Telugu Global
Sports

రోహిత్, విరాట్ మరో ప్రపంచకప్ ఆడాల్సిందేనా?

భారత క్రికెట్ కు గత 15 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అసమాన సేవలు అందించిన ఇద్దరు మొనగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల ప్రపంచకప్ భవితవ్యంపై రసవత్తరమైన చర్చే జరుగుతోంది.

రోహిత్, విరాట్ మరో ప్రపంచకప్ ఆడాల్సిందేనా?
X

భారత క్రికెట్ కు గత 15 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అసమాన సేవలు అందించిన ఇద్దరు మొనగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల ప్రపంచకప్ భవితవ్యంపై రసవత్తరమైన చర్చే జరుగుతోంది.

భారత్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ తో 36 ఏళ్ల రోహిత్ శర్మ, 35 సంవత్సరాల విరాట్ కొహ్లీల ప్రపంచకప్ ప్రయాణం ముగిసినట్లేనని

అందరూ భావించారు. అయితే..యువఆటగాళ్లను మించి ఈ ఇద్దరూ రాణించడం ద్వారా తమ సత్తా చాటుకొన్నారు.

రోహిత్ హోరు- విరాట్ జోరు....

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచి టైటిల్ సమరం వరకూ భారత్ ఆడిన మొత్తం 11 మ్యాచ్ ల్లోనూ విరాట్ కొహ్లీ మూడు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో సహా 765 పరుగులు సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డు అందుకొన్నాడు.

ఇక..పవర్ ప్లే కింగ్ కమ్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా వీరవిహారమే చేశాడు. మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు , సిక్సర్లు బాదిన బ్యాటర్ గా, 2023 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. ఓ సెంచరీ, 5హాఫ్ సెంచరీలతో సహా 597 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో బ్యాటర్ గా విరాట్ తర్వాతిస్థానంలో నిలిచాడు.

54.27 సగటు, 125.94 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్ లో ఏకంగా 31 సిక్సర్లు బాదడం ద్వారా నంబర్ వన్ సిక్సర్ హిట్టర్ గా రికార్డు నెలకొల్పాడు.

వ్యక్తిగత రికార్డులను పణంగా పెట్టి జట్టు ప్రయోజనాల కోసమే ఆడిన భారత కెప్టెన్ గా రోహిత్ ప్రశంసలు అందుకొన్నాడు. జట్టును ముందుండి నడిపించిన నాయకుడుగా గుర్తుంపు పొందాడు. 2023 వన్డే ప్రపంచకప్ తో రోహిత్, విరాట్ ల ప్రపంచకప్ టోర్నీల చరిత్ర ముగిసినట్లేనని అందరూ భావించారు.

ఈ ఇద్దరూ లేకుండా ఎలా...?

అయితే...2027లో జరిగే వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 30 సంవత్సరాలు, విరాట్ వయసు 29 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ ఇద్దరినీ పక్కనపెట్టి నవతరం ఆటగాళ్లకు చోటు కల్పించాలంటూ వాదన మొదలయ్యింది.

వన్డే ప్రపంచకప్ సంగతి అటుంచి..మరో 8 మాసాలలో వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024 టీ-20 ప్రపంచకప్ లో భారత్ తరపున రోహిత్, విరాట్ ఆడితీరాల్సిందేనని పలువురు దిగ్గజ క్రికెటర్లు చెబుతున్నారు.

అపారఅనుభవానికి తోడు అసాధారణ ప్రతిభ కలిగిన ఈ ఇద్దరూ లేకుండా భారత్ అసలు టీ-20 ప్రపంచకప్ ఎలా ఆడుతుందని ప్రశ్నిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ లో రోహిత్, విరాట్ ల ఆటతీరును చూసిన ఏ ఒక్కరైనా ఈ ఇద్దరినీ పక్కన పెట్లాలని అనుకోరని గుజరాత్ టైటాన్స్ చీఫ్ కోచ్ అశీశ్ నెహ్రా చెప్పారు.

క్రికెట్ వ్యాఖ్యాత, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ సైతం విరాట్ , రోహిత్ లు లేకుండా భారతజట్టు వచ్చే టీ-20 ప్రపంచకప్ బరిలోకి ఎలా దిగుతుందని అంటున్నారు.

యువఆటగాళ్లకు అవకాశాలు కల్పించాల్సిందే...అయితే రోహిత్, విరాట్ లాంటి అపారఅనుభవం కలిగిన ఇద్దరు లేదా ముగ్గురు జట్టులో ఉండితీరాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యమిస్తూ..సూపర్ ఫిట్ క్రికెటర్ గా పేరుపొందిన విరాట్ కు ఎలాంటి సమస్యా లేదు. రోహిత్ శర్మ సైతం ఫిట్ నెస్ పైన దృష్టి పెడితేనే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

ఏదిఏమైనా..2024 ఐపీఎల్ సీజన్లో ముంబై తరపున రోహిత్ శర్మ, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున విరాట్ కొహ్లీ ఏస్థాయిలో రాణించగలరన్నదే..ఈ ఇద్దరి టీ-20 ప్రపంచకప్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

First Published:  29 Nov 2023 3:26 AM GMT
Next Story