Telugu Global
Sports

``స్కై``ని కమ్మేసిన మబ్బులు

ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇన్నాళ్లూ ఏమైపోయాడు? ``స్కై``ని కమ్మేసిన మబ్బులు ఇన్నాళ్లకి తొలగి `సూర్య` సహజకాంతి ప్రసరిస్తోందా? ప్రవీణ్ తాంబే ఎవరు? సినిమాని మించిపోయేలా ఉంది సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ కెరీర్.

సూర్యకుమార్ యాదవ్
X

సూర్యకుమార్ యాదవ్

ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇన్నాళ్లూ ఏమైపోయాడు? ``స్కై``ని కమ్మేసిన మబ్బులు ఇన్నాళ్లకి తొలగి `సూర్య` సహజకాంతి ప్రసరిస్తోందా? ప్రవీణ్ తాంబే ఎవరు? సినిమాని మించిపోయేలా ఉంది సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ కెరీర్.

గల్లీల్లో పదేళ్ల వయస్సు నుంచే క్రికెట్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ 20 ఏళ్లకే రంజీ జట్టుకి ఆడాడు. అప్పటి నుంచి పదకొండేళ్లకి గానీ టీమిండియాలో చోటు దక్కలేదు. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం 31 ఏళ్లకి చేసిన ``స్కై``గా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ ..360 డిగ్రీ ఆటగాడిగా క్రీడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

క్రికెట్ ని కలలు కంటూ..క్రికెట్ నే ఆశ-శ్వాసగా ఆడుతూ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎంత అద్భుతమైన ఫామ్ లో వున్నా...కెరీర్ కొనసాగేది మరో రెండు మూడేళ్లు కూడా వుండకపోవచ్చు. అద్భుత ప్రతిభ కలిగిన ఆటగాడు లేటు వయస్సులో 31 ఏళ్లకి తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం మాత్రం ఇండియన్ క్రికెట్ కి తీరని నష్టమే.

పదహారేళ్లకే 1989లో తొలి అంతర్జాతీయ క్రికెట్ జట్టులోకి వచ్చిన సచిన్ టెండూల్కర్ సుదీర్ఘంగా 24 ఏళ్లపాటు జాతీయజట్టులో కొనసాగాడు. ఇరవై ఏళ్లకే టీమిండియాకి ఎంపికైన విరాట్ కోహ్లీ 14 ఏళ్లుగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్నాడు. వీరితో పోల్చుకుంటే సూర్యకుమార్ యాదవ్ జాతీయ జట్టులోకి రావడమే పదేళ్లకి పైగా ఆలస్యమైంది. 30 ఏళ్లు దాటాక మొదలైన కెరీర్ మూడేళ్ల ముచ్చట కానుందనే మిస్టర్ 360 ఫ్యాన్స్ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘాజీ పూర్లో 1990 సెప్టెంబర్ 14న జన్మించారు.

తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి తరలిరావాల్సి వచ్చింది. దిలీప్ వెంగ్ సర్కార్ అకాడమీలో శిక్షణ పొందిన సూర్యకుమార్ యాదవ్ వివిధ దశల క్రికెట్లో తన అద్భుత ప్రతిభని కనబరిచాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై రంజీ జట్టుకు 2010లోనే ఆడాడు. అనంతరం 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడయ్యాడు. 2013లో కోల్ కతా నైట్ రైడర్స్ సూర్యని చేజిక్కించుకుంది.

ఐపీఎల్ లో మెరిసిన సూర్యకి అందరిలా అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకునేందుకు దాదాపు పుష్కర కాలం పట్టింది. 2010లో ముంబై రంజీ జట్టుకి ఆడిన 20 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్...పదేళ్ల ఐపీఎల్లో చేసిన టన్నుల కొద్దీ పరుగులు ఎట్టకేలకు 31వ ఏటని అరంగేట్ర అవకాశం అందించాయి. శ్రీలంక పర్యటనకి వెళ్లిన టీమిండియా జట్టులో చోటు సంపాదించిన సూర్యకుమార్ యాదవ్ తన తొలి వన్డే మ్యాచ్ 2021 జూలై 18న ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో ఆడాడు.

టీ20 వరల్డ్ కప్ లో వరల్డ్ వైడ్ క్రికెట్ ప్రేమికుల్ని అలరించిన ఈ 360 డిగ్రీల ఆటగాడు తొలి టీ 20 ఇంగ్లాండ్ మీద 2021 మార్చి 15న ఆడే చాన్స్ దక్కించుకున్నాడు. ప్రతిభతో జాతీయ జట్టులో చోటు సంపాదించిన సూర్య కెరీర్ మరో మూడేళ్లు ముచ్చటగానే మిగిలిపోనుంది. మూడు పదుల దాటిన తరువాత కూడా విదేశీ ఫాస్ట్ పిచ్ ల ఆకాశమే హద్దుగా చెలరేగిన స్కై కి వయస్సు సమస్య కాదు. కానీ ఒక్క కీలక మ్యాచులో ఫెయిలైనా వయస్సుని చూపి పక్కన పెట్టే ప్రమాదకర ఎత్తుగడలు సూర్య గ్రహణంలా వెంటాడుతున్నాయి.

First Published:  16 Nov 2022 9:05 AM GMT
Next Story