Telugu Global
Sports

హైదరాబాద్ కు సిరాజ్ మేనియా!

నాలుగేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ వన్డేమ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ నగరం ప్రస్తుతం సిరాజ్ మేనియాతో ఊగిపోతోంది.

హైదరాబాద్ కు సిరాజ్ మేనియా!
X

నాలుగేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ వన్డేమ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ నగరం ప్రస్తుతం సిరాజ్ మేనియాతో ఊగిపోతోంది. మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ను హోంగ్రౌండ్ లో ఈరోజు ఆడనున్నాడు....

హైదరాబాద్ నగరాన్ని క్రికెట్ ఫీవర్ తాకింది. భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా తొలివన్డేకి ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలిచింది.

గతంలో పలు టీ-20 మ్యాచ్ లు నిర్వహిస్తూ వచ్చిన హైదరాబాద్ నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారిగా వన్డేమ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.

ప్రత్యేక ఆకర్షణగా మహ్మద్ సిరాజ్...

భారతజట్టులో సభ్యుడిగా మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా తొలి అంతర్జాతీయమ్యాచ్ ను ఈరోజు ఆడబోతున్నాడు.

2017 నుంచి భారతజట్టులో సభ్యుడిగా ఉన్న 26 సంవత్సరాల సిరాజ్ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలిపి 41మ్యాచ్ లు ఆడాడు. అయితే..సొంతగడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ఆరేళ్లపాటు, 41 మ్యాచ్ ల వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

శ్రీలంకతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో అత్యధికంగా 9 వికెట్లతో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన సిరాజ్..ప్రస్తుత భారత నంబర్ వన్ పేస్ బౌలర్ గా కొనసాగుతున్నాడు.

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ తొలివన్డేలో సిరాజ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కేవలం సిరాజ్ కోసమే భారీసంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు.

దారులన్నీ ఉప్పల్ వైపే.....

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం కెపాసిటీ 40వేలు కాగా..మొత్తం 39వేల112 మందికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. వివిధ తరగతులకు చెందిన మొత్త్తం 29వేల టికెట్లను ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే విక్రయించారు.

గతంలో 500 రూపాయలుగా ఉన్న గ్యాలరీ టికెట్ ధరను 850కి పెంచినా టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోడం విశేషం. మొత్తం 39వేలకు 29 వేల టికెట్లను అభిమానులకు అందుబాటులో ఉంచగా..9వేల టికెట్లను కాంప్లిమెంటరీలుగా ప్రభుత్వ, పోలీసు, రాజకీయ, క్రికెట్ వర్గాలకు, మీడియాకు పంచి పెట్టారు.

ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభంకానుంది.

2,500 మందితో పటిష్ఠ భద్రత

కాగా ఈ వన్డే మ్యాచ్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 2,500 మందితో భద్రత కల్పించారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తున్నారు.

‘మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు. మైదానంలోకి సెల్‌ఫోన్‌ మినహా మరేదీ అనుమతించబోమని, పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్న వారు మాత్రమే స్టేడియానికి రావాలని కోరారు. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్రాఫిక్‌ సమస్య రాకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టారు. మహిళల కోసం 40 మందితో ప్రత్యేకంగా షీ టీమ్‌లు ఏర్పాటు చేశారు.

మొత్తం మీద..నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహించాలని ఆతిథ్య హైదరాబాద్ క్రికెట్ సంఘం, విజయంతో సిరీస్ ను ప్రారంభించాలని భారతజట్టు కోరుకొంటున్నాయి.

First Published:  18 Jan 2023 7:49 AM GMT
Next Story