Telugu Global
Sports

హోంగ్రౌండ్లో హైదరాబాద్ కు పంజాబ్ టెన్షన్?

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో హైదరాబాద్ వేదికగా నేడు ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కు స్ధానం బలంతో సన్ రైజర్స్ సవాలు విసురుతోంది.

హోంగ్రౌండ్లో హైదరాబాద్ కు పంజాబ్ టెన్షన్?
X

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో హైదరాబాద్ వేదికగా నేడు ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కు స్ధానం బలంతో సన్ రైజర్స్ సవాలు విసురుతోంది....

ఐపీఎల్ 16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది. ఈరోజు జరిగే డబుల్ హెడ్డర్ రెండోమ్యాచ్ ( రాత్రి 7-30 గంటలకు)కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు రెండుకు రెండుమ్యాచ్ లు నెగ్గి మూడో విజయానికి ఉరకలేస్తుంటే..హైదరాబాద్ సన్ రైజర్స్ రెండుకు రెండుమ్యాచ్ లూ ఓడి..కనీసం మూడో మ్యాచ్ లో నైనా నెగ్గడం ద్వారా బోణీ కొట్టాలని చూస్తోంది.

ఇంటా..బయటా ఓటమితో సన్ రైజర్స్ గుబులు...

ప్రస్తుత సీజన్ తొలిమ్యాచ్ లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో భారీపరాజయం పొందిన హైదరాబాద్ సన్ రైజర్స్..రెండోరౌండ్ పోరులో ఎడెన్ మర్కరమ్ కెప్టెన్ గా పోటీకి దిగినా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి తప్పలేదు.

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలతో కుదేలైపోయిన సన్ రైజర్స్..హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ఈరోజు పంజాబ్ తో జరిగే మూడోరౌండ్ పోరులో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

జట్టులోని దేశీ ఆటగాళ్లతో పాటు కోట్లరూపాయలు పోసి కొన్న విదేశీ స్టార్లు సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించాలని సన్ రైజర్స్ కోచ్ బ్రయన్ లారా కోరుతున్నాడు.

సఫారీ బ్యాటర్లు మర్కరమ్, క్లాసెన్, ఇంగ్లీష్ హిట్టర్ హ్యారీ బ్రూక్ ప్రస్తుత సీజన్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు. అయితే రాజీవ్ స్టేడియం వేదికగా ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే పోరులో సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.

ప్రత్యర్థి పంజాబ్ తన తుదిజట్టులో ఫాస్ట్ బౌలర్ రబడను చేర్చుకొంటే..సన్ రైజర్స్ తన తురుపుముక్క మయాంక్ అగర్వాల్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు దించే అవకాశాలు లేకపోలేదు.

రబడ ప్రత్యర్థిగా మయాంక్ అగర్వాల్ కు కళ్లు చెదిరే స్ట్ర్రయిక్ రేటుతో పాటు మంచి సగటు సైతం ఉంది. హైదరాబాద్ వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్ కు సైతం పంజాబ్ ప్రత్యర్థిగా 18 గేమ్స్ లో 26 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం సన్ రైజర్స్ కు అనుకూలమైన అంశంగా ఉంది.

బౌలింగ్ విభాగంలో పేస్ బౌలింగ్ త్రయం ఉమ్రాన్ మాలిక్, భువీ, నటరాజన్, మార్కో జాన్సన్ తో పాటు..స్పిన్ జోడీ వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్ సైతం కీలకం కానున్నారు.

టాప్ గేర్ లో పంజాబ్ కింగ్స్...

మరోవైపు..శిఖర్ ధావన్ నాయకత్వంలో ప్రస్తుత సీజన్ మొదటి రెండుమ్యాచ్ ల్లో కళ్లుచెదిరే విజయాలతో ఉరకలేస్తున్న పంజాబ్ జానీ బెయిర్ స్టో, లైమ్ లివింగ్ స్టోన్, కిగోస రబడ లాంటి కీలక స్టార్ ప్లేయర్లు లేకుండానే మొదటి రెండురౌండ్లలో నెగ్గుకు రావడం పంజాబ్ కు కొత్త శక్తిని ఇచ్చింది.

యువబ్యాటర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ, భానుక రాజపక్సలతో పాటు కెప్టెన్ కమ్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా రాణించడంతో పంజాబ్ బ్యాటింగ్ కుదురుకోగలిగింది.

బౌలింగ్ విభాగంలో పేస్ త్రయం అర్షదీప్ సింగ్, నేథన్ ఎల్లిస్, సామ్ కరెన్ పంజాబ్ కు ఆయువుపట్టుగా ఉన్నారు. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా సైతం పంజాబ్ అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్ర్రాలలో ఒకటిగా ఉన్నాడు.

హైస్కోరింగ్ సమరం...

ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3-30కి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 200కు పైగా పరుగులు సాధించడం ద్వారా భారీ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేయగలిగింది.

అయితే..ఈ రోజు జరిగే ప్రస్తుత సీజన్ రెండోమ్యాచ్ మాత్రం రాత్రి 7-30 మ్యాచ్ గా ప్రారంభంకానుంది. ఈమ్యాచ్ హైస్కోరింగ్ థ్రిల్లర్లా సాగే అవకాశం కనిపిస్తోంది.

చేజింగ్ కు దిగిన జట్టుకు ప్రత్యర్థి స్పిన్నర్ల నుంచి ముప్పు తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో ఆతిథ్య సన్ రైజర్స్ తీవ్రఒత్తిడి నడుమ హోంగ్రౌండ్లో తొలి నైట్ మ్యాచ్ పోరుకు దిగుతోంది. వరుస పరాజయాల ఊబి నుంచి బయటపడాలంటే..సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి తీరక తప్పదు. అయితే..పంజాబ్ ను ఓడించాలంటే హైదరాబాద్ సన్ రైజర్స్ సర్వశక్తులూ కూడదీసుకోడంతో పాటు స్థాయికి తగ్గట్టుగా రాణించాలి.

సన్ రైజర్స్ కు స్థానం బలం కలిసి వస్తుందా? లేక పంజాబ్ వరుసగా మూడో విజయంతో బల్లేబల్లే షోను కొనసాగిస్తుందా? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  9 April 2023 11:28 AM GMT
Next Story