Telugu Global
Sports

అహో! సూర్యా...ఒహో! విరాట్!

భారత టీ-20 క్రికెట్లో విజయవంతమైన సరికొత్త భాగస్వామ్యానికి వండర్ విరాట్, థండర్ సూర్యకుమార్ యాదవ్ తెరతీశారు.

అహో! సూర్యా...ఒహో! విరాట్!
X

భారత టీ-20 క్రికెట్లో విజయవంతమైన సరికొత్త భాగస్వామ్యానికి వండర్ విరాట్, థండర్ సూర్యకుమార్ యాదవ్ తెరతీశారు. భారత టాపార్డర్ కీలక స్థానాలలో గత కొద్దిమాసాలుగా నిలకడగా రాణిస్తూ విజయాలకు మార్గం సుగమం చేస్తున్నారు.....

భారత క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఎన్నో విజయవంతమైన జంటలు, భాగస్వామ్యాలు ఉన్నాయి. అయితే...ఈ మధ్యకాలంలో మాత్రం భారత టీ-20 ఫార్మాట్లో

వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండోడౌన్ సూర్యకుమార్ యాదవ్ భాగస్వాములుగా పరుగులమోత మోగిస్తున్నారు.

Advertisement

దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ ఆఖరి లీగ్ పోటీలో హాంకాంగ్ పై అజేయ భాగస్వామ్యం నుంచి ప్రపంచకప్ సూపర్ -12 రెండోరౌండ్ పోరులో నెదర్లాండ్స్ పై సాధించిన భాగస్వామ్యం వరకూ విరాట్ -సూర్యకుమార్ జోడీ అత్యంత విజయవంతమైనజంటగా నిలిచారు.

కూల్ కూల్ విరాట్- హాట్ హాట్ సూర్యకుమార్!

ఆధునిక క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ, నవతరం క్రికెట్ థండర్ సూర్యకుమార్ యాదవ్ ...ఇద్దరూ భిన్నమైన శైలికలిగిన ఆటగాళ్లు. ఒకరి శైలితో మరొకరి శైలికి అసలు పోలికే ఉండదు.

Advertisement

అంతర్జాతీయ క్రికెట్లో అపారఅనుభవం కలిగిన విరాట్ కొహ్లీ బ్యాటింగ్ , షాట్లు కొట్టే తీరు పరిస్థితులు, జట్టు అవసరాలు, వికెట్లకు తగ్గట్టుగా ఉంటుంది. కాస్త బాధ్యత ఎక్కువగా కనిపిస్తుంది.

అదే...మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టయిల్ కు పరిస్థితులు, వికెట్లు, ప్రత్యర్థి బౌలర్లతో ఏమాత్రం సంబంధం ఉండదు. తనజట్టు ఎదురీదుతున్నా లేదా పటిష్టమైన స్థితిలో ఉన్నా...బ్యాటు ఉన్నది బంతిని గ్రౌండ్ నలుమూలలకూ బాదటానికే అన్నట్లుగా ఉంటుంది. ఒత్తిడి అన్నమాటే సూర్య ఆటతీరులో కనిపించదు. ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడికి గురవుతారేమో కానీ..స్కై హై హిట్టర్ సూర్యకుమార్ కు టెన్షన్ అన్నపదమే తెలియదు.


2022 సీజన్లో సూర్యజోరు, విరాట్ హోరు!

గత రెండేళ్లుగా ఫామ్ కోసం నానాపాట్లు పడిన విరాట్ కొహ్లీ ప్రస్తుత 2022 క్యాలెండర్ ఇయర్ లో మూడుఫార్మాట్లలోనూ కలిపి వెయ్యి పరుగులు సాధించిన రికార్డు జోరుతో దూకుడుగా కనిపిస్తున్నాడు. మరోవైపు...టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల మొనగాడిగా సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

విరాట్ కొహ్లీ భాగస్వామిగా ఉంటే పూర్తిస్థాయిలో చెలరేగిపోడం సూర్యకుమార్ కు ఓ అలవాటుగా మారిపోయింది. విరాట్ కొహ్లీ నాన్ స్ట్ర్రయికర్ గా ఉంటే తనలో ఏదో తెలియని శక్తి ప్రవేశించినట్లుగా అనిపిస్తోందని సూర్య చెబుతున్నాడు. బౌలర్ల వ్యూహాలకు సంబంధించి తాను గందరగోళంలో ఉన్నప్పుడు విరాట్ తనకు మార్గదర్శనం చేస్తున్నాడని, తన ఆటతీరుపై విరాట్ ప్రభావం ఎంతో ఉందని సూర్యా మురిసిపోతున్నాడు.

మరోవైపు...విరాట్ మాత్రం...సూర్యకుమార్ అలవోకగా కొట్టే షాట్లు, ఏమాత్రం ఒత్తిడిలేకుండా బౌలర్లపై విరుచుకు పడుతున్న తీరు చూస్తూ అబ్బురపడి పోతున్నాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే సూర్యకుమార్ కు విరాట్ వీరాభిమానిగా మారిపోయాడు.

3 నెలల్లో 4 కీలక భాగస్వామ్యాలు...

భారత్ తరపున టీ-20 మ్యాచ్ లు ఆడుతూ గత మూడు నెలల కాలంలో విరాట్- సూర్య జోడీ 3వ వికెట్ కు నాలుగు కీలక భాగస్వామ్యాలు నమోదు చేయటం విశేషం.

ఈ నాలుగింట్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు కాగా...మరో రెండు 80కి పైగా పరుగుల భాగస్వామ్యాలు కావడం విశేషం.

గత ఆగస్టులో ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన పోటీలో విరాట్- సూర్యజోడీ 3వ వికెట్ కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశారు.

ఇందులో ...సూర్య ఒక్కడే కేవలం 24 బాల్స్ లోనే 68 పరుగుల అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.

ఆ తరువాత హైదరాబాద్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన టీ-20 మ్యాచ్ లో 104 పరుగుల అతిపెద్ద భాగస్వామ్యం సాధించారు. గౌహతీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇక...సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్ తో ముగిసిన ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ పోరులో 95 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. గత 12 మాసాలకాలంలో వన్డేలు, టీ-20లు కలసి మొత్తం 12 ఇన్నింగ్స్ ఆడిన విరాట్- సూర్యజోడీ 551 పరుగులతో 61.22 సగటు సాధించారు.

భాగస్వాములుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సంపూర్ణ అవగాహన, నమ్మకంతో వికెట్ల మధ్యన పరుగెత్తడమే కాదు..బౌండ్రీలు సైతం ఒకరిని చూసి ఒకరం స్ఫూర్తిపొందటం ద్వారా సాధించగలుగుతున్నామని సూర్యకుమార్ అంటున్నాడు.

పేస్ , బౌన్స్ తో కూడిన పెర్త్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే కీలక సమరం తమ జోడీకి నిజంగా సవాలేనని సూర్యకుమార్ ప్రకటించాడు. భారతజట్టు 15 సంవత్సరాల సుదీర్ఘవిరామం తరువాత మరోసారి ప్రపంచ విజేతగా నిలవాలంటే.. నయాసంచలనం సూర్యకుమార్ జోరు, దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ హోరు అత్యంత అవసరం, ఆవశ్యం కూడా.!

Next Story