Telugu Global
Sports

ఆసియా క్రీడల్లో చైనా 'వీసా రాజకీయం'!

19వ ఆసియాక్రీడల ప్రారంభోత్సవానికి ముందే ఆతిథ్య చైనా వీసా రాజకీయం మొదలు పెట్టింది. ముగ్గురు భారత అథ్లెట్లకు ఆఖరు నిమిషంలో విసా నిరాకరించడంతో భారత క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఆసియా క్రీడల్లో చైనా వీసా రాజకీయం!
X

క్రీడలు వేరు, రాజకీయాలు వేరు అన్న స్ఫూర్తికి ఆసియాఖండ అగ్రదేశం చైనా మంగళం పలికింది. తనతో మిత్రత్వంలేని భారత్ లాంటి దేశాల అథ్లెట్లపై వీసా నిరాకరణ అస్త్రాలను ప్రయోగిస్తూ ఒలింపిక్ స్ఫూర్తినే అపహాస్యం చేస్తోంది.

క్రీడల ప్రారంభానికి ముందే..

చైనాలోని గాంగ్జు వేదికగా గతేడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన 19వ ఆసియా క్రీడల్ని కరోనా భయంతో ఏడాది పాటు వాయిదా వేశారు. 2023 సెప్టెంబర్ 23నుంచి ఈ క్రీడల్ని నిర్వహించడానికి చైనా ఒలింపిక్‌ సంఘం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఫుట్ బాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్ లాంటి టీమ్ గేమ్స్ లో ప్రారంభ రౌండ్ పోటీలు సైతం చకచకా సాగిపోతున్నాయి. అయితే.. ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద దేశం భారత్ 651 మంది సభ్యుల భారీ బృందంతో ఆసియాక్రీడల్లో పాల్గొనటానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వివిధ క్రీడలకు చెందిన చాలామంది అథ్లెట్లు గాంగ్జూ చేరుకున్నారు.

ముగ్గురు అథ్లెట్లకు వీసా నిరాకరణ..

ఆసియాక్రీడల్లో పాల్గొనటానికి ఎంపిక చేసిన భారత ఉషు జట్టులోని ముగ్గురు క్రీడాకారులకు చైనా ఒలింపిక్ సంఘం వీసాలు నిరాకరించినట్లు ప్రకటించింది. నీమాన్‌ వాంగ్ చుస ఓనీలు టెగా, మెపుంగ్ లామ్గూల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. జట్టులోని మిగిలిన 7 గురు సభ్యులతో పాటు శిక్షకులు, సహాయక సిబ్బందికి మాత్రం వీసాలు మంజూరు చేశారు. హాంకాంగ్ లో విడిది చేసిన భారత ఉషు జట్టు సభ్యులు హాంగ్జుకు చేరుకోగలిగారు. భారత జట్టులోని ముగ్గురు క్రీడాకారులకు వీసాలు నిరాకరించడం పట్ల భారత క్రీడామంత్రిత్వశాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

క్రీడలతోనూ, క్రీడాకారులతోనూ చైనా ప్రభుత్వం వీసా రాజకీయం చేయటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడల ప్రారంభ వేడుకలకు హాజరుకావాల్సిన భారత క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరసనగా తమ చైనా పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. చైనా ఒలింపిక్‌ సంఘం చర్యపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చైనాకు తగిన విధంగా బదులు చెబుతామని హెచ్చరించారు. చైనాకు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు భారత అథ్లెట్లకు వీసా నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆసియాక్రీడల నియమావళికి ఇది పూర్తిగా విరుద్ధమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ గేమ్స్..

హాంగ్జు వేదికగా జరిగే 19వ ఆసియా క్రీడల్ని సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ నిర్వహించనున్నారు. 45 దేశాలకు చెందిన 4వేలమందికి పైగా అథ్లెట్లు 38 రకాల క్రీడల పురుషుల, మహిళల విభాగాలలో తలపడబోతున్నారు. 2018 జకార్తా ఆసియాక్రీడల్లో 572 మంది అథ్లెట్ల బృందంతో పాల్గొన్న భారత్ ఈసారి రికార్డు స్థాయిలో 651 మంది సభ్యుల బృందంతో పోటీకి దిగుతోంది. భారత అథ్లెట్లు మొత్తం 38 క్రీడాంశాలలో పతకాల వేటకు దిగుతున్నారు. పురుషుల జావలిన్ త్రో, హాకీ, చెస్ టీమ్, వ్యక్తిగత అంశాలతో పాటు.. కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో సైతం భారత్ బంగారు పతకాలు గెలుచుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

*

First Published:  22 Sep 2023 11:44 AM GMT
Next Story