Telugu Global
Sports

ఐసీసీ వైపు దాదా చూపు, శ్రీనివాసన్ కు కొత్తఊపిరి!

భారత క్రికెట్ బోర్డు వ్యవహారాలలో అవాంఛనీయ పరిణామాలకు అడ్డుకట్ట వేయటానికి వీలుగా జస్టిస్ లోథా రూపొందించిన నియమావళిలోని కీలక అంశాలకు సుప్రీంకోర్టే సడలింపు ఇవ్వడంతో పలు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

ఐసీసీ వైపు దాదా చూపు, శ్రీనివాసన్ కు కొత్తఊపిరి!
X

భారత క్రికెట్ బోర్డు వ్యవహారాలలో అవాంఛనీయ పరిణామాలకు అడ్డుకట్ట వేయటానికి వీలుగా జస్టిస్ లోథా రూపొందించిన నియమావళిలోని కీలక అంశాలకు సుప్రీంకోర్టే సడలింపు ఇవ్వడంతో పలు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

రంగం ఏదైనా వ్యవస్థ సక్రమంగా, పారదర్శకంగా సాగటానికి వీలుగా నియమనిబంధనలను ఏర్పాటు చేసుకోడం, వాటికి సడలింపులు, మినహాయింపులు ఇచ్చుకోడం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్ లో సాధారణ విషయమే. దానికి దేశఅత్యున్నత న్యాయస్థానం, భారత క్రికెట్ నియంత్రణమండలి ఏమాత్రం మినహాయింపు కాదని మరోసారి తేలిపోయింది.

జస్టిస్ లోథా నియమావళికి తిలోదకాలు!

భారత క్రికెట్ బోర్డు వ్యవహారాలను క్రికెట్ కు సంబంధించిన వ్యక్తులే నిర్వర్తించుకోవాలని, క్రికెట్ తో సంబంధంలేని రాజకీయ, వ్యాపారవేత్తల ప్రమేయం ఉండరాదన్న ఉద్దేశంతోనే..సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జస్టిస్ లోథా గతంలోనే ఓ నియమావళిని అందచేశారు.

బీసీసీఐ, దానికి అనుబంధంగా ఉన్న వివిధ రాష్ట్ర్రాల క్రికెట్ సంఘాలలో ఏకస్వామ్యధోరణులను రూపుమాపటం కోసం.. మూడు సంవత్సరాల కూలింగ్ ఆఫ్ పీరియడ్,

70 సంవత్సరాల పైబడిన వారికి క్రికెట్ పాలనలో చోటు లేదంటూ జస్టిస్ లోథా తమ నియమావళిద్వారా తేల్చి చెప్పారు.

దేశంలోని వివిధ క్రికెట్ సంఘాలలో అనురాగ్ ఠాకూర్, రాజీవ్ శుక్లా, శరద్ పవార్, జే షా లాంటి రాజకీయవర్గాలకు చెందినవారు, లలిత్ మోడీ, ఎన్ శ్రీనివాసన్ లాంటి వ్యాపారవేత్తలు చక్రం తిప్పుతూ వస్తున్నారు. అంతేకాదు...వివిధ క్రికెట్ సంఘాలలో కుటుంబపాలన, వారసత్వధోరణులు ప్రభలడంతో రాష్ట్ర్ర లేదా బీసీసీఐ కార్యవర్గాలలో రెండు దఫాలు సభ్యులుగా పనిచేసినవారు..ఆ తర్వాత మూడేళ్లపాటు పదవులకు దూరంగా ఉండితీరాలంటూ జస్టిస్ లోథా ప్రతిపాదించారు.

క్రికెట్ సంఘాలనే పట్టుకొని వేలాడే ఎన్ శ్రీనివాసన్ లాంటి కురువృధ్దులకు చెక్ పెట్టడానికి 70 సంవత్సరాల నిబంధనను సైతం ప్రవేశపెట్టారు.

అయితే...జస్టిస్ లోథా ప్రతిపాదించిన ఆ రెండు ప్రధాన నిబంధనలలో మార్పులు చేయడంతో పాటు మినహాయింపులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది.

ఇప్పటికే తమతమ క్రికెట్ సంఘాలతో పాటు బీసీసీఐలోనూ కీలక పదవులలో బాధ్యతలు నిర్వర్తించిన బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాల పదవీకాలం ఆనెలాఖరుతో ముగియనుంది.

గతంలో గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా జే షా (కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా కుమారుడు ), బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీలు..జస్టిస్ లోథా నియమావళి ప్రకారం తమతమ పదవులను వీడి..వచ్చే మూడేళ్లపాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ను పాటించాల్సి ఉంది.


బోర్డు వాదనలకు సుప్రీం ఓకే...

అయితే..ప్రస్తుత అధ్యక్షకార్యదర్శులు తమతమ పదవులలో కొనసాగడానికి వీలుగా..నియమావళిలో సడలింపు ఇవ్వాలని, సర్వసభ్యసమావేశంలో సవరణలు చేసుకోడానికి అనుమతించాలంటూ బీసీసీఐ..సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల పదవులను, బీసీసీఐ పదవులను ఒకే గాటన కట్టరాదని, రాష్ట్ర్ర సంఘాలలో రెండుపర్యాయాలు పనిచేసినవారు...బీసీసీఐ బాధ్యతలు నిర్వర్తించరాదనడం సహేతుకం కాదంటూ బోర్డు తరపు న్యాయవాది వాదించారు.

70 సంవత్సరాల వయసు పైబడిన వారు క్రికెట్ వ్యవహారాలలో పాలుపంచుకొంటే వచ్చిన నష్టం ఏమీలేదని..పైగా అపారఅనుభవం ఉన్న శ్రీనివాసన్ లాంటి నిపుణుల అవసరం ఇటు బీసీసీఐకి, అటు ఐసీసీకి ఉందంటూ మరో వాదనను వినిపించారు.

జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కొహ్లీలతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ ..బీసీసీఐ వాదనల పట్ల సానుకూలంగా స్పందించింది. క్రికెట్ వ్యవహారాలు సజావుగా, సమర్థవంతంగా సాగటానికి వీలుగా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

అంతేకాదు...రాష్ట్ర్రసంఘాలలో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లపాటు పదవులు చేపట్టిన తర్వాతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధన పాటించాలంటూ తమ తీర్పులో వెల్లడించింది.

దీంతో సౌరవ్ గంగూలీ, జే షా 2025 వరకూ బీసీసీఐ అధ్యక్షకార్యదర్శుల పదవులలో కొనసాగటానికి మార్గం సుగమయ్యింది.

ఐసీసీకి భారత ప్రతినిధి ఎవరు?

తన పదవీకాలం మరో మూడేళ్లపాటు ఉండడంతో...సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. గంగూలీ ఐసీసీ అధినేతగా బాధ్యతలు చేపడితే..బీసీసీఐ అధ్యక్షుడిగా ప్రస్తుత కార్యదర్శి జే షా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.

ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి..శశాంక్ మనోహర్ ,కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, సౌరవ్ గంగూలీ, శ్రీనివాసన్, రాజీవ్ శుక్లాలకు మాత్రమే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా ఉన్న బ్రిజేష్ పటేల్ కు సైతం సమర్థుడైన క్రికెట్ పాలకుడిగా పేరుంది.

త్వరలో జరిగే బీసీసీఐ ఎన్నికలలో శ్రీనివాసన్ తిరిగి ఎన్నికైతే...ఐసీసీ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు.

సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అంటూ బీసీసీఐ కార్యవర్గంలో మార్పులు చేర్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  15 Sep 2022 9:56 AM GMT
Next Story