Telugu Global
Sports

సూర్యకుమార్ సూపర్ ఫాస్ట్ రికార్డు....

20 ఓవర్లు, 60 థ్రిల్స్ గా సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. 2022 సీజన్లో సూర్యకుమార్ పలు సంచలన ఇన్నింగ్స్ తో అరుదైన రికార్డులు నెలకొల్పాడు.

సూర్యకుమార్ సూపర్ ఫాస్ట్ రికార్డు....
X

టీ-20 క్రికెట్లో భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ ప్రభంజనం ప్రారంభమయ్యింది. 360 డిగ్రీల కోణంలో గ్రౌండ్ నలుమూలలకూ రకరకాల షాట్లు కొట్టడంలో దిట్టగా పేరుపొందిన సూర్యకుమార్ దక్షిణాఫ్రికాతో రెండో టీ-20 మ్యాచ్ ద్వారా పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు.....

20 ఓవర్లు, 60 థ్రిల్స్ గా సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. 2022 సీజన్లో సూర్యకుమార్ పలు సంచలన ఇన్నింగ్స్ తో అరుదైన రికార్డులు నెలకొల్పాడు.

ప్రస్తుత సీజన్లో ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా మెరుపుశతకం బాదిన నాటినుంచి సూర్య మరి వెనుదిరిగి చూసింది లేదు. దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్, ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన తీన్మార్ సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్ ల్లో సూర్య ఆకాశమేహద్దుగా సాగిపోతున్నాడు.

హిట్, హిట్ హుర్రే...

రెండో డౌన్లో సూర్య బ్యాటింగ్ కు దిగాడంటే చాలు..టాప్ గేర్ లో స్కోరుబోర్డు పరుగులెత్తాల్సిందే. ప్రత్యర్థిజట్ల బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఫ్రంట్..బ్యాక్..లెఫ్ట్..రైట్ అన్నతేడానే లేదు. గ్రౌండ్ నలుమూలలకూ అలవోకగా ఫోర్లు, సిక్సర్లు వెల్లువెత్తాల్సిందే.

చూస్తుండగానే మెరుపువేగంతో హాఫ్ సెంచరీలు చేసేయడం సూర్యకు బ్యాటుతో పెట్టిన విద్యగా మారిపోయింది. నటరాజ భంగిమల్లో నిలబడి ర్యాంప్, పుల్ , కట్, లాఫ్టెడ్, ఫ్లిక్ షాట్లు అలవోకగా ఆడేస్తూ...టీ-20 క్రికెట్ ను సూర్యకుమార్ కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు.

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికా దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టీ-20లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన సూర్యకుమార్...గౌహతీ వేదికగా జరిగిన రెండో టీ-20లో సైతం అదేజోరు, అదే దూకుడు కొనసాగించాడు. కేవలం 18 బాల్స్ లోనే 4 సిక్సర్లు, 5 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 22 బాల్స్ లోనే 61 పరుగుల స్కోరుకు రనౌట్ గా వెనుదిరిగాడు.

అతితక్కువ బాల్స్ లో మెరుపువేగంతో అర్ధశతకం బాదిన భారత బ్యాటర్ల వరుసలో సూర్యకుమార్ 3వ స్థానంలో నిలిచాడు. గౌహతీ మ్యాచ్ లో సూర్యకుమార్ 18 బాల్స్ లో మెరుపు అర్ధశతకం బాదాడు.

2007 టీ-20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ కేవలం 12 బాల్స్ లోనే ప్రపంచ రికార్డు అర్ధశతకం బాదితే...2021 సీజన్లో స్కాట్లాండ్ తో జరిగిన పోరులో కెఎల్ రాహుల్ 18 బాల్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పుడు సూర్యుకమార్ అదే 18 బాల్స్ రికార్డును సమం చేయగలిగాడు. 4 సిక్సర్లు, 5 ఫోర్లతో సూర్యకుమార్ 50 పరుగులు సాధించాడు.

అతితక్కువ బంతుల్లో 1000 పరుగుల రికార్డు...

2022 సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లోనే సూర్యకుమార్ 1000 పరుగుల మైలురాయిని చేరాడు. భారత టీ-20 చరిత్రలోనే అత్యంత వేగంగా వెయ్యి పరుగులు

సాధించిన భారత మూడో బ్యాటర్ గా సూర్య రికార్డుల్లో చేరాడు. విరాట్ కొహ్లీ, రాహుల్ ల తర్వాతి స్థానంలో నిలిచాడు.

32 సంవత్సరాల సూర్యకుమార్ 31 ఇన్నింగ్స్ లోనే ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో వెయ్యి పరుగులు సాధించగలిగాడు. అంతేకాదు..అతితక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా సూర్యకుమార్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా హిట్టర్ గ్లెన్ మెక్స్ వెల్ పేరుతో ఉన్న 604 బాల్స్ లో 1000 పరుగుల రికార్డును సూర్యకుమార్ 574 బంతుల్లో వెయ్యి పరుగులు సాధించడం ద్వారా అధిగమించాడు.

సిక్సర్లు బాదుడులోనూ సూర్యకుమార్ తనకుతానే సాటిగా నిలిచాడు. 2022 సీజన్లో అత్యధిక టీ-20 సిక్సర్లు బాదిన మొనగాడు సూర్యకుమార్ యాదవ్ మాత్రమే.

ఈ నెల 23న పాకిస్థాన్ తో జరుగనున్న ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ నుంచే సూర్యకుమార్ ఇదే రేంజ్ లో రాణించగలిగితే..భారత్ ప్రపంచకప్ కలలు నెరవేరినట్లే.

First Published:  3 Oct 2022 5:47 AM GMT
Next Story