Telugu Global
Sports

సూర్యా...వారేవ్వా!

ఐపీఎల్ -16వ సీజన్లో 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ జోరు పతాకస్థాయికి చేరింది.

సూర్యా...వారేవ్వా!
X

ఐపీఎల్ -16వ సీజన్లో 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ జోరు పతాకస్థాయికి చేరింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన 12వరౌండ్ మ్యాచ్ లో సూర్యా విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 49 బంతుల్లోనే మెరుపు శతకంతో అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ లో ముంబై సూపర్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రభంజనం తారాస్థాయికి చేరింది. గత ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో ఈ 360 హిట్టర్ ఓ సెంచరీ, 4 అర్థసెంచరీలతో సహా 190. 83 స్ట్ర్రయిక్ రేట్ సాధించాడు.

హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన 12వ రౌండ్ మ్యాచ్ లో సూర్య చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలలకూ తన దైన స్టయిల్లో భారీషాట్లు కొట్టి ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లోని అసలు మజా ఏంటో తన అభిమానులకు చవిచూపించాడు. కేవలం 49 బంతుల్లోనే 11 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 103 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. నెగ్గితీరాల్సిన కీలక మ్యాచ్ లో ముంబైని 27 పరుగుల తేడాతో విజేతగా నిలిపాడు.

టీ-20కి సరికొత్త నిర్వచనం...

సూర్యకుమార్ యాదవ్..అదే అభిమానులు ముద్దుగా పిలుచుకొనే స్కై( SKY) అన్నపేరును సార్థకం చేసుకొంటూ వస్తున్నాడు. ధూమ్ ధామ్ టీ-20క్రికెట్లో బ్యాటింగ్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన మొనగాడు సూర్య. మిన్నువిరిగి మీదపడినా చలించని మనస్తతత్వం, పరిస్థితులకు అనుగుణంగా తనదైన శైలిలో బ్యాటింగ్ చేయటం, కేవలం తన బ్యాటింగ్, మెరుపుషాట్లతో ఆట స్వరూపాన్నే కొద్ది బంతుల్లోనే మార్చేయటంలో సూర్యకు సూర్యమాత్రమే సాటి.

టీ-20 ఫార్మాట్లో బ్యాటింగ్ ప్రమాణాలను 360 డిగ్రీల స్థాయికి చేర్చిన ఘనుడు ఏబీ డివిలియర్స్ కాగా..విచిత్రమైన భంగిమలు, అనూహ్యమైన షాట్లతో అభిమానులు ఊపిరిబిగబట్టి చూసే స్థాయికి చేర్చిన ధీరుడు సూర్యకుమార్ యాదవ్ మాత్రమే.

క్రీజులోకి దిగాడంటే చాలు...

అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో భారత్ తరపున, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్ కు సూర్య ..క్రీజులోకి దిగాడంటే చాలు..పెవీలియన్ లో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్నవారితో పాటు..ప్రత్యర్థిజట్టు సభ్యులు సైతం సూర్య అద్భుతాల కోసం ఎక్కడలేని ఉత్కంఠతో ఎదురుచూసేలా చేయగల మొనగాడు. ఏ బంతిని..ఏ భంగిమలో..గ్రౌండ్ కు ఏవైపున కొడతాడో తెలియని వింత పరిస్థితిని సస్పెన్స్ సృష్టించడంలో సూర్య తర్వాతే ఎవరైనా. టీ-20 క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎవ్వరూ ఆడని షాట్లను సూర్యకుమార్ మాత్రమే ఆడుతున్నాడు.

క్రికెట్ గ్రౌండ్ లోని 360 డిగ్రీల రేంజ్ లోనూ షాట్లు ఆడగల ప్రావీణం సూర్యాకు నిరంతర సాధనతో అబ్బింది. ఇప్పటికే ఆసియా కప్ ,టీ-20 ప్రపంచకప్ తో పాటు పలు అంతర్జాతీయ సిరీస్ ల ద్వారా తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన సూర్యా ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ ర్యాంకును సైతం సొంతం చేసుకొన్నాడు.

విలక్షణ షాట్ల వీరుడు!

భారత్ తరపున రెండో డౌన్, ముంబై పక్షాన వన్ డౌన్లో బ్యాటింగ్ కు దిగుతున్న సూర్య..క్రీజులో అడుగుపెట్టాడంటే చాలు, ప్రత్యర్థి కెప్టెన్, ఫీల్డర్లతో పాటు బౌలర్లు సైతం ఏదో తెలియని గందరగోళానికి గురైపోతూ ఉంటారు. రాబోయే ఉత్పాతాన్ని ముందుగానే పసిగట్టినా..ఏం చేయాలో, ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయ స్థితిలోకి జారిపోతారు.

సూర్య బ్యాటింగ్ మొదలయ్యిందంటే చాలు స్కోరుబోర్డు పరుగులెత్తాల్సిందే. ప్రత్యర్థిజట్ల బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఫ్రంట్..బ్యాక్..లెఫ్ట్..రైట్ అన్నతేడానే లేదు. గ్రౌండ్ నలుమూలలకూ అలవోకగా ఫోర్లు, సిక్సర్లు వెల్లువెత్తాల్సిందే.

చూస్తుండగానే మెరుపువేగంతో హాఫ్ సెంచరీలు చేసేయడం సూర్యకు బ్యాటుతో పెట్టిన విద్యగా మారిపోయింది. నటరాజ భంగిమల్లో నిలబడి ర్యాంప్, పుల్ , కట్, లాఫ్టెడ్, ఫ్లిక్ షాట్లు అలవోకగా ఆడేస్తూ...టీ-20 క్రికెట్ ను సూర్యకుమార్ కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు.

భారత్ తరపున అంతర్జాతీయ టీ-20ల్లో ఇప్పటికే మూడు శతకాలు బాదిన సూర్యకుమార్..ఐపీఎల్ లో మాత్రం తన తొలిశతకం కోసం ప్రస్తుత సీజన్ 12వ రౌండ్ మ్యాచ్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

ఐపీఎల్ లో సూర్య తొలిశతకం..

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా పవర్ ఫుల్ గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన 12వ రౌండ్ మ్యాచ్ లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన వెంటనే వన్ డౌన్లో క్రీజులోకి అడుగు పెట్టిన సూర్య తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పాడు. గుజరాత్ బౌలర్లను ఓ పట్టు పట్టాడు. ప్రస్తుత సీజన్లో అద్భుతంగా రాణిస్తూ వచ్చిన గుజరాత్ పేసర్ మహ్మద్ షమీతో పాటు..కరీబియన్ యువఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ లను తన మెరుపు షాట్లతో బిత్తరపోయేలా చేశాడు.

గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ మాత్రమే ..సూర్య జోరుకు కాస్తో కూస్తో పగ్గాలు వేయగలిగాడు. మిగిలిన బౌలర్లంతా దాసోహమన్నంత పని చేశారు.

ముంబై ఇన్నింగ్స్ 17వ ఓవర్లో అర్థశతకం పూర్తి చేసిన సూర్య..చివరి మూడు ఓవర్లలోనే రెండో అర్థశతకం బాది కలకలమే రేపాడు.

కేవలం 49 బంతుల్లోనే 11 బౌండ్రీలు, 6 సిక్సర్లతో తాండవమే చేశాడు. సూర్య బ్యాటింగ్ చేస్తుంటే క్రికెట్ ఆడుతున్నట్లుగా లేదు..యుద్ధవిద్యల్లో ఆరితేరిన ఓ వీరుడు తన కరవాలంతో చేసే విన్యాసాలు కళ్ల ముందు కదలాడుతాయి.

గత కొద్ది సీజన్లుగా ఐపీఎల్ లో ఆడుతూ వచ్చిన సూర్య అత్యధిక వ్యక్తిగత స్కోరు 83 పరుగులు మాత్రమే. అయితే..గుజరాత్ టైటాన్స్ తో పోరులో మాత్రమే తొలిసారిగా అజేయ సెంచరీ బాదాడు. ఐపీఎల్ లో సూర్యాకు ఇదే తొలి శతకం కావడం విశేషం.

కళ్లు చెదిరే ఫామ్ లో సూర్యకుమార్..

ప్రస్తుత సీజన్ ఐపీఎల్ గత ఏడు ఇన్నింగ్స్ లో సూర్య స్కోర్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో సహా 12 ఇన్నింగ్స్ లో 479

పరుగులతో పర్పుల్ క్యాప్ రేస్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

సగటును 200కు పైగా స్ట్ర్రయిక్ రేట్ తో సూర్య గత ఏడు ఇన్నింగ్స్ లో 57 ( 26 బంతుల్లో ), 23 (12 ), 55 ( 29 ), 66 (31 ), 26 (22), 83 (35 ), 103 నాటౌట్ ( 49 బంతుల్లో ) స్కోర్లు నమోదు చేయడం ద్వారా తన అత్య్తుత్తమ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.

రౌండ్ రాబిన్ లీగ్ చివరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఆడే మ్యాచ్ ల్లో సూర్యకుమార్ మరెంతగా రెచ్చిపోతాడో వేచిచూడాల్సిందే.

First Published:  13 May 2023 11:01 AM GMT
Next Story