Telugu Global
Sports

భారత కుర్రాళ్లకే జోహోర్ కప్!

ఆరుదేశాల అంతర్జాతీయ జూనియర్ హాకీ టైటిల్ ను భారత్ ఎనిమిదేళ్ల విరామం తర్వాత గెలుచుకొంది. మలేసియా వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత కుర్రాళ్లు 5-4 గోల్స్ తేడాతో ఆస్ట్ర్రేలియాపైన సంచలన విజయం సాధించారు.

భారత కుర్రాళ్లకే జోహోర్ కప్!
X

ఆరుదేశాల అంతర్జాతీయ జూనియర్ హాకీ టైటిల్ ను భారత్ ఎనిమిదేళ్ల విరామం తర్వాత గెలుచుకొంది. మలేసియా వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత కుర్రాళ్లు 5-4 గోల్స్ తేడాతో ఆస్ట్ర్రేలియాపైన సంచలన విజయం సాధించారు...

జూనియర్ ప్రపంచకప్ హాకీకి భారత యువజట్టు సన్నాహాలు కళ్లు చెదిరే రీతిలో ప్రారంభమయ్యాయి. మలేసియాలోని జోహర్ బహ్రూ వేదికగా జరిగిన 2022 సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టైటిల్ ను రెండుసార్లు విజేత భారత్ మూడోసారి కైవసం చేసుకొంది.

ఆస్ట్ర్రేలియా, మలేసియా, గ్రేట్ బ్రిటన్, దక్షిణాఫ్రికా, జపాన్ జట్లు పాల్గొన్న ఈ టో్ర్నీలో భారత్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది.

8 ఏళ్ల విరామం తర్వాత టైటిల్...

చివరిసారిగా 2014లో జోహోర్ కప్ నెగ్గిన భారతజట్టు ఆ తర్వాత నుంచి రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే..ప్రస్తుత 10వ జోహోర్ కప్ టోర్నీ ద్వారా ఆలోటును పూడ్చుకోగలిగింది.

పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన టైటిల్ సమరంలో భారత్ పెనాల్డీ షూటౌట్ ద్వారా 5-4 గోల్స్ తో విజేతగా నిలిచింది. ఆట నిర్ణితసమయంలో రెండుజట్లూ చెరో గోల్ సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీషూటౌట్ పాటించారు. షూటౌట్ లో సైతం రెండుజట్లూ 3-3 గోల్స్ తో ముగించడంతో సడెన్ డెత్ ను అమలు చేశారు.

సడెన్ డెత్ లో భారత గోల్ కీపర్ మోహిత్ శశికుమార్ అసాధారణంగా రాణించడం ద్వారా ఆస్ట్ర్రేలియా ఆటగాళ్ల ప్రయత్నాలను వమ్ము చేసి తనజట్టును విజేతగా నిలిపాడు.

ఆట ముగిసే వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో ఆధిక్యత చేతులు మారుతూ వచ్చింది. సడెన్ డెత్ లో భారత గోల్ కీపర్ అసమానప్రతిభ కారణంగా మూడోసారి విజేతగా ట్రోఫీ అందుకోగలిగింది.

ఆరుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే 4-3 గోల్స్ తేడాతో ఓటమి పొందిన భారత్...గ్రేట్ బ్రిటన్, ఆస్ట్ర్రేలియాజట్లతో జరిగిన మ్యాచ్ లను 5-5 గోల్స్ తో డ్రాగా ముగించి...మలేసియా, జపాన్ జట్లపై భారీవిజయాలు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలవడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది.

లీగ్ దశలో ఆస్ట్ర్రేలియాకు 5 గోల్స్ సమర్పించుకొన్న భారత్...టైటిల్ సమరంలో మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి సఫలం కాగలిగింది.

2013 నుంచి మూడుసార్లు టైటిల్...

2013, 2014 జోహోర్ కప్ టోర్నీలలో విజేతగా నిలుస్తూ వచ్చిన భారత్..2012, 2015, 2018, 2019 టోర్నీలలో మాత్రం రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2014 నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన భారత్ చివరకు 2022 టోర్నీలో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాలలో ఈ టోర్నీని నిర్వహించలేదు.

First Published:  30 Oct 2022 4:15 AM GMT
Next Story