Telugu Global
Sports

విశాఖ టెస్టులో శుభ్ మన్ గిల్ ' దస్ కా ధమ్ ' శతకం!

భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ తీవ్రఒత్తిడి నడుమ సెంచరీ సాధించడం ద్వారా పలు అరుదైన ఘనతలు సొంతం చేసుకొన్నాడు.

విశాఖ టెస్టులో శుభ్ మన్ గిల్  దస్ కా ధమ్  శతకం!
X

భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ తీవ్రఒత్తిడి నడుమ సెంచరీ సాధించడం ద్వారా పలు అరుదైన ఘనతలు సొంతం చేసుకొన్నాడు. విశాఖ టెస్ట్ మూడోరోజుఆటలో గిల్ మెరిసి మురిశాడు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో గత 11 మాసాలుగా వెలవెలపోతూ వచ్చిన భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ తీవ్రఒత్తిడి నడుమ ఓ కీలక శతకంతో ఊపిరిపీల్చుకొన్నాడు.

విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండోటెస్ట్ మూడోరోజుఆట శుభ్ మన్ గిల్ షోగా మారింది.

ఒక్క సెంచరీతో రెండు రికార్డులు....

ప్రధానంగా టెస్టు క్రికెట్లో 24 సంవత్సరాల శుభ్ మన్ గిల్ భారతజట్టుకు గత 11 మాసాలుగా అలంకరణగా మారాడు. వరుస వైఫల్యాలతో విమర్శలు మాత్రమే కాదు.తీవ్రఒత్తిడిని సైతం ఎదుర్కొంటూ వచ్చాడు. జట్టులో తన స్థానం చేజార్చుకొనే పరిస్థితిని కొని తెచ్చుకొన్నాడు.

గత 11 ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించిన గిల్..విశాఖ టెస్టులో భాగంగా ఆడిన 12వ ఇన్నింగ్స్ లో కానీ మూడంకెల స్కోరు సాధించలేకపోయాడు.

బ్యాటింగ్ కు అంత అనుకూలంగా లేని విశాఖ పిచ్ పైన గిల్ చెమటోడ్చి పరుగులు సాధించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వన్ డౌన్ స్థానంలో తన మొట్టమొదటి టెస్టు శతకం నమోదు చేయగలిగాడు.

అప్పుడు పూజారా- ఇప్పుడు శుభ్ మన్...

భారత టెస్టుజట్టుకు దశాబ్దకాలం పాటు వన్ డౌన్ స్థానంలో అసమాన సేవలు అందించిన నయావాల్ చతేశ్వర్ పూజారా స్థానంలో శుభ్ మన్ గిల్ ను గత కొద్ది టెస్టులుగా భారత టీమ్ మేనేజ్ మెంట్ ఆడిస్తూ వచ్చింది. అయితే...గిల్ మాత్రం తనకు అలవాటైన ఓపెనింగ్ స్థానానికి బదులుగా వన్ డౌన్ లో కుదురుకోలేకపోయాడు.

కీలక వన్ డౌన్ స్థానంలో తన తొలిశతకం కోసం ఆరుటెస్టులు, 12 ఇన్నింగ్స్ పాటు పోరాడాల్సి వచ్చింది. కీలక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పై ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా గిల్ ..మాస్టర్ సచిన్, నయా మాస్టర్ విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.

తమ 24వ పుట్టిన రోజుకు ముందే 10 అంతర్జాతీయ శతకాలు బాదిన భారత మూడో క్రికెటర్ గా శుభ్ మన్ రికార్డుల్లో చేరాడు. గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ మాత్రమే తమ 24వ పుట్టిన రోజు జరుపుకోడానికి ముందే 10 శతకాల మైలురాయిని చేరుకోగలిగారు. గిల్ మొత్తం 147 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు, 11 ఫోర్లతో నిర్ణయాత్మక సెంచరీ నమోదు చేయగలిగాడు.

24వ పుట్టినరోజు నాటికే సచిన్ 30 శతకాలు, విరాట్ కొహ్లీ 21 శతకాలు సాధించగా..శుభ్ మన్ గిల్ 10 శతకాలతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

సచిన్ 273 ఇన్నింగ్స్ లో 30 సెంచరీలు, విరాట్ 163 ఇన్నింగ్స్ లో 21 సెంచరీలు బాదితే..శుభ్ మన్ గిల్ 99 ఇన్నింగ్స్ లోనే 10వ అంతర్జాతీయ శతకం సాధించగలిగాడు. సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రి 9 సెంచరీలు చొప్పున సాధించడం ద్వారా గిల్ తర్వాతి స్థానాలలో నిలిచారు.

టెస్టు లీగ్ లో శుభ్ మన్ రెండో శతకం..

ఐసీసీ టెస్టు లీగ్ చరిత్రలో అత్యధికంగా రోహిత్ శర్మ 5 సెంచరీలు నమోదు చేస్తే..విరాట్ కొహ్లీ 3 శతకాలతో రెండోస్థానంలో ఉన్నాడు, శుభ్ మన్ గిల్ రెండు సెంచరీలతో మూడో స్థానం సాధించాడు.

అంతేకాదు..2017 సిరీస్ తరువాత వన్ డౌన్ స్థానంలో టెస్ట్ శతకం బాదిన భారత రెండో క్రికెటర్ ఘనతను గిల్ దక్కించుకొన్నాడు. శ్రీలంకతో జరిగిన 2017 సిరీస్ లో పూజారా వన్ డౌన్ స్థానంలో శతకం బాదిన తరువాత..మరో వన్ డౌన్ సెంచరీ కోసం 2024 వరకూ వేచి చూడాల్సి వచ్చింది.

ఈ శతకంతో భారతటెస్టుజట్టులో శుభ్ మన్ గిల్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకొన్నట్లే.

First Published:  5 Feb 2024 3:44 AM GMT
Next Story