Telugu Global
Sports

ప్రపంచకప్ లో పాక్ కు సఫారీల 'షాక్'!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ వరుసగా నాలుగో ఓటమితో సెమీస్ బెర్త్ కు మరింత దూరమయ్యింది.

ప్రపంచకప్ లో పాక్ కు సఫారీల షాక్!
X

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ వరుసగా నాలుగో ఓటమితో సెమీస్ బెర్త్ కు మరింత దూరమయ్యింది. చెపాక్ థ్రిల్లర్ లో పాక్ పై దక్షిణాఫ్రికా విన్నర్ గా నిలిచింది...

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని అలరిస్తున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చి చేరింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ జట్ల నడుమ జరిగిన పోరు ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పట్టుగా, ఉత్కంఠతో సాగింది.

పాకిస్థాన్ కు స్పిన్నర్ షంషీ పగ్గాలు....

సెమీఫైనల్స్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ 6వ రౌండ్ పోరులో మాజీ చాంపియన్ పాకిస్థాన్ ముందుగా కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొంది.

కెప్టెన్ బాబర్ అజమ్, మిడిలార్డర్ బ్యాటర్లు సౌద్ షకీల్ హాఫ్ సెంచరీలు, షదాబ్ ఖాన్ 43, మహ్మద్ నవాజ్ 24 పరుగులు చేయడంతో పాక్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది.

సఫారీ బౌలర్లలో చైనామన్ బౌలర్ షంషీ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 4 వికెట్లు, కోయిట్జీ, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

సఫారీలను గట్టెక్కించిన మర్కరమ్...

మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 271 పరుగులు చేయాల్సిన పవర్ ఫుల్ దక్షిణాఫ్రికా..చెపాక్ స్లోపిచ్ పైన ధాటిగా ఆడలేకపోయింది. సూపర్ హిట్టర్లు క్వింటన్ డికాక్, డూసెన్ , క్లాసెన్ తమదైన శైలిలో బ్యాట్లు ఝళిపించ లేకపోయారు.

ప్రస్తుత ప్రపంచకప్ లో 3 శతకాలతో సహా 400 కు పైగా పరుగులు సాధించిన టాప్ స్కోరర్ క్వింటన్ డి కాక్ ను 24 పరుగుల స్కోరుకే పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ పెవీలియన్ దారి పట్టించగలిగాడు. డూసెన్ 21, క్లాసెన్ 12, మిల్లర్ 24, జాన్సన్ 20 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో జట్టు గెలుపు భారాన్ని మర్కరమ్ తన భుజాల పైన వేసుకొన్నాడు.

కేవలం 93 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 91 పరుగుల స్కోరుకు ఉసామా మీర్ బౌలింగ్ లో దొరికిపోయాడు. ఒకదశలో 250 పరుగులకే 8 వికెట్లు నష్టపోయిన సఫారీజట్టుకు ఓటమి తప్పని పరిస్థితి ఎదురయ్యింది.

పాక్ ను దెబ్బతీసిన అంపైర్ నిర్ణయం...

ఆట 46వ ఓవర్లోనే పాక్ విజయం సాధించి ఉండేది. అయితే ..అంపైర్ పొరపాటు నిర్ణయంతో దక్షిణాఫ్రికా వికెట్ తేడాతో విజేతగా నిలువగలిగింది. హారిస్ రవూఫ్ బౌలింగ్ లో సఫారీ లోయర్ ఆర్డర్ బ్యాటర్ కేశవ్ మహారాజ్ ఎల్బీడబ్లుగా అవుటైనట్లు బాల్ ట్రాకర్ లో తేలింది. అయితే..ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ గా ప్రకటించడంతో..దక్షిణాఫ్రికా 47.1 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగుల స్కోరుతో అనూహ్య విజయం సొంతం చేసుకోగలిగింది.

సఫారీ స్పిన్నర్ షంషీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

పాక్ పై సఫారీలకు ఇదే తొలి గెలుపు...

1999 తర్వాత నుంచి పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఐసీసీ ప్రపంచకప్ ( టీ-20, వన్డే ) టోర్నీలలో దక్షిణాఫ్రికాకు ఇదే తొలిగెలుపు కావడం విశేషం. అంతేకాదు..వన్డే ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగుమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూడడం కూడా పాక్ కు ఇదే మొదటిసారి.

పాకిస్థాన్ ప్రత్యర్థిగా సఫారీలకు అదే అత్యధిక చేజింగ్ విజయం.1998లో ఈస్ట్ లండన్ వేదికగా జరిగిన పోరులో 251 పరుగుల చేజింగ్ గెలుపు తరువాత ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రమే 271 పరుగుల విజయం సాధించగలిగింది.

ఇప్పటి వరకూ ఆడిన ఆరురౌండ్లలో దక్షిణాఫ్రికా 5 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో మెరుగైన రన్ రేట్ తో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిస్తే..పాకిస్థాన్ జట్టు ఆరురౌండ్లో వరుసగా నాలుగో ఓటమితో కేవలం 4 పాయింట్లతో 6వ స్థానానికి పడిపోయింది.

మిగిలిన 3 రౌండ్ల పోటీలలోనూ పాకిస్థాన్ భారీవిజయాలు సాధించగలిగితేనే సెమీస్ బెర్త్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది.

First Published:  28 Oct 2023 3:43 AM GMT
Next Story