ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రకటించాడు. భారత్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ చేరనివ్వబోమని తెలిపాడు. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తోనే తమకు అసలు ముప్పు పొంచిఉందని తెలిపాడు.

పిచ్, వాతావరణ పరిస్థితులు తమకు సమస్యకానేకాదని, అత్యుత్తమంగా రాణించగలిగితే ఫైనల్స్ చేరడం ఏమంత కష్టంకాబోదని చెప్పాడు.

టాస్ నెగ్గినజట్లకు ప్రతికూలం...

అడిలైడ్ఓవల్ వేదికగా టాస్ నెగ్గిన కెప్టెన్లు ఎక్కువమ్యాచ్ ల్లో ఓడిపోడం ఆనవాయితీగా వస్తోంది. పైగా ..ఇక్కడి సగటు స్కోరు 157 పరుగులు మాత్రమే. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 160కి పైగా స్కోరు సాధించగలిగితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మ్యాచ్ రోజు ఉదయం చిరుజల్లులు పడినా...మ్యాచ్ జరిగే సమయంలో వర్షం ఉండదని వాతావరణశాఖ ప్రకటించింది.

Next Story