Telugu Global
Sports

ప్రపంచకప్ లో స్పిన్నర్లే విన్నర్లు..దిగ్గజాల జోస్యం!

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో స్పిన్ బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తారని స్పిన్ దిగ్గజ జోడీ డేనియల్ వెట్టోరీ, ముత్తయ్య మురళీధరన్ జోస్యం చెప్పారు.

ప్రపంచకప్ లో స్పిన్నర్లే విన్నర్లు..దిగ్గజాల జోస్యం!
X

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో స్పిన్ బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తారని స్పిన్ దిగ్గజ జోడీ డేనియల్ వెట్టోరీ, ముత్తయ్య మురళీధరన్ జోస్యం చెప్పారు.

విలక్షణ క్రికెట్ వేదికలకు మరో పేరైన ఆస్ట్ర్రేలియా...ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్నకారణంగా పలు ఆసక్తికరమైన అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

సుదూర బౌండ్రీలైన్లు, అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ లు జరుగుతున్న కారణంగా స్పిన్ బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తారని...శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్, న్యూజిలాండ్ స్పిన్ గ్రేట్ డేనియల్ వెట్టోరీ జోస్యం చెప్పారు.

స్పిన్ బౌలర్లే కీలకం....

ప్రస్తుత ప్రపంచకప్ కు ఆస్ట్ర్రేలియాలోని మెల్బోర్న్, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్, హోబర్ట్, జిలాంగ్ తో సహా మొత్తం ఏడురకాల వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ స్టేడియాలలోని బౌండ్రీ లైన్లు సుదూరంగా ఉండడంతో పాటు అతిపెద్దవి కావడంతో భారీషాట్లు బాదటం, సికర్లు కొట్టడం అంతతేలిక కాదు.

బ్యాటర్లకు స్పిన్ ( ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, లెఫ్టామ్ స్పిన్ ) బౌలర్లను ఎదుర్కొనటం ఓ సవాలు లాంటిదే. సిక్సర్ షాట్లు కొట్టాలంటే బ్యాటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పదని, పైగా రిస్క్ తో కూడుకొన్న పనికూడానని వెట్టోరీ చెప్పారు.

వనిందు హసరంగ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఫింగర్ స్పిన్నర్లకు ఆస్ట్ర్రేలియాలోని బౌన్సీ పిచ్ లు అత్యంత అనువుగా ఉంటాయని, పైగా ప్రభావం చూపగలిగే సత్తా స్పిన్ బౌలర్లకే ఉంటుందని మురళీధరన్ అంటున్నారు.

టాప్ స్పిన్ తో వికెట్లే వికెట్లు...

విపరీతమైన బౌన్స్ తో కూడిన ఆస్ట్ర్రేలియన్ పిచ్ లపైన వికెట్లు పడగొట్టాలంటే టాప్ స్పిన్ ను మించిన ఆయుధం మరొకటిలేదని డేనియల్ వెట్టోరీ చెప్పారు. కంగారు ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రం టాప్ స్పిన్ మాత్రమేనని..టాప్ స్పిన్ ప్రధాన అస్త్రంగా చేసుకొని భారీగా వికెట్లు తీసిన రికార్డు లయన్ కు ఉందని వెట్టోరీ గుర్తు చేశాడు.

భారత ఉపఖండం, ఇంగ్లండ్, కరీబియన్ పిచ్ లతో పోల్చి చూస్తే...ఆస్ట్ర్రేలియాలోని వికెట్లు, పిచ్ లు భిన్నంగా ఉంటాయని, బౌన్స్ తో కూడిన కంగారూ పిచ్ లపైన నాణ్యమైన స్పిన్ బౌలర్లను ఎదుర్కొనడం సవాలుతో కూడినపనేనని ముత్తయ్య మురళీధరన్ విశ్లేషించారు.

ప్రధానంగా మణికట్టుతో మాయచేసే లెగ్ స్పిన్ -గుగ్లీ బౌలర్లు ఆస్ట్ర్రేలియా పిచ్ లపైన చెలరేగిపోయే అవకాశం ఉందని, హసరంగ అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్ గా అవతరిస్తాడని అన్నారు.

తన దృష్టిలో ఫింగర్ స్పిన్నర్ల కంటే రిష్ట్ స్పిన్నర్లకే వికెట్లు పడగొట్టే అవకాశం ఉందని మురళీధరన్ తేల్చి చెప్పారు.

అశ్విన్ కు వెట్టోరీ కితాబు..

తన అమ్ములపొదిలో పలురకాల విలక్షణ అస్త్ర్రాలు కలిగిన రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత ప్రపంచకప్ లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని కివీ స్పిన్ గ్రేట్ వెట్టోరీ చెప్పాడు.

ఆఫ్ బ్రేక్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్ ప్రధాన అస్త్రాలుగా ఉన్న అశ్విన్ చాలా తెలివైన బౌలర్ అని, బ్యాటర్ల బలహీనతల్ని సొమ్ము చేసుకోడంలో అశ్విన్ ను మించిన బౌలర్ మరొకరు లేరని వెట్టోరీ కితాబిచ్చాడు. భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే అశ్విన్ ఎంతో కీలకమని, ప్రతిమ్యాచ్ లోనూ తుదిజట్టులో అశ్విన్ ఉండితీరేలా చర్యలు తీసుకోవాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ కు సూచించాడు.

ప్రయోగాలకు చాన్స్- అశ్విన్...

ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్ర్రేలియా స్టేడియాలలోని సుదీర్ఘ బౌండ్రీ లైన్లు...స్పిన్ బౌలర్లకు ఆక్సిజన్ లాంటివని, ప్రయోగాలు చేయటానికి మంచి అవకాశమని అశ్విన్ చెప్పాడు. బ్యాటర్లు భారీషాట్లతో విరుచుకుపడతారన్న భయం ఉండదని, సిక్సర్ షాట్లకు వెళ్లి క్యాచ్ లకు చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. ఒక్కమాటలో చెప్పాలంటే...ఆస్ట్ర్రేలియాలోని ఫాస్ట్, బౌన్సీ వికెట్లు, సుదూర బౌండ్రీలైన్లు...స్పిన్ బౌలర్ల ప్రయోగాలకు లైసెన్సు ఇచ్చినట్లేనని అన్నాడు.

భారతజట్టులో ఫింగర్ స్పిన్నర్ గా అశ్విన్, రిష్ట్ స్పిన్నర్ గా యజువేంద్ర చహాల్, లెఫ్టామ్ స్పిన్నర్ గా అక్షర్ పటేల్ కీలకపాత్ర పోషించబోతున్నారు.

First Published:  21 Oct 2022 6:29 AM GMT
Next Story