Telugu Global
Sports

సూర్య షో, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్..సిరీస్ సమం!

కెప్టెన్ సూర్యకుమార్ సునామీ శతకంతో జట్టును ముందుండి నడిపించడంతో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 1-1తో సమం చేసి సంయుక్తవిజేతగా నిలిచింది.

సూర్య షో, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్..సిరీస్ సమం!
X

కెప్టెన్ సూర్యకుమార్ సునామీ శతకంతో జట్టును ముందుండి నడిపించడంతో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 1-1తో సమం చేసి సంయుక్తవిజేతగా నిలిచింది...

దక్షిణాఫ్రికాతో జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ అజేయంగా నిలిచింది. నెగ్గితీరాల్సిన ఆఖరిపోరులో 106 పరుగుల భారీవిజయంతో 1-1తో సిరీస్ ను సమం చేయటం ద్వారా సంయుక్త విజేతగా అవతరించింది.

మిస్టర్ టీ-20 ప్రపంచ రికార్డు శతకం...

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దు కావడం, రెండోమ్యాచ్ లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 5 వికెట్ల విజయం సాధించడంతో...జోహెన్స్ బర్గ్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరిమ్యాచ్ లో నెగ్గితీరాల్సిన పరిస్థితిలో భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడి కళ్లు చెదిరే విజయంతో తనకుతానే సాటిగా నిలిచింది.

బ్యాటింగ్ కు అనువుగా ఉన్న న్యూవాండరర్స్ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ పైన టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు కెప్టెన్ సూర్యకుమార్ కేవలం 56 బంతుల్లోనే సుడిగాలి శతకం సాధించడంతో 201 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగుల స్కోరుతో రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత మిగిలిన బ్యాటర్లలో గిల్ 8, తిలక్ వర్మ0, రింకూ 14,రితేశ్ శర్మ 4, జడేజా 4 పరుగులకు వెనుదిరిగినా సూర్య మాస్టర్ క్లాస్ సెంచరీతో భారత్ 20 ఓవర్లలో 201 పరుగుల భారీస్కోరుతో ప్రత్యర్థి ఎదుట 202 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.

సూర్య ప్రపంచ రికార్డు సమం...

టీ-20 చరిత్రలో నాలుగు శతకాలు బాదిన రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్ వెల్ ల ప్రపంచ రికార్డును సూర్య సమం చేశాడు. న్యూవాండరర్స్ స్టేడియంలో సఫారీ బౌలర్లకు తన స్ట్ర్రోక్ ప్లేతో చుక్కలు చూపించాడు.

మొత్తం 7 ఫోర్లు, 8 సిక్సర్లతో ఆట19వ ఓవర్ లో శతకాన్ని పూర్తి చేశాడు.గతేడాది రెండు టీ-20 శతకాలు బాదిన సూర్యకు ప్రస్తుత సీజన్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

2015 నుంచి 2018 మధ్యకాలంలో రోహిత్ శర్మ 4 సెంచరీలు, మాక్స్ వెల్ 8 సంవత్సరాల సమయంలో నాలుగు శతకాలు బాదితే..సూర్యమాత్రం కేవలం రెండు సీజన్ల కాలంలోనే 4 శతకాల ప్రపంచ రికార్డును సాధించాడు. కేవలం 57 ఇన్నింగ్స్ లోనే, అతితక్కువ బంతుల్లోనే నాలుగు శతకాలు, 2వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

సిక్సర్ల బాదుడులోనూ సూర్య జోరు...

సిక్సర్ల బాదుడులోనూ సూర్య మరోసారి తన బ్యాటు పవర్ ఏంటో చూపించాడు. దక్షిణాఫ్రికా పై 8 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. టీ-20 చరిత్రలో రోహిత్ శర్మ అత్యధికంగా ఓ ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. 2017లో శ్రీలంకపై ఈ ఘనత సాధించాడు.

2023 లో రాజ్ కోట్ వేదికగా శ్రీలంకపైన సూర్య 9 సిక్సర్లతోనూ, 2017లో శ్రీలంకపైనే కెఎల్ రాహుల్ 8 సిక్సర్ల రికార్డులు సాధిస్తే..ప్రస్తుత ఆఖరి మ్యాచ్ లో సూర్య 8 సిక్సర్లు సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

57 ఇన్నింగ్స్ లో 123 సిక్సర్ల సూర్య...

రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్ లో 182 సిక్సర్లతో టాపర్ గా నిలిస్తే..సూర్య కేవలం 57 ఇన్నింగ్స్ లోే 123 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కొహ్లీ 107 ఇన్నింగ్స్ లో 117 సిక్సర్లు, కెఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్ లో 99 సిక్సర్లు, యువరాజ్ సింగ్ 51 ఇన్నింగ్స్ లో 74 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.

దక్షిణాఫ్రికాతో ఈ ఆఖరి పోరాటంలో సూర్య ఎదుర్కొన్న మొదటి 9 బంతుల్లో 18 పరుగులతో 200 స్ట్ర్రయిక్ రేట్ సాధించాడు. ఆ తర్వాత 20 బంతుల్లో 17 పరుగులతో 85 స్ట్ర్రయిక్ రేట్ మాత్రమే నమోదు చేసిన సూర్య తన చివరి 26 బంతుల్లో టాప్ గేర్ తో చెలరేగిపోయాడు. 65 పరుగులు సాధించడంతో పాటు 250 స్ట్ర్రయిక్ రేట్ సాధించాడు.

కుల్దీప్ స్పిన్ జాదూలో సఫారీల గల్లంతు..

మ్యాచ్ నెగ్గాలంటే 202 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా కేవలం 13.6 ఓవర్లలోనే 95 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్ తన 29వ పుట్టినరోజున విశ్వరూపమే ప్రదర్శించాడు. 2.5 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా తన టీ-20 కెరియర్ లో అత్యుత్తమ రికార్డు సాధించాడు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

2015-16 నుంచి తిరుగులేని భారత్...

2015-16 టీ-20 సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా టాప్ ర్యాంకర్ భారత్ అజేయంగా నిలుస్తూ వస్తోంది. 2017-18 తరువాత సఫారీగడ్డపై భారత్ తొలిసారిగా ద్వైపాక్షిక టీ-20 సిరీస్ లో పాల్గొని 1-1 తో సమఉజ్జీగా నిలవడం ద్వారా తన అజేయ రికార్డును కొనసాగించగలిగింది.

ప్రస్తుత సిరీస్ వరకూ ఈ రెండుజట్లూ 26 మ్యాచ్ ల్లో తలపడితే..భారత్ 14, దక్షిణాఫ్రికా 12 విజయాల రికార్డుతో ఉన్నాయి. మొత్తం మీద ప్రస్తుత టీ-20 సిరీస్ మిస్టర్ టీ-20, 360 హిట్టర్ సూర్యకుమార్ షోగా ముగిసినట్లయ్యింది.

First Published:  15 Dec 2023 3:05 AM GMT
Next Story