Telugu Global
Sports

ఒకేదెబ్బకు నాలుగు పిట్టలు..విరాట్ రికార్డుల మోత!

ప్రపంచ క్రికెట్లోకి భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. టీ-20 సూపర్ -12 ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తారాజువ్వలా మెరుపులు మెరిపించాడు.

ఒకేదెబ్బకు నాలుగు పిట్టలు..విరాట్ రికార్డుల మోత!
X

ప్రపంచ క్రికెట్లోకి భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. టీ-20 సూపర్ -12 ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తారాజువ్వలా మెరుపులు మెరిపించాడు. తనజట్టుకు చిరస్మరణీయ విజయం అందించడంతో పాటు రికార్డుల మోత మోగించాడు..

అంతర్జాతీయ క్రికెట్లో గత మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో వెలవెలబోయిన భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ ద్వారా

తారాజువ్వలా దూసుకువచ్చాడు. అంతేకాదు..ప్రస్తుత 2022 టీ-20 ప్రపంచకప్ లో సైతం అదేజోరును కొనసాగిస్తూ తనదైనశైలిలో రికార్డుల మోత మోగించాడు.

ఒకే దెబ్బకు నాలుగు రికార్డులు...

ఒక్క ఇన్నింగ్స్ తో నాలుగు అరుదైన రికార్డులు నెలకొల్పిన మొనగాడిగా విరాట్ కొహ్లీ అవతరించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక, అందులో ప్రత్యర్థిగా దాయాది పాకిస్థాన్ రికార్డుస్థాయిలో 90వేల 293 మంది అభిమానులతో కిటకిటలాడిన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో విరాట్ కొహ్లీ తన టీ-20 కెరియర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి..శతకోటి భారత అభిమానులు కలకాలం గుర్తుంచుకొనే విజయం అందించాడు.

45 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయి.. ఓటమి తప్పదనుకొంటున్న తరుణంలో హార్థిక్ పాండ్యాతో కలసి 113 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు.

విరాట్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ తో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో పలు అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

పాక్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగుల రికార్డు..

పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఉంటే...చేజింగ్ లో విరాట్ కొహ్లీని మించిన మొనగాడు మరొకరు కనిపించరు. పాక్ తో జరిగిన టీ-20 మ్యాచ్ ల్లో

అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక సగటు, అత్యధికసార్లు నాటౌట్ గా నిలిచిన రికార్డులు విరాట్ కు మాత్రమే సొంతం. ప్రస్తుత ప్రపంచకప్ తొలి మ్యాచ్ వరకూ మొత్తం 10 ఇన్నింగ్స్ లో 488 పరుగులతో నాలుగుసార్లు విరాట్ నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఐదు అర్థశతకాలున్నాయి. 30 బౌండ్రీలు, 9 సిక్సర్లు సైతం ఉన్నాయి.


టీ-20 క్రికెట్లో అత్యధిక పరుగులు

ఇప్పటి వరకూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉన్న టీ-20 క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డును విరాట్ అధిగమించాడు. రోహిత్ పేరుతో ఉన్న 3వేల 741 పరుగుల రికార్డును విరాట్ 3వేల 794 పరుగులతో తెరమరుగు చేశాడు.

అంతేకాదు..ఇప్పటి వరకూ తన కెరియర్ లో 110 టీ-20 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన విరాట్ అత్యధిక బౌండ్రీల రికార్డును సైతం నమోదు చేశాడు.

పాక్ పై ప్రస్తుత మ్యాచ్ లో సాధించిన ఆరు బౌండ్రీలతో కలుపుకొని విరాట్ మొత్తం 337 బౌండ్రీలతో రోహిత్ సరసన నిలిచాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 337, ఐరిష్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 344 బౌండ్రీలతో అగ్రస్థానాలలో కొనసాగుతున్నారు.

ఆస్ట్ర్రేలియా బౌన్సీ పిచ్ లపై అత్యుత్తమ సగటు..

కంగారూ ల్యాండ్ లోని బౌన్సీ పిచ్ లపై ఇప్పటి వరకూ 12 టీ-20 మ్యాచ్ లు ఆడిన విరాట్ కు 533 పరుగులతో 64.42 కు పైగా సగటు నమోదు చేశాడు. ఆస్ట్ర్రేలియా పిచ్ లపై అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లు ఇఫ్తీకర్ అహ్మద్, అసీల గుణరత్నే, జెపీ డుమ్నీల సరసన విరాట్ నిలిచాడు.

ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో 927 పరుగులు

విరాట్ తన కెరియర్ లో 2012, 2014, 2016, 2021 ప్రపంచకప్ టీ-20 టో్ర్నీలలో పాల్గొని 845 పరుగులు సాధించాడు. 89 పరుగుల అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో

76.81 సగటు నమోదు చేశాడు.ప్రస్తుత ప్రపంచకప్ తొలిమ్యాచ్ లోనే 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

2012 ప్రపంచకప్ లో 2 హాఫ్ సెంచరీలతో 185 పరుగులు, 2014 ప్రపంచకప్ లో 4 అర్థశతకాలతో 310 పరుగులు, 2016 ప్రపంచకప్ లో 3 అర్థసెంచరీలతో 273 పరుగులు, 2021 ప్రపంచకప్ లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 68 పరుగులు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లోనే 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన విరాట్..సూపర్ -12లో భాగంగా మరో నాలుగుమ్యాచ్ లు..నాకౌట్ రౌండ్లో రెండుమ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

మెల్బోర్న్ రికార్డు...

మెల్బోర్న్ స్టేడియం వేదికగా స్థానిక ఆస్ట్ర్రేలియాజట్టు లేకుండా జరిగిన ఓ మ్యాచ్ కు 90వేల 293 మంది ప్రేక్షకులు హాజరు కావడం ఓ ప్రపంచ రికార్డుగా నిలిచిపోతుంది. డిజిటిల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా అత్యధికమంది వీక్షించిన మ్యాచ్ గా కూడా ఇండో-పాక్ సమరం రికార్డుల్లో చేరింది.

దుబాయ్ వేదికగా కొద్దివారాల క్రితం ముగిసిన ఆసియాకప్ లో భాగంగా భారత్- పాక్ జట్ల ప్రారంభమ్యాచ్ ను డిజిటల్ వేదికగా కోటీ 30 లక్షలమంది వీక్షిస్తే..ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ ను కోటీ 80లక్షల మంది వీక్షించడం మరో ప్రపంచరికార్డుగా మిగిలిపోతుంది.

భారత్- పాక్ జట్ల ఈ ఒక్కమ్యాచ్ ద్వారానే ఆతిథ్య ఆస్ట్ర్రేలియా క్రికెట్ సంఘం, నిర్వాహక ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టర్ స్టార్ నెట్ వర్క్ కు వివిధ రూపాలలో 600 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించడం మరో రికార్డుగా నమోదయ్యింది.

నవంబర్ 13న జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఏస్థాయిలో జరుగుతుందో తెలియదు కానీ.. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల సూపర్ -12 ప్రారంభ మ్యాచ్..టైటిల్ సమరాన్ని మించిన మ్యాచ్ గా జరగటం విశేషం.

First Published:  24 Oct 2022 4:39 AM GMT
Next Story