Telugu Global
Sports

విరాట్ కంటే సూర్యానే బెస్ట్- గంభీర్

టీ- 20 క్రికెట్లో భారత అత్యుత్తమ బ్యాటర్ నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ మాత్రమేనని భారత మాజీ ఓపెనర్, బీజెపీ ఎంపీ గౌతం గంభీర్ చెప్పాడు. తన దృష్టిలో విరాట్ కొహ్లీ కంటే సూర్యకుమార్ యాదవే గొప్ప టీ-20 బ్యాటర్ అంటూ ప్రకటించాడు.

విరాట్ కంటే సూర్యానే బెస్ట్- గంభీర్
X

టీ- 20 క్రికెట్లో భారత అత్యుత్తమ బ్యాటర్ నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ మాత్రమేనని భారత మాజీ ఓపెనర్, బీజెపీ ఎంపీ గౌతం గంభీర్ చెప్పాడు. తన దృష్టిలో విరాట్ కొహ్లీ కంటే సూర్యకుమార్ యాదవే గొప్ప టీ-20 బ్యాటర్ అంటూ ప్రకటించాడు...

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో పరుగుల మోత మోగిస్తున్న భారత నయా సంచలనం, మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ ను భారత మాజీ దిగ్గజాలు, విఖ్యాత క్రికెట్ కామెంటీటర్లు అంటున్నారు.

ప్రత్యర్థిజట్టు, బౌలర్ ఎవరన్నది చూడకుండా, వికెట్ ను ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆడుతూ...టీ-20 క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అభిమానులను మాత్రమే కాదు..క్రికెట్ విశ్లేషకులను సైతం అలరిస్తున్నాడు.


2022 క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టీ-20 పరుగులు సాధించిన మొనగాడిగా ఇప్పటికే సరికొత్త రికార్డు నెలకొల్పిన సూర్య...టీ-20 ప్రపంచకప్ లో సైతం పరుగుల హోరు, హాఫ్ సెంచరీల జోరుతో వారేవ్వా అనిపించుకొంటున్నాడు.

డచ్ పై అలా...సఫారీల పై ఇలా...

తన కెరియర్ లో తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న సూర్యకుమార్ సూపర్ -12 రౌండ్లో ఇప్పటి వరకూ ఆడిన మూడుమ్యాచ్ ల్లోనే రెండు హాఫ్ సెంచరీలతో భారత అత్యుత్తమ బ్యాటర్ గా నిలిచాడు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన తొలిరౌండ్ పోరులో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినా...నెదర్లాండ్స్ తో జరిగిన రెండోరౌండ్, పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడోరౌండ్ పోటీలలో చెలరేగిపోయాడు.

సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్ షాట్ ఆడటం ద్వారా సూర్యకుమార్ ప్రపంచకప్ లో తన తొలి అర్థశతకాన్ని నమోదు చేయగలిగాడు.

బౌన్సీ పిచ్ పైన సూర్యకుమార్ షో...

ఇక...ఫాస్ట్ -బౌన్సీ పిచ్ కు మరోపేరైన పెర్త్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకపోరులో సూర్యకుమార్ అలవోకగా స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా భారత్ పరువు దక్కించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఓపెనర్ రాహుల్, సూపర్ హిట్టర్ హార్థిక్ పాండ్యా లాంటి మొనగాళ్లు సఫారీ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసినా...సూర్యకుమార్ ఒంటరి పోరాటమే చేశాడు.

పెర్త్ బౌన్సీ పిచ్ పైన నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల దండును తన ఎదురుదాడితో నిలువరించాడు. దినేశ్ కార్తీక్ తో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా భారత్ 133 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.

ప్రతికూల పరిస్థితుల్లో సూర్యప్రతాపం...

ఎముకలు కొరికే వాతావరణం, నిప్పులు చెరిగే ప్రత్యర్థి ఫాస్ట్ బౌలింగ్ దళం, జట్టులోని సహ బ్యాటర్లు గుడ్లు తేలేసిన కీలక సమయంలో...సూర్య తనదైన శైలిలో ఒత్తిడి అనేది లేకుండా ఎదురుదాడి మొదలు పెట్టాడు. 40 బంతులు ఎదుర్కొని ఆరు బౌండ్రీలు, 3 సిక్సర్లతో 68 పరుగుల స్కోరుతో ఆట 19వ ఓవర్లో అవుటయ్యాడు.

భారత ఆటగాళ్లు సాధించిన మొత్తం 8 బౌండ్రీలలో సూర్య సాధించినవే అరడజను బౌండ్రీలు ఉండటం విశేషం.

దినేశ్ కార్తీక్ తో కలసి 51 పరుగుల భాగస్వామ్యంతో భారత్ కు ఊపిరి పోశాడు.

రవి శాస్త్రి, గంభీర్ కితాబు....

భారతజట్టు 50 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులో ఉన్న సూర్యకుమార్..తొణకనిబెణకని తన బ్యాటింగ్ తో సఫారీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడని, తన దృష్టిలో ఓ భారత బ్యాటర్ ఆడిన అత్యుత్తమ, అసాధారణ ఇన్నింగ్స్ సూర్యకుమార్ దేనంటూ భారత మాజీ చీఫ్ కోచ్, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రి ప్రశంసించాడు.

మరోవైపు..ఢిల్లీ మాజీ కెప్టెన్, భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం..విరాట్ కొహ్లీని మించిన ఆటగాడు సూర్యకుమార్ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

పాకిస్థాన్ పై విరాట్ సాధించిన 82 పరుగుల ఇన్నింగ్స్ కు మీడియా ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చిందని, విపరీతమైన ప్రచారం కల్పించిందని...తన దృష్టిలో విరాట్ ఇన్నింగ్స్ కంటే పెర్త్ లో సూర్యకుమార్ సాధించిన 68 పరుగుల ఇన్నింగ్సే అత్యుత్తమమైనదంటూ ప్రకటించాడు. టీ-20 చరిత్రలోనే ఓ భారత బ్యాటర్ ఆడిన అపురూపమైన, అనితరసాధ్యమన ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ ది మాత్రమేనంటూ కొనియాడాడు.

గతంలో భారత్ తరపున సెంచరీలు బాదిన, మ్యాచ్ లు గెలిపించిన ఇన్నింగ్స్ ఎన్నో తాను చూశానని...అయితే..సూర్యకుమార్ ఇన్నింగ్స్ ముందు అవన్నీ దిగదుడుపేనంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు.

భారత్ జట్టుగా ఓడినా...సూర్యకుమార్ అసలు సిసలు విజేతగా నిలిచాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

First Published:  31 Oct 2022 7:34 AM GMT
Next Story