Telugu Global
Sports

అయ్యర్ అవుట్, సూర్యాకు టెస్ట్ క్యాప్?

మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరం కావడంతో..తుదిజట్టులోకి మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ ను తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయ్యర్ అవుట్, సూర్యాకు టెస్ట్ క్యాప్?
X

ఆస్ట్ర్రేలియాతో కీలక టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టిదెబ్బ తగిలింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరం కావడంతో..తుదిజట్టులోకి మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ ను తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి...

మితిమీరిన క్రికెట్ తో భారత కీలక ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాలతో జట్టుకు దూరమవుతున్నారు. గాయాలతో కీలకసమయంలో జట్టుకు దూరమైన ఆటగాళ్ల జాబితాలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం వచ్చి చేరాడు.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టుకు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. బంగ్లాతో సిరీస్ లో నిలకడగా రాణించిన అయ్యర్ వెన్నెముక గాయంతో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. అయ్యర్ పూర్తిగా కోలుకోడానికి మరో రెండువారాల సమయం పడుతుందని, అప్పటి వరకూ అందుబాటులో ఉండబోడని బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

భారత్ కు ఆదిలోనే...

భారతజట్టు టెస్టు లీగ్ ఫైనల్ చేరాలంటే..ఈనెల 9 నుంచి ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ లో సిరీస్ లో 2-0 లేదా 3-1తో నెగ్గితీరాల్సి ఉంది. ఇలాంటి కీలక తరుణంలో..అయ్యర్ లాంటి కుదురైన బ్యాటర్ జట్టుకు దూరం కావడంతో మిడిలార్డర్ బలహీనపడే అవకాశం ఉంది.

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు రోహిత్ శర్మ నాయకత్వంలో 16 మంది సభ్యుల జట్టును బీసీసీఐ కొద్దివారాల క్రితమే ప్రకటించింది.

రిషభ్ పంత్ కు బదులుగా వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ కు చోటు కల్పించింది. టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ ను సైతం టెస్టు జట్టులో చేర్చారు.

సూర్యాను ఊరిస్తున్న టెస్ట్ క్యాప్...

భారతజట్టులో చోటు కోసం దశాబ్దకాలం పాటు నిరీక్షించిన సూర్యకుమార్ కు 31 సంవత్సరాల వయసులో టీ-20 క్యాప్ దక్కింది. ఆ తర్వాత నుంచి సూర్య చెలరేగి ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా గుర్తింపు సంపాదించడంతో ...ఎదురుచూడ కుండానే వన్డే, టెస్టుజట్లలో సైతం చోటు దక్కింది. ఇప్పటికే భారత్ తరపున టీ-20, వన్డే మ్యాచ్ లు ఆడేసిన సూర్యా టెస్టు తుదిజట్టులో తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు.

మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోడంతో..సూర్యాకు చోటు కల్పించే ఆలోచనలో టీమ్ మేనేజ్ మెంట్ ఉంది. కంగారూ స్టార్ స్పిన్నర్ నేథన్ లయన్ ను దీటుగా ఎదుర్కొనాలంటే సూర్యాను మించిన బ్యాటర్ మరొకరు మిడిలార్డర్లో లేకపోడంతో కోచ్ ద్రావిడ్ ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. మరోవైపు..యువఓపెనర్ శుభ్ మన్ గిల్ ను సైతం మిడిలార్డర్లో అయ్యర్ స్థానంలో ఆడించే అవకాశం లేకపోలేదు.

సూర్య లేదా శుభ్ మన్ గిల్ లలో ఎవరో ఒకరు తుదిజట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 32 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్ ముంబై తరపున ఇటీవలే ఆడిన రంజీమ్యాచ్ ల్లో రెండుసార్లు 90 చొప్పున స్కోర్లు సాధించాడు.

కొత్తబంతిని ఎదుర్కొనాలంటే శుభ్ మన్ గిల్, స్పిన్ బౌలర్లను నిలువరించాలంటే సూర్యకుమార్ అన్న చర్చ జరుగుతోంది.

ఆల్ రౌండర్ జడేజా రెడీ...

కాలినరం గాయంతో గత ఆరుమాసాలుగా భారతజట్టుకు దూరమైన స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి అందుబాటులోకి వచ్చాడు.

తమిళనాడుతో ఇటీవలే ముగిసిన రంజీమ్యాచ్ లో జడేజా ఓ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టడం ద్వారా తన మ్యాచ్ ఫిట్ నెస్ ను నిరూపించుకొన్నాడు.

నాగపూర్ వేదికగా ఈనెల 9 నుంచి జరిగే తొలిటెస్టు తుదిజట్టులో జడేజా తన చోటును ఖాయం చేసుకొన్నాడు.

భారత టెస్టు టాపార్డర్లో రోహిత్-రాహుల్ , వన్ డౌన్లో పూజారా, రెండో డౌన్లో విరాట్ కొహ్లీ బ్యాటింగ్ కు దిగనున్నారు. 5వ నంబర్ స్థానం కీలకం కావడంతో శుభ్ మన్ గిల్ లేదా సూర్యకుమార్ యాదవ్ ను తుదిజట్టులోకి తీసుకోనున్నారు.

ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా గాయం నుంచి తేరుకొన్నా...మ్యాచ్ ఫిట్ నెస్ లేకుండానే నేరుగా పోటీకి దిగే అవకాశం ఉంది.

First Published:  1 Feb 2023 9:18 AM GMT
Next Story