Telugu Global
Sports

ఐపీఎల్-17లో ముంబైకి ' సూర్యో'దయం!

ఐపీఎల్ 17వ సీజన్లో వరుస వైఫల్యాలతో విలవిలలాడుతున్న ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి.

ఐపీఎల్-17లో ముంబైకి  సూర్యోదయం!
X

ఐపీఎల్ 17వ సీజన్లో వరుస వైఫల్యాలతో విలవిలలాడుతున్న ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులో చేరటానికి ముహూర్తం కుదిరింది.....

కాలిమడమ గాయంతో గత డిసెంబర్ నుంచి భారత టీ-20 జట్టుకు దూరమైన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ రీ-ఎంట్రీకి ముహూర్తం కుదిరింది. ఐపీఎల్ -17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టులో తిరిగి చేరటానికి రంగం సిద్ధమయ్యింది.

జంట శస్త్ర్రచికిత్సలతో దూరం...

రెండు రకాల శస్త్ర్రచికిత్సల కారణంగా గత నాలుగుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వచ్చిన 33 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్ నూటికి నూరుశాతం కోలుకొన్నట్లు, పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ నిర్దారించింది. సూర్య ఫిట్ నెస్ ను నిర్థారించడానికి పలురకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమోదం తెలిపింది. ఐపీఎల్ లో ముంబై తరపున సూర్య తిరిగి ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సూర్యాకు కాలిమడమ ఆపరేషన్ తో పాటు స్పోర్ట్స్ హెర్నియాకు సైతం శస్త్ర్రచికిత్స నిర్వహించారు.

ఏప్రిల్ 7 లేదా 11న తొలిమ్యాచ్....

సూర్యాకు జాతీయ క్రికట్ అకాడమీ నిపుణుల బృందం ఆర్టీపీ ( రిటర్న్ టు ప్లే ) సర్టిఫికెట్ ను సైతం ఇచ్చింది. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ మొదటి మూడు రౌండ్ల మ్యాచ్ ల్లోనూ పరాజయాలు చవిచూసిన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు ప్రస్తుతం జామ్ నగర్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో సేదతీరుతున్నారు. ఏప్రిల్ 5న ముంబైలో నిర్వహించే శిక్షణ శిబిరంలో సూర్యకుమార్ వచ్చి చేరనున్నాడు.

ప్రస్తుత సీజన్ లో సూర్య తన తొలిమ్యాచ్ ను ఏప్రిల్ 5 లేదా 11 న ఆడే అవకాశం ఉందని ముంబై ఫ్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈ ఆదివారం జరిగే మ్యాచ్ ద్వారా సూర్య రీ-ఎంట్రీ ఖాయమని భావిస్తున్నారు. ఏప్రిల్ 11న హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. గత డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 సిరీస్ నుంచి సూర్య లేకుండానే భారతజట్టు పాల్గొంటూ వచ్చింది.

వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024- టీ-20 ప్రపంచకప్ లో సైతం సూర్యకుమార్ భారత్ కు కీలకం కానున్నాడు. భారత్ మరోసారి టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే తుదిజట్టులో సూర్యకుమార్ ఉండితీరక తప్పదు.

First Published:  4 April 2024 1:08 PM GMT
Next Story