Telugu Global
Sports

ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. ఎనిమిదోసారి ఆసియా కప్ గెలిచిన‌ టీమ్ ఇండియా

హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక జట్టు కకావికలమై పోయింది. బుమ్రా మొదలు పెట్టగా సిరాజ్ పడొట్టగా.. హార్థిక్ పాండ్యా ముగించేశాడు.

ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. ఎనిమిదోసారి ఆసియా కప్ గెలిచిన‌ టీమ్ ఇండియా
X

వరుణుడి అడ్డంకి లేదు.. శ్రీలంక బ్యాటర్ల మెరుపులు లేవు.. టీవీల ముందు సర్థుకొని కూర్చునేలోపే శ్రీలంక బ్యాటర్లు మొత్తం పెవీలియన్ చేరిపోయారు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక జట్టు కకావికలమై పోయింది. బుమ్రా మొదలు పెట్టగా సిరాజ్ పడొట్టగా.. హార్థిక్ పాండ్యా ముగించేశాడు.

కీలకమైన వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టు అద్భుమైన ఆటతీరుతో ఆకట్టుకున్నది. కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో 8వ సారి భారత జట్టు ఖాతాలో ఆసియా కప్ చేరింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుశాల్ పెరీరాను బుమ్రా అవుట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (2), సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను ఓకే ఓవర్‌లో పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. సిరాజ్ బౌలింగ్‌లోనే షనక (0), కుసాల్ మెండిస్ (17) వికెట్లు పారేసుకున్నారు. ఇక చివర్లో ప్రమోద్ మదుషాన్ (1), మెథీసా పతిరానా (0)లను హార్థిక్ పాండ్యా అవుట్ చేయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

శ్రీలంక బ్యాటర్లలో కుషాల్ మెండిస్ 17, హేమంత 13 తప్ప ఎవరూ డబుల్ డిజట్ స్కోర్ చేయలేదు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. మహ్మద్ సిరాజ్ 6, హార్దిక్ పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇక 51 పరుగుల సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27 నాటౌట్), ఇషాన్ కిషన్ (23 నాటౌట్) కేవలం 6.1 ఓవర్లలో మ్యాచ్ ముగించారు.

మ్యాచ్ రికార్డులు..

శ్రీలంక జట్టుకు ఇండియాపై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. మొత్తంగా వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అతి తక్కువ స్కోర్. భారత జట్టుకు మిగిలి ఉన్న బంతుల పరంగా ఇదే అతి పెద్ద విజయం. టీమ్ ఇండియా 263 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. ఒక టోర్నమెంట్ ఫైనల్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండో సారి. అంతకు ముందు 1998లో షార్జాలో జింబాబ్వాపై గెలిచింది. ఇక ఒక వన్డే మ్యాచ్‌లో అతి తక్కువ బంతుల్లో మ్యాచ్ ముగియడంలో ఈ రోజు మ్యాచ్ మూడోస్థానంలో ఉంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 129 బంతుల్లో మ్యాచ్ ముగిసిపోయింది.

మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

First Published:  17 Sep 2023 1:35 PM GMT
Next Story