Telugu Global
Sports

భారత్ ఓడినా రోహిత్, విరాట్ రికార్డులు!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 మూడోరౌండ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడినా...భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మాత్రం అరుదైన రికార్డులు సాధించారు.

భారత్ ఓడినా రోహిత్, విరాట్ రికార్డులు!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 మూడోరౌండ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడినా...భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మాత్రం అరుదైన రికార్డులు సాధించారు.

పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన ప్రపంచకప్ సూపర్ -12 మూడోరౌండ్ మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైనా చెరో అరుదైన ఘనతను సాధించగలిగారు.

15 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా రోహిత్, వెయ్యికి పైగా పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చోటు సంపాదించారు.

రోహిత్ అత్యధిక మ్యాచ్ ల ప్రపంచ రికార్డు...

టీ-20 ప్రపంచకప్ చరిత్రలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. తన కెరియర్ లో వరుసగా 8వ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న రోహిత్ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూపు-2 లీగ్ లో భాగంగా పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోరౌండ్ మ్యాచ్ ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

2007 ప్రారంభ ప్రపంచ కప్ నుంచి ప్రస్తుత 2022 ప్రపంచకప్ వరకూ...ప్రతిటో్ర్నీలోనూ పాల్గొంటూ వచ్చిన రోహిత్ అత్యధికంగా 36 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

పెర్త్ ఫాస్ట్ -బౌన్సీ పిచ్ పైన దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో భారత కెప్టెన్ కమ్ ఓపెనర్ గా బరిలోకిదిగిన రోహిత్ 14 బాల్స్ లో ఓ సిక్సర్, ఓ బౌండ్రీతో 15 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.


దిల్షాన్ ను అధిగమించిన రోహిత్...

ఇప్పటి వరకూ అత్యధికంగా 35 టీ-20 ప్రపంచకప్ లు ఆడిన శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ పేరుతో ఉన్న ప్రపంచకప్ రికార్డును 36వ మ్యాచ్ ఆడటం ద్వారా రోహిత్ శర్మ అధిగమించాడు.

మొత్తం 36మ్యాచ్ లు, 31 ఇన్నింగ్స్ లో రోహిత్ 919 పరుగులు సాధించాడు. 130.53 స్ట్రయిక్ రేటుతో 36.76 సగటు నమోదు చేశాడు. రోహిత్ సాధించిన మొత్తం 919 పరుగుల్లో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 79 పరుగుల నాటౌట్ స్కోరు అత్యుత్తమంగా ఉంది.

రోహిత్, దిల్షాన్ తర్వాతి స్థానాలలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో, పాక్, బంగ్లా ఆల్ రౌండర్లు షాహీద్ అఫ్రిదీ, షకీబుల్ హసన్ ఉన్నారు.

1001 పరుగుల విరాట్....

టీ-20 ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగుల రికార్డు సాధించిన రెండో బ్యాటర్ గా భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ నిలిచాడు. పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సూపర్-12 గ్రూపు-2 మూడోరౌండ్ పోరుతో 1000 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో పాకిస్థాన్ పై 82 నాటౌట్, నెదర్లాండ్స్ పై 62 పరుగుల నాటౌట్ స్కోర్లతో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన విరాట్..సఫారీలతో ముగిసిన ఉత్కంఠభరిత పోరులో మాత్రం 12 పరుగులకే అవుటయ్యాడు.


తన కెరియర్ లో ఐదో ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న విరాట్ మొత్తం 24 మ్యాచ్ ల్లో 1001 పరుగులు సాధించాడు. తర్వాతి మ్యాచ్ లో విరాట్ మరో 16 పరుగులు చేయగలిగితే...శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేల జయవర్థనే పేరుతో ఉన్న అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును అధిగమించగలుగుతాడు. మహేల మొత్తం 31 మ్యాచ్ ల్లో 1016 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ 33 మ్యాచ్ ల్లో 965 పరుగులు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 మ్యాచ్ ల్లో 919 పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.

First Published:  31 Oct 2022 9:26 AM GMT
Next Story