Telugu Global
Sports

సూర్యాకు డకౌట్ల గ్రహణం!

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత భారత క్రికెట్ వైఫల్యాల చర్చ.. డకౌట్ల వీరుడు సూర్యకుమార్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది.

సూర్యాకు డకౌట్ల గ్రహణం!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన మిస్టర్ 360 స్ట్ర్రోక్ మేకర్ సూర్యకుమార్ ను వన్డే వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్ర్రేలియాతో సిరీస్ లో మూడు వరుస డకౌట్లతో సూర్య ప్రతిష్ట మసకబారింది. డకౌట్ల గ్రహణం పట్టింది.....

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత భారత క్రికెట్ వైఫల్యాల చర్చ.. డకౌట్ల వీరుడు సూర్యకుమార్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది.

ఆస్ట్ర్రేలియాతో ఇటీవలే ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే డకౌట్లుగా వెనుదిరిగాడు.

దీంతో..సంజు శాంసన్ లాంటి ప్రతిభావంతులైన బ్యాటర్లను పక్కనపెట్టి..సూర్యకు పదేపదే అవకాశాలు ఇవ్వటం, పైగా విఫలమవుతున్నా వెనుకేసుకు రావడం పైనే ప్రస్తుతం ఘాటైన చర్చ సాగుతోంది.

అప్పుడు సచిన్...ఇప్పుడు సూర్యా!

వన్డే క్రికెట్లో ఓ సిరీస్ లోని మూడుకు మూడుమ్యాచ్ ల్లో సూర్యకుమార్ డకౌట్లు కావటాన్ని మీడియాలోని కొన్ని వర్గాలు ప్రపంచ రికార్డుగా అభివర్ణిస్తున్నాయి.

అయితే..భారత వన్డే చరిత్రలో వరుసగా మూడు డకౌట్లైన తొలి క్రికెటర్ సూర్య కుమార్ ఏమాత్రం కాదు. సూర్యకంటే ముందే ఈ చెత్త రికార్డును మూటకట్టుకొన్న ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్లు సచిన్ టెండుల్కర్, అనీల్ కుంబ్లేతో సహా మరో ఐదుగురున్నారు.

1994లో సచిన్ టెండుల్కర్ వరుసగా మూడు ఇన్నింగ్స్ లో డకౌట్లయిన భారత తొలిక్రికెటర్ గా నిలిచాడు. ఆ తర్వాత 1996లో అనీల్ కుంబ్లే, 2003-04లో జహీర్ ఖాన్, 2010-11లో ఇషాంత్ శర్మ, 2017-2019లో జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు.

అయితే..మూడు వరుస డకౌట్లయిన రెండో స్పెషలిస్ట్ బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.

అందివచ్చిన అవకాశాలు ఆవిరి......

భారత జట్టులో చోటు కోసం సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘకాలమే ఎదురుచూశాడు. 31 సంవత్సరాల లేటు వయసులో కానీ భారత టీ-20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. జట్టులో చేరిన ఏడాదిలోనే ప్రపంచ అత్యుత్తమ టీ-20 బ్యాటర్ గా, నంబర్ వన్ ర్యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. దీంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ సైతం సూర్యను వెన్నుతట్టి పలు విధాలుగా ప్రోత్సహించింది. వన్డేలతో పాటు ..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం భారతజట్టుకు ఆడే అవకాశం కల్పించింది.

ఆస్ట్ర్రేలియాతో నాగపూర్ వేదికగా జరిగిన తొలిటెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సూర్య సత్తా చాటుకోలేకపోయాడు. వన్డేలలో సైతం సూర్య అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

వన్డేలలో భారత నంబర్ -4 ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వెన్నెముక గాయంతో జట్టుకు దూరం కావడంతో సూర్యకు వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి.

అయినా..సూర్య ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీగా డకౌట్లయిన సూర్య..కీలక మూడోవన్డేలో స్పిన్నర్ అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. మూడు వరుస డకౌట్లతో విమర్శకులకు పూర్తిస్థాయిలో పని కల్పించాడు.

భారతజట్టుకు ఆడిన గత 17 వన్డేలలో సూర్య ఒక్క అర్థశతకమూ సాధించలేకపోయాడు. గత 11 ఇన్నింగ్స్ లో 0, 0, 0, 9, 14, 31, 4, 6, 34, 4, 8, 9 స్కోర్లతో సూర్య వెలవెలబోయాడు.

సూర్యాకు అండగా కెప్టెన్, కోచ్....

వరుసగా విఫలమవుతున్నా సూర్యాకే అవకాశాలు ఇవ్వటాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పు పట్టారు. సూర్యాకంటే ఎక్కువ సగటున్న సంజు శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారంటూ ట్విట్టర్ ద్వారా సెలెక్టర్లను నిలదీశారు.

అయితే..వైఫల్యాలు ఆటలో భాగమని, సూర్యా వరుసగా విఫలమవుతున్నా తగిన అవకాశాలు ఇచ్చి తీరుతామని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తేల్చి చెప్పారు.

సూర్యలోని అపారప్రతిభను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే తగినన్ని అవకాశాలు ఇవ్వాలని, నిలదొక్కుకోడానికి సహకరించడమే తమ విధానమని రోహిత్ ప్రకటించాడు.

మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోడంతో..ఆ స్థానంలో సూర్యాను ఆడిస్తున్నామని, వరుసగా విఫలం కావడం ఆందోళన కలిగిస్తున్నా...నిలదొక్కుకొనే వరకూ తగిన అవకాశలూ కల్పిస్తూనే ఉంటామని స్పష్టం చేశాడు. ప్రతిభావంతులైన, అసాధారణ బ్యాటర్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపైన ఎంతైనా ఉందని భారత కెప్టెన్ వివరించాడు.

సూర్యపై టీమ్ మేనేజ్ మెంట్ కు నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు ఓర్పుతో వ్యవహరించాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్ మెంట్ పై ఉంటుందని, మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి చెప్పారు. సూర్యాకు తగిన అవకాశాలు ఇవ్వాల్సిందేనని చెప్పకనే చెప్పారు.

భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత మిడిలార్డర్లో సూర్యకుమార్ కీలకమని టీమ్ మేనేజ్ మెంట్ గట్టిగానే భావిస్తోంది. తనకు అండగా నిలిచిన కోచ్, కెప్టెన్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సూర్యకుమార్ పైన ఎంతో ఉంది.

క్రికెట్ ఓ విచిత్రమైన క్రీడ. వరుసగా మూడు సెంచరీలు బాదిన బ్యాటర్ ..వరుసగా మూడు ఇన్నింగ్స్ లోనూ డకౌట్లుగా వెనుదిరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. జయాపజయాలు ఎంత సహజమో..శతకాలు, డకౌట్లు కూడా క్రికెట్లో అంతే సహజం.

First Published:  26 March 2023 2:03 AM GMT
Next Story