Telugu Global
Sports

నేడే భారత్- బంగ్లాజట్ల సూపర్..వార్!

ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2లో మూడో విజయానికి భారత్ గురిపెట్టింది. అడిలైడ్ ఓవల్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో రౌండ్ పోరులో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ పనిపట్టడానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది.

నేడే భారత్- బంగ్లాజట్ల సూపర్..వార్!
X

ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2లో మూడో విజయానికి భారత్ గురిపెట్టింది. అడిలైడ్ ఓవల్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో రౌండ్ పోరులో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ పనిపట్టడానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది. మరోవైపు ఈమ్యాచ్ కు వానదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి....

2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో మాజీ చాంపియన్ భారత్ రెండు విజయాలు, ఓ పరాజయం రికార్డుతో నాలుగోరౌండ్ పోరుకు సిద్ధమయ్యింది. భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 1-30 గంటలకు అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే పోటీలో బంగ్లాదేశ్ తో తలపడనుంది.

Advertisement

ఇటు చలిపులి- అటు వానగండం...

భారత్- బంగ్లాజట్ల మ్యాచ్ వేదిక అడిలైడ్ ఓవల్ ను ఎముకలు కొరికే చలితో పాటు...ఏ క్షణంలోనైనా విరుచుకు పడే వరుణదేవుడు భయపెడుతున్నారు. ఉక్కబోత వాతావరణ భారత ఉపఖండ దేశాల నుంచి వచ్చిన భారత్, బంగ్లాదేశ్ జట్లు...తీవ్రమైన చలివాతావరణంతో కూడిన అడిలైడ్ లో ప్రపంచకప్ సమరానికి సిద్ధమయ్యాయి.

గత కొద్దిరోజులుగా కురిసిన వానలతో ఇప్పటికే తడిసిముద్దగా మారిన అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్ ను సైతం వరుణదేవుడు భయపెడుతున్నాడు.

Advertisement

మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం 60 శాతం వరకూ మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వేళలో వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది.

భారతజోరుకు బంగ్లాబేజారేనా?

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ టాప్ ర్యాంకర్ కాగా..బంగ్లాదేశ్ 9వ ర్యాంకర్ గా ఉంది. పైగా..ప్రపంచకప్ లో ఈ రెండుజట్లూ ముఖాముఖీ తలపడిన సమయంలో

భారత్ 10 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ఉండటం చూస్తే..భారత్ కు బంగ్లాజట్టు ఏపాటి పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ నాయకత్వంలోని బంగ్లాజట్టు లో సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, టస్కిన్ అహ్మద్ మాత్రమే సీనియర్ సభ్యులు కాగా..మిగిలినవారంతా

అంతగా అనుభవం లేని యువఆటగాళ్లే. సీనియర్లు, జూనియర్లతో కూడిన బంగ్లాజట్టునుంచి భారత్ కు పోటీ ఏస్థాయిలో ఉంటుందన్నది అనుమానమే.

గ్రూప్ -2 ప్రారంభ రౌండ్లలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు సాధించిన భారత్ మూడోరౌండ్లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే...బంగ్లాతో మ్యాచ్ నెగ్గడం ద్వారా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలన్న పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

పలుమార్పులతో భారతజట్టు...

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ కీలకపోరులో భారత్ పలుమార్పులతో పోటీకి దిగే అవకాశాలున్నాయి. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్, ఆల్ రౌండర్ దీపక్ హుడాకు బదులుగా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ కు అనువైన వికెట్ కావడంతో..అడిలైడ్ మ్యాచ్ లో కీలకం కానున్నాడు.

మొదటి మూడురౌండ్లలో దారుణంగా విఫలమైన ఓపెనర్ రాహుల్..బంగ్లాతో పోరులో పూర్తిస్థాయిలో చేలరేగిపోయినా ఆశ్చర్యంలేదు. అడిలైడ్ ఓవల్ వేదికగా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ విరాట్ కొహ్లీకి ఐదు శతకాలతో పాటు..అలవోకగా పరుగులు సాధించిన రికార్డు సైతం ఉంది.

మరోవైపు..గత రెండుమ్యాచ్ ల్లో స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు సాధించిన మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ సైతం అర్థశతకాల హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది.

భారత్ పైనే ఒత్తిడి- షకీబుల్

ఈమ్యాచ్ లో ఒత్తిడి ఎదుర్కొనే జట్టు ఏదైనా ఉంటే..అది భారత్ మాత్రమేనని బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ అంటున్నాడు. భారత్ ప్రపంచకప్ గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఈ ప్రపంచకప్ బరిలో నిలిచిందని, యువఆటగాళ్లతో కూడిన తమజట్టు మాత్రం అనుభవం కోసమే వచ్చిందని మీడియా సమావేశంలో ప్రకటించాడు. భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టని తమకు తెలుసునని, తమ వ్యూహాలు తమకు ఉన్నాయని వివరించాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా 165 పరుగులకు పైగా స్కోర్లు సాధించిన జట్లకే విజయావకాశాలు ఉంటాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగినజట్లు 16 విజయాలు సాధిస్తే..చేజింగ్ కు దిగిన జట్లు 9సార్లు మాత్రమే విజయాలు సాధించడం విశేషం.

ప్రస్తుత ప్రపంచకప్ లో తొలిసారిగా ఓ మ్యాచ్ కు అడిలైడ్ ఓవల్ ఆతిథ్యమిస్తున్న కారణంగా..వరుణదేవుడు అడ్డుపడకుండా ఉండాలని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులతో పాటు నిర్వాహక సంఘం సైతం కోరుకొంటోంది.

భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 1-30 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

Next Story