Telugu Global
Sports

ప్రపంచకప్ లో నాలుగుస్తంభాలాట!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తున్న టీ-20 ప్రపంచకప్ లో రెండో ఘట్టం ముగిసింది. 12జట్లు, రెండుగ్రూపుల సూపర్ -12 రౌండ్ కు మెల్బోర్న్ లో తెరపడటంతో నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ప్రపంచకప్ లో నాలుగుస్తంభాలాట!
X

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తున్న టీ-20 ప్రపంచకప్ లో రెండో ఘట్టం ముగిసింది. 12జట్లు, రెండుగ్రూపుల సూపర్ -12 రౌండ్ కు మెల్బోర్న్ లో తెరపడటంతో నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.....

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ లో తొలిదశ ( 8 జట్ల ) క్వాలిఫైయింగ్, రెండోదశ ( 12 జట్ల ) సూపర్ -12 రౌండ్ పోటీలు విజయవంతంగా ముగియడంతో సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి సిడ్నీ, అడిలైడ్ ఓవల్ మైదానాలలో రంగం సిద్ధమయ్యింది.

గత రెండువారాలుగా సంచలనాలతో సాగిన సూపర్ -12 గ్రూప్ -1 నుంచి గతేడాది రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా..గ్రూప్ -2 నుంచి ఆసియాదిగ్గజాలు, మాజీ చాంపియన్ జట్లు భారత్ పాకిస్థాన్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాయి.

హోరాహోరీగా గ్రూప్ లీగ్ సమరం...

ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్ఘనిస్థాన్ జట్లతో కూడిన సూపర్ -12 గ్రూప్ -1, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో నిండిన గ్రూప్ -2 పోటీలు అనూహ్య ఫలితాలు, ఉత్కంఠభరితమైన పోరుతో హోరాహోరీగా సాగాయి.

గ్రూప్ -1 లీగ్ లో పలుమ్యాచ్ లు వానదెబ్బతో రద్దుల పద్దులో చేరటంతో పలుజట్ల అవకాశాలు తారుమారయ్యాయి. ప్రధానంగా డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్ర్రేలియా సూపర్-12 రౌండ్ నుంచే నిష్క్ర్రమించాల్సి వచ్చింది.

మొత్తం ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో మూడేసి విజయాలతో ఏడు పాయింట్లు చొ్ప్పున సాధించడం ద్వారా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా సమఉజ్జీలుగా నిలిచాయి. నెట్ రన్ రేట్ ప్రకారం మొదటి రెండుస్థానాలలో నిలిచిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకోగలిగాయి.

ఆస్ట్ర్రేలియా, అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, శ్రీలంక సూపర్ -12 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టక తప్పలేదు.

8 పాయింట్ల ఒకే ఒక్కజట్టు భారత్...

ఇక..దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లతో కూడిన గ్రూప్ -2 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్ లో అడుగుపెట్టాయి. ప్రపంచ నంబర్ వన్ భారత్ ఐదురౌండ్లలో నాలుగు విజయాలు, ఓ పరాజయం రికార్డుతో 8 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. గ్రూప్ లీగ్ దశలో అత్యధిక విజయాలతో 8 పాయింట్లు సాధించిన ఒకేఒక్కజట్టుగా భారత్ నిలిచింది.

పసికూన నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగులతో ఘోరపరాజయం పొందడం ద్వారా దక్షిణాఫ్రికా సూపర్ -12 రౌండ్ నుంచే నిష్ర్కమిస్తే...ఆఖరి మూడురౌండ్ల మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధించడం ద్వారా పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకొని నాకౌట్ బెర్త్ సంపాదించగలిగింది.

ఇదే గ్రూపు రెండోరౌండ్ పోరులో పాకిస్థాన్ ను ఒక్కపరుగు తేడాతో జింబాబ్వే కంగు తినిపిస్తే..దక్షిణాఫ్రికాపై సంచలన విజయంతో నెదర్లాండ్స్ కలకలమే రేపింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాజట్లను ఓడించడం ద్వారా నెదర్లాండ్స్ 4పాయింట్లతో లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలవడం ఓ సంచలనంగా మిగిలిపోనుంది.

2016 తర్వాత సెమీస్ లో భారత్...

మాజీ చాంపియన్ భారత్ ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి టీ-20 ప్రపంచకప్ సెమీస్ చేరుకోగలిగింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు తన సూపర్ -12 తొలిరౌండ్లో

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 4 వికెట్ల తేడాతో అధిమించడం ద్వారా టైటిల్ వేట మొదలుపెట్టింది. రెండోరౌండ్లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన భారత్ మూడోరౌండ్లో దక్షిణాఫ్రికాతో తుదివరకూ పోరాడి ఓడింది. అయితే..నాలుగోరౌండ్లో బంగ్లాదేశ్, ఆఖరి రౌండ్లో జింబాబ్వే జట్లను ఓడించడం ద్వారా గ్రూపు టాపర్ గా సెమీస్ చేరుకోగలిగింది.

2007 ప్రారంభ ప్రపంచకప్ లో తొలిసారిగా సెమీస్ చేరిన భారత్..తిరిగి 2016 టోర్నీలో మాత్రమే నాకౌట్ రౌండ్ చేరుకోగలిగింది. గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలలో భారత్ మూడంటే మూడుసార్లు మాత్రమే సెమీస్ చేరడం విశేషం.

సిడ్నీ, అడిలైడ్ వేదికలుగా సెమీస్ వార్...

సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో 4వ ర్యాంకర్ పాకిస్థాన్ తో 5వ ర్యాంకర్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది ప్రపంచకప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్ ...సూపర్ -12 గ్రూప్ -1 రౌండ్ టాపర్ గా సెమీస్ చేరుకోగా..గ్రూప్ -2 రన్నరప్ గా పాకిస్థాన్ సెమీస్ లో అడుగు ప్రవేశించింది.

అడిలైడ్ ఓవల్ వేదికగా గురువారం ( నవంబర్ 10 ) జరిగే రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ భారత్ కు రెండోర్యాంక్ జట్టు ఇంగ్లండ్ సవాలు విసురుతోంది. రండు సెమీఫైనల్‌ మ్యాచ్ లూ భారత కాలమానప్రకారం ఆయా తేదీలలో మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభంకానున్నాయి.

First Published:  7 Nov 2022 7:21 AM GMT
Next Story