Telugu Global
Sports

ఐసీసీకి సౌరవ్, బీసీసీఐకి బిన్నీ?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ) చైర్మన్ గా సౌరవ్ గంగూలీ, బీసీసీఐ చైర్మన్ గా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఐసీసీకి సౌరవ్, బీసీసీఐకి బిన్నీ?
X

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ) చైర్మన్ గా సౌరవ్ గంగూలీ, బీసీసీఐ చైర్మన్ గా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ నియామావళి ప్రకారం భారత మాజీ క్రికెటర్లకు మాత్రమే బీసీసీఐ అధ్యక్షపదవి చేపట్టే హక్కు, అవకాశం ఉన్నాయి...

ప్రపంచ క్రికెట్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ), ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి )

చైర్మన్ల స్థానాలను కొత్తవ్యక్తులు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐసీసీ చైర్మన్ గా ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ బీసీసీఐ అధ్యక్షుడుగా విధులు నిర్వహించిన సౌరవ్ గంగూలీ స్థానాన్ని మరో భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో భర్తీ చేయాలని బోర్డువర్గాలు భావిస్తున్నాయి.

క్రికెట్ ను క్రికెటర్లే నడుపుకోవాలి...

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, క్రికెట్ తో సంబంధంలేని రాజకీయ, వ్యాపారవర్గాల ప్రముఖుల జోక్యాన్ని, పెత్తనాన్ని అదుపు చేయటానికి గతంలోనే సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ రూపొందించిన నియమావళి ప్రకారం...క్రికెట్ వ్యవహారాలు, కార్యకలాపాలను క్రికెటర్లు మాత్రమే నడుపుకోవాలి. అంటే...బీసీసీఐ చైర్మన్ గా పనిచేసే హక్కు..భారత మాజీ క్రికెటర్లకు మాత్రమే ఉంటుంది. ఆ నిబంధనలకు అనుగుణంగానే గత రెండుసంవత్సరాలుగా బోర్డు చైర్మన్ గా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తూ వచ్చారు.

నిబంధనల్లో సడలింపు...

జస్టిస్ లోథాకమిటీ నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్ర్ర లేదా బీసీసీఐ కార్యవర్గంలో వరుసగా రెండు విడతలు పనిచేసిన వ్యక్తులు కొంతకాలం బోర్డు పదవులకు దూరంగా ఉండితీరాలి. ఆలెక్కన చూస్తే బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి, అధ్యక్షులుగా పనిచేస్తున్న జే షా, సౌరవ్ గంగూలీ గతంలోనే గుజరాత్ , బెంగాల్ క్రికెట్ సంఘాలకు వివిధ హోదాలలో సేవలు అందించారు. జస్టిస్ లోథా కమిటీ నియమావళి ప్రకారం గత నెలతోనే వారి పదవీకాలం ముగిసిపోయింది. అయితే..భారత క్రికెట్ సంఘం తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొన్న సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ..బీసీసీఐ విజ్ఞప్తిమేరకు నిబంధనలను సవరించింది.

బీసీసీఐ, వివిధ రాష్ట్ర్రాల సంఘాల పదవులను వేర్వేరుగా చూడాలని సూచించింది. ఫలితంగా సౌరవ్ గంగూలీ, జే షాల పదవీకాలం మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశం దక్కింది.

ఐసీసీ వైపు సౌరవ్ చూపు..

భారత క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిహోదాలో గత రెండేళ్లుగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ...ఐసీసీ వైపు ఆసక్తిచూపుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో భారత ప్రతినిధిగా సౌరవ్ గంగూలీని ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత ప్రతినిధికే ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండటంతో...దాదా ఐసీసీ చైర్మన్ కావడం తథ్యమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

సౌరవ్ గంగూలీ ఐసీసీ పదవిని చేపట్టే పక్షంలో బీసీసీఐ అధ్యక్షపదవికి భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ ఎంపిక చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. 1983 ప్రపంచకప్ విజేత భారతజట్టులో సభ్యుడుగా ఉన్న రోజర్ బిన్నీ...కర్నాటక క్రికెట్ సంఘం ప్రతినిధిగా ఈనెల మూడోవారంలో జరిగే బోర్డు సర్వసభ్యసమావేశంలో పాల్గోనున్నారు. కర్నాటక క్రికెట్ సంఘం కార్యదర్శి సంతోష్ మీనన్ కు బదులుగా రోజర్ బిన్నీ తమ ప్రతినిధిగా పంపడంతో..బోర్డు అధ్యక్షుడుగా రోజర్ బిన్నీ ఎంపిక ఖాయమని చెబుతున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నారు.

బోర్డు అధ్యక్ష పదవికోసం అక్టోబర్ 11, 12 తేదీలలో నామినేషన్ దాఖలు చేసుకొనే అవకాశం కల్పించారు. అక్టోబర్ 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 18న జరిగే బీసీసీఐ సర్వసభ్యసమావేశంలో కొత్తకార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నారు.

ఐసీసీకి సౌరవ్ గంగూలీ, బీసీసీఐకి రోజర్ బిన్నీ అన్న ప్రచారం బీసీసీఐ వర్గాలలో జోరుగా సాగుతోంది.

First Published:  8 Oct 2022 5:42 AM GMT
Next Story