Telugu Global
Sports

ప్రపంచకప్ సూపర్ -12లో సూపర్ షాక్ లు!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూప్ లీగ్ పోటీలు అంచనాలకు అందనిరీతిలో సాగిపోతున్నాయి. గ్రూపులతో సంబంధం లేకుండా దిగ్గజజట్లపై అనామకజట్లు విజయాలు సాధిస్తున్నాయి. గ్రూప్ -1లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ను ఐర్లాండ్ దెబ్బకొడితే...గ్రూప్ -2లో మరో మాజీ చాంపియన్ పాకిస్థాన్ కు జింబాబ్వే షాకిచ్చింది.

ప్రపంచకప్ సూపర్ -12లో సూపర్ షాక్ లు!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూప్ లీగ్ పోటీలు అంచనాలకు అందనిరీతిలో సాగిపోతున్నాయి. గ్రూపులతో సంబంధం లేకుండా దిగ్గజజట్లపై అనామకజట్లు విజయాలు సాధిస్తున్నాయి. గ్రూప్ -1లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ను ఐర్లాండ్ దెబ్బకొడితే...గ్రూప్ -2లో మరో మాజీ చాంపియన్ పాకిస్థాన్ కు జింబాబ్వే షాకిచ్చింది.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ నుంచే సంచలనాల పర్వం మొదలయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్నజట్లు తమకంటే ఎన్నోరెట్లు బలమైన జట్లను ఓడించడం ద్వారా ఫలితాలను, అవకాశాలను తారుమారు చేస్తున్నాయి.

Advertisement

గాల్లో దీపంలా పాక్ సెమీస్ బెర్త్!

ప్రపంచ మాజీ చాంపియన్, 4వ ర్యాంకర్ పాకిస్థాన్ ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరుకోడం గాల్లోదీపంలా మారింది.

ప్రారంభమ్యాచ్ లో టాప్ ర్యాంకర్ భారత్ తో ఆఖరిబంతి వరకూ పోరాడిన పాక్ జట్టు..11వ ర్యాంకర్ జింబాబ్వే చేతిలో అనూహ్యం పరాజయం చవిచూడటం ద్వారా నాకౌట్ రౌండ్ అవకాశాలను క్లిష్టం చేసుకొంది.

పెర్త్ వేదికగా ముగిసిన రెండోరౌండ్ లోస్కోరింగ్ పోరులో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో పాకిస్థాన్ ను కంగు తినిపించింది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 11వ ర్యాంక్ జట్టుగా ఉన్న జింబాబ్వే గ్రూప్-2లో సంచలన విజయంతో కలకలమే రేపింది. వివిధ జట్ల సెమీస్ ఆశలు, అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చింది.

Advertisement

కొంపముంచిన ఒక్కపరుగు!

ఒక్కటేగా..అంటూ నిర్లక్ష్యం చేస్తే నిజజీవితంలో మాత్రమే కాదు...క్రికెట్లో సైతం భారీమూల్యం చెల్లించుకోక తప్పదని కొండలాంటి పాకిస్థాన్ తో పసికూన లాంటి జింబాబ్వే మ్యాచ్ చాటి చెప్పింది.

జింబాబ్వే సాధించిన 130 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ప్రపంచ మేటి బ్యాటర్లు బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ లాంటి మొనగాళ్లున్నా పాక్ జట్టు చేధించలేకపోయింది. చివరకు 129 పరుగుల స్కోరుకే పరిమితమై..ఒక్క పరుగుతేడాతో ఓటమి చవిచూసింది.

మ్యాచ్ నెగ్గాలంటే ఆట ఆఖరి ఓవర్లలో పాక్‌ విజయానికి 11 బంతులు అవసరం కాగా.. 2 వికెట్లు నష్టపోయి కేవలం 9 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు మహమ్మద్‌ రిజ్వాన్‌ (14), బాబర్‌ ఆజమ్‌ (4) విఫలం కాగా.. షాన్‌ మసూద్‌ ఒక్కడే ఒంటరిపోరాటం చేసి 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (5), షాదాబ్‌ ఖాన్‌ (17), హైదర్‌ అలీ (0) ఎక్కువసేపు నిలువలేకపోవడంతో ఆఖర్లో ఒత్తిడిలో పడ్డ పాకిస్థాన్‌ చివరకు పరాజయం పాలైంది. జింబాబ్వే బౌలర్లలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సికందర్‌ రజా 3, బ్రాడ్‌ ఇవాన్స్‌ 2 వికెట్లు పడగొట్టారు.

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ కు గత ఎనిమిదేళ్లలో తొలిసారిగా అర్హత సాధించిన జింబాబ్వేకు ఇదే అతిపెద్ద విజయం.

మిగిలిన మూడుమ్యాచ్ లు నెగ్గితేనే...

భారత్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికాజట్లతో కూడిన గ్రూప్ -2 సూపర్-12 రౌండ్లో ఆడిన మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైన పాకిస్థాన్..మిగిలిన మూడురౌండ్లలో ఒక్కమ్యాచ్ ఓడినా...సెమీస్ రేస్ నుంచి వైదొలగక తప్పదు. పైగా పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో జరిగే పోరులో ఆరునూరైనా పాక్ జట్టు నెగ్గితీరాల్సి ఉంది.

జింబాబ్వే కొట్టిన దెబ్బతో పాకిస్థాన్ నాకౌట్ రౌండ్ అవకాశాలు ఒక్కసారిగా సంక్లిష్టంగా మారిపోయాయి.

ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్...

అంతేకాదు..ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లతో కూడిన సూపర్ -12 గ్రూప్ -1 రౌండ్లోనే సంచలనం చోటు చేసుకొంది. గ్రూప్ ఆఫ్ డెత్ గా పేరుపొందిన గ్రూప్ -1లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్, మాజీ విజేతలు ఇంగ్లండ్, శ్రీలంక లాంటి పటిష్టమైనజట్లు ఉండడంతో ప్రతి గెలుపు, ఓటమి కీలకంగా మారింది.

ప్రపంచ అత్యుత్తమ టీ-20 జట్లలో ఒకటిగా పేరుపొందిన ఇంగ్లండ్ కు 12వ ర్యాంక్ జట్టు ఐర్లాండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది.మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఈమ్యాచ్ కు వానదెబ్బ తగలడంతో డక్ వర్త్- లూయిస్ విధానం ప్రకారం 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై ఐర్లాండ్ నెగ్గినట్లు అంపైర్లు ప్రకటించారు.

వానదెబ్బతో నిర్ణితసమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైన ఈపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటయ్యింది.

కెప్టెన్ కమ్ ఓపెనర్ యాండీ బాల్ బిర్నీ62 పరుగులు, వన్ డౌన్ బ్యాటర్ టక్కర్ 34 పరుగులతో రాణించారు. ఒక దశలో 3 వికెట్లకు 103 పరుగులతో భారీస్కోరుకు ఉరకలేసిన ఐర్లాండ్ జట్టు..చివరి 7 వికెట్లను 54 పరుగుల తేడాతో కోల్పోయింది.

కెప్టెన్ బాల్ బిర్నీ 47 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టక్కర్ 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో34 పరుగుల స్కోరు సాధించాడు.

ఇంగ్లండ్ కు వరుణశాపం...

159 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు వానదెబ్బ గట్టిగానే తగిలింది. కుండపోత వానతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 14.3 ఓవర్లలో 5 వికెట్లకు 105పరుగులు మాత్రమే చేయగలిగింది.

వర్షంతో మ్యాచ్ రద్దయ్యే సమయానికి ...డక్ వర్త్ -లూయిస్ విధానం ప్రకారం ఐర్లాండ్ కంటే ఇంగ్లండ్ 5 పరుగులతో వెనుకబడి ఉంది.

డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో నెగ్గినట్లు అంపైర్లు ప్రకటించడంతో ప్రస్తుత ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం నమోదైనట్లయ్యింది.

ఈ ఓటమితో ప్రపంచ రెండోర్యాంకర్ ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు సైతం క్లిష్టంగా మారాయి.

ఒక్కమ్యాచ్, ఒక్క నిర్ణయం, ఒక్క పరుగు, ఒక్క క్యాచ్, ఒక్క ఓటమి వివిధజట్ల తలరాతను మార్చి వేస్తాయనటానికి క్రికెట్ ను ...ప్రధానంగా టీ-20ని మించింది మరొకటి లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Next Story