Telugu Global
Sports

కట్టెలు మోసిన చేతులతో బంగారు పతకాలు!

ఆ పరంపరలో భాగంగానే మీరాబాయి చాను రూపంలో మరో మేటి లిఫ్టర్ ప్రపంచ విజేతగా, ఒలింపిక్స్ రజత రాణిగా, కామన్వెల్త్ గేమ్స్ బంగారు కొండగా వెలుగులోకి వచ్చింది.

కట్టెలు మోసిన చేతులతో బంగారు పతకాలు!
X

భారత క్రీడారంగంలో మణిపూర్ మణిపూస, భారత సూపర్ లిఫ్టర్ మీరాబాయి చాను సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. టోక్యో ఒలింపిక్స్ లో రజతం, బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టికలో మ‌న దేశానికి ఎనలేని గౌరవం సంపాదించి పెట్టింది. నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం అందించిన చాను.. ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన బర్మింగ్ హామ్ గేమ్స్ లో సైతం సరికొత్త రికార్డుతో మరో స్వర్ణపతకం అందించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పింది.



మణిపూర్ నుంచి ప్రపంచ స్థాయికి..

కండబలం, గుండెబలం దండిగా అవసరమైన వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో దేశానికి ఖ్యాతి తెచ్చిన మహిళామణులు ఎందరో ఉన్నారు. బరువులు ఎత్తే క్రీడలో పురుషులను మించిన భారత మహిళలను తలచుకోగానే.. తెలుగుతేజం కరణం మల్లీశ్వరి, కుంజరాణి దేవి లాంటి సూపర్ లిఫ్టర్లే గుర్తుకువస్తారు. భారత్ కు ఆణిముత్యాల లాంటి లిఫ్టర్లు, ఉక్కుమహిళలను అందించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు మణిపూర్ సైతం ముందు వరుసలో ఉంటుంది. ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ సంస్కృతిలో క్రీడలు సైతం ఓ ప్రధానభాగంగా ఉన్నాయి. డింకో సింగ్, మేరీ కోమ్, సరితా దేవి లాంటి అరుదైన బాక్సర్లు మాత్రమే కాదు.. తోయిబా సింగ్ లాంటి హాకీ దిగ్గజం, కుంజరాణి దేవి లాంటి ప్రపంచస్థాయి వెయిట్ లిఫ్టర్ ను, మహిళా సాకర్ ప్లేయర్లను అందించిన ఘనత మణిపూర్ రాష్ట్రానికి ఉన్నాయి. ఆ పరంపరలో భాగంగానే మీరాబాయి చాను రూపంలో మరో మేటి లిఫ్టర్ ప్రపంచ విజేతగా, ఒలింపిక్స్ రజత రాణిగా, కామన్వెల్త్ గేమ్స్ బంగారు కొండగా వెలుగులోకి వచ్చింది.



కుంజరాణి వారసురాలు మీరాబాయి చాను

1980 దశకంలో భారత మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో స్టార్ లిఫ్టర్ గా ఉన్న కుంజరాణి దేవికి 48 కిలోల విభాగంలో 1990 బీజింగ్, 1994 హిరోషిమా ఆసియాక్రీడల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు కాంస్య పతకాలు అందించిన ఘనత ఉంది. 2005 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలతో కుంజరాణి ప్రస్థానం ముగిసిపోయింది. ఆ తర్వాత మణిపూర్ నుంచి అంతర్జాతీయిస్థాయికి ఎదిగిన మరో లిఫ్టర్ మీరాబాయి చాను మాత్రమే.

ఆర్చర్ కాబోయి..

26 సంవత్సరాల సైకోమ్ మీరాబాయి చాను విలు విద్యలో మేటి క్రీడాకారిణి కాబోయి అయిష్టంగానే వెయిట్ లిఫ్టింగ్ క్రీడవైపు మొగ్గు చూపింది. ఇంపాల్ లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ చిరుద్యోగి కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయి.. చిన్ననాటి నుంచే తీవ్రంగా శ్రమించడం అలవాటు చేసుకొంది. ఎనిమిది మంది సభ్యుల తన కుటుంబానికి అవసరమైన వంటచెరకు కోసం పొరుగునే ఉన్న అడవికి వెళ్లి 20 కిలోమీటర్ల దూరం నుంచి మోపులు మోసుకొంటూ రావడం ద్వారా శారీరక పటుత్వాన్ని, శక్తిసామర్థ్యాలను మెరుగుపరచుకొంది. ఆ అనుభవమే వెయిట్ లిఫ్టర్ గా రాణించడానికి ఎంతగానో ఉపయోగపడింది.



బంగారు బోణీ..

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి శిక్షణ ప్రారంభించిన ఏడాదికాలంలోనే తొలి బంగారు పతకం గెలుచుకొంది. 2009 జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల యువజన విభాగంలో విజేతగా నిలిచిన మీరాబాయి కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో 170 కిలోల బరువు ఎత్తే స్థితికి ఎదిగింది. గ్లాస్గో వేదికగా 2014లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో మీరాబాయి రజత పతకం సాధించడమే కాదు.. 2016 రియో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించింది. క్లీన్ అండ్ జెర్క్, స్నాచ్ విభాగాలలో మొత్తం 192 కిలోల బరువెత్తడం ద్వారా కుంజరాణి దేవి పేరుతో ఉన్న 12 సంవత్సరాల జాతీయ రికార్డును మీరాబాయి అధిగమించడం ద్వారా చరిత్ర సృష్టించింది. అయితే.. రియో ఒలింపిక్స్ లో మాత్రం ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది.

2017 లో ప్రపంచ టైటిల్

2017లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మీరాబాయి బంగారు పతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్, థాయ్ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలతోపాటు ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్న మీరాబాయికి మిశ్రమ అనుభవాలే ఎదురయ్యాయి. 2018లో దేశఅత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను మీరాబాయి అందుకోవ‌డం ద్వారా మణిపూర్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. 2019 లో దోహా వేదికగా ముగిసిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో స్వర్ణ విజేతగా నిలిచిన మీరాబాయి తన పేరుతో ఉన్న జాతీయ రికార్డును తానే మెరుగుపరచుకుంటూ వచ్చింది.



కామన్వెల్త్ గేమ్స్ లో..

2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, 2022 బర్మింగ్ హామ్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించడం ద్వారా మీరాబాయి చాను అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగింది. వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణపతకాలు సాధించిన భారత తొలి మహిళా వెయిట్ లిఫ్టర్ గా నిలిచింది.

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ లో..

కొద్దిరోజుల క్రితమే ముగిసిన 2021 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల స్నాచ్ విభాగంలో 86 కిలోల బరువెత్తిన మీరాబాయి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 119 కిలోలతో కలుపుకొని మొత్తం 205 కిలోల రికార్డుతో కాంస్య పతకం అందుకొంది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత కూడా సంపాదించింది.



రజతంతో సంచలనం..

గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ తొలి రోజు పోటీలలో భాగంగా నిర్వహించిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన భారత మహిళగా, రజత పతకం నెగ్గిన తొలి మహిళగా మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి రెండుదశాబ్దాల క్రితం కాంస్యం సాధించగా.. ఇప్పుడు మీరాబాయి రజతంతో మెరిసి మురిసింది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో గత దశాబ్దకాలంగా నిలకడగా రాణిస్తున్న మీరాబాయి చాను మణిపూర్ లోని మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచింది.

First Published:  31 July 2022 4:03 AM GMT
Next Story